ఉండవల్లి అమరావతి టూర్.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్

నిత్యం వార్త‌లో నిలుస్తూ.. సంచల‌నాల‌కు మారు పేరుగా నిలిచే మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ మ‌రోసారి అంద‌రికీ షాక్ ఇచ్చారు. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్‌లో ఉన్న అతి కొద్ది మంది నేత‌ల్లో ఆయన‌కూడా ఒక‌రు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంటే.. ఒంటికాలిపై లేస్తూ ఎప్పుడూ విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న వైసీపీలో చేరిపోతార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగిపోయింది. అలాంటి ఉండ‌వ‌ల్లి.. ఏపీ ప్ర‌భుత్వం నిర్మించిన తాత్కాలిక స‌చివాల‌యాన్ని సంద‌ర్శించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క‌మాన‌దు. అంతేకాదు.. ఇది బాగుంద‌ని ప్ర‌శంసించ‌డం కూడా ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

2014 ఎన్నిక‌ల త‌ర్వాత కాంగ్రెస్ ఏపీలో పూర్తిగా చ‌తికిల‌బ‌డిపోయింది. ఉండ‌వ‌ల్లి మాత్రం కాంగ్రెస్‌కు సంబంధించి ఎటువంటి కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొన‌డం లేదు. స‌రిక‌దా.. ఏ ఇత‌ర పార్టీలోనూ చేర‌కుండా రాజ‌కీయాల‌కు మాత్రం దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. అప్పుడ‌ప్పుడూ సీఎం చంద్ర‌బాబు విధానాలు, నిర్ణ‌యాలు, హామీల‌పై త‌న విమ‌ర్శ‌ల దాడి చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నిస్తానే తప్ప, వైసీపీ లో చేరే ఉద్దేశం లేదని నిత్యం చెప్పే ఉండవల్లి.. హఠాత్తుగా అమరావతి తాత్కాలిక అసెంబ్లీ లో ప్రత్యక్షం కావడం అందర్నీ ఆశ్చర్యప‌రిచారు. కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు, కొలనుకొండ శివాజీలతో కలిసి ఆయన అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చారు.

అసెంబ్లీ లాబీ లో కలియ దిరిగిన ఉండవల్లి.. వివిధ చాంబర్లని ఆసక్తిగా ప‌రిశీలించారు. ఇటీవల వర్షపు నీరు కురిసి వివాదం రేగిన ప్రతిపక్ష నేత జగన్ చాంబర్ ని ప‌రీక్షించారు. ఇటీవ‌ల కాంగ్రెస్ మాజీ ఎంపీ ల‌గడ‌పాటి రాజ‌గోపాల్‌, ఇత‌ర నేత‌లు కూడా అసెంబ్లీని ప‌రిశీలించారు. అయితే ఉండవల్లి గురించి తెలిసిన కొందరు మాత్రం `ఊరక రారు మహానుభావులు` అంటూ వెనుక సెటైర్లు వేస్తున్నారు. ఉండవల్లి తో పాటు ఉంటున్న మల్లాది విష్ణు వైసీపీ లో చేరడానికి రెడీ అయిపోయినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉండవల్లి అమరావతి టూర్ పొలిటికల్ సర్కిల్స్ లో ఇంటరెస్ట్ కలిగిస్తోంది.

`అసెంబ్లీ బాగుందంటే టీడీపీలోకి వెళ్తున్నాననంటారు.. అసెంబ్లీ బాగాలేదంటే వైసీపీలో చేరుతున్నానంటారు’ అని త అసెంబ్లీ ఎలా ఉందని ప్రశ్నించిన వ్య‌క్తికి త‌న‌దైన శైలిలో సమాధానమిచ్చారు.అసెంబ్లీని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని తెలిపారు. అసెంబ్లీ నిర్మాణం బాగుందని, వర్షపు నీరు వచ్చినంత మాత్రాన వివాదం చెయ్యాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేనని, 2019 ఎన్నికల్లో పోటీచేయనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మ‌రి ఈ ప‌రిణామాల‌న్నీ దేనికి సంకేతాలో వేచిచూడాల్సిందే!!