ఉంగ‌రాల రాంబాబు TJ రివ్యూ

టైటిల్‌: ఉంగ‌రాల రాంబాబు

నటీనటులు: సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆలీ , వెన్నెల కిషోర్ త‌దిత‌రులు

సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు

మ్యూజిక్: జిబ్రాన్

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వర రావు

నిర్మాత: పరుచూరి కిరీటి

దర్శకత్వం: క్రాంతి మాధవ్

సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ

రిలీజ్ డేట్‌: 15 సెప్టెంబ‌ర్‌, 2017

క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారిన సునీల్ ఒకే ఒక్క హిట్ కోసం మొఖం వాచిపోయి ఉన్నాడు. ఐదారు వ‌రుస ప్లాపులు ఇస్తోన్న సునీల్ చేసిన లేటెస్ట్ మూవీ ఉంగ‌రాల రాంబాబు. ఓనమాలు , మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మంచి సినిమాలు తీసిన క్రాంతి మాధవ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌రుచూరి కిరీటి నిర్మాత‌గా తెర‌కెక్కిన ఈ సినిమా చాలాసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్ట‌కేల‌కు ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

కథ :

ఉంగ‌రాల రాంబాబు (సునీల్‌)కు ఓ బాబా (పోసాని) చెప్పిన వ్యాపారం క‌లిసి రావ‌డంతో అత‌డినే గుడ్డిగా న‌మ్ముతుంటాడు. బాగా రిచ్ అయిన రాంబాబు ఆస్తి క్ర‌మ‌క్ర‌మంగా క‌రిగిపోతుంటుంది. అయితే ఆ బాబా కొన్ని ల‌క్ష‌ణాలు ఉన్న అమ్మాయిని చేసుకుంటే పోయిందంతా తిరిగి వ‌స్తుంద‌ని చెపుతాడు. అలాంటి లక్షణాలు వున్న సావిత్రి (మియాజార్జ్‌) అనే అమ్మాయి రాంబాబు ఆఫీస్‌లో మేనేజ‌ర్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఆమెను ప్రేమించిన రాంబాబు ఆమెను త‌న ప్రేమ‌లోకి దింపేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంటాడు. చివ‌ర‌కు రాంబాబు ప్రేమ‌లో ప‌డిన ఆమె త‌న తండ్రిని ఒప్పిస్తేనే మ‌నిద్ద‌రి పెళ్లి జ‌రుగుతుంద‌న్న కండీష‌న్ పెడుతుంది.

సావిత్రి తండ్రి (ప్ర‌కాష్‌రాజ్‌) ఓ క‌మ్యూనిస్ట్‌. త‌న కూతురికి వ‌చ్చే భ‌ర్త త‌న‌ను మించిన వాడిగా ఉండాల‌న్న‌దే అత‌డి కండీష‌న్‌. ఈ క్ర‌మంలోనే త‌న కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలంటే చాలా కండీష‌న్లు పెడ‌తాడు. ఎడ్డెం అంటే తెడ్డంలా ఉండే ఈ ఇద్ద‌రూ చివ‌ర‌కు మామా, అల్లుళ్లు అయ్యారా ? మ‌రి రాంబాబు ఈ క్ర‌మంలోనే ఎలాంటి ప‌రీక్ష‌లు ఎదుర్కొన్నాడు ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

TJ విశ్లేష‌ణ :

మాన‌వ‌త్వం, క‌మ్యూనిజం, ప్రేమ ఈ అంశాల‌ను మిక్స్ చేసి ద‌ర్శ‌కుడు ఈ క‌థ రాసుకున్నాడు. ఈ మూడు అంశాలు అంటే క‌థ‌లో చాలా సీరియ‌స్‌నెస్‌, డెప్త్ లైన్ ఉన్న క‌థ‌ను ఓ కామెడీ హీరో సునీల్‌తో చేయాల‌నుకోవ‌డ‌మే ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ తీసుకున్న ఓ పెద్ద సాహ‌స నిర్ణ‌యం. ఇక హీరో జాత‌కాల‌ను నమ్మ‌డం లాంటి సినిమాలు గ‌తంలో చాలా సినిమాల్లో చూసేశాం. కాబోయే అల్లుడికి మామ ప‌రీక్ష‌లు పెట్ట‌డం అన్న లైన్ కూడా పాత‌దే. ఇక ఇక్క‌డ ఉన్న కొత్త పాయింట్ మాన‌వ‌త్వం గొప్ప‌దా ? క‌మ్యూనిజం గొప్ప‌దా ? అన‌్న‌దే. ఈ లైన్‌లో ఇటీవ‌ల కాలంలో సినిమాలు రాలేదు.

ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్ ఒకే సినిమాలో ఒకే జాన‌ర్‌ను న‌డిపేందుకు క‌ష్టాలు ప‌డ‌తాడ‌ని అత‌డి గ‌త సినిమాలు చూస్తే అర్థ‌మ‌వుతోంది. అలాంటిది ఈ సినిమాలో ఏకంగా రెండు మూడు జానర్లు మిక్స్ చేశాడు. దీంతో అస‌లు క‌థ గ‌తి త‌ప్పేసి సినిమా రూటు మారిపోయింది. ప‌ర‌మ రొటీన్ స్టోరీని ఇంటెన్సిటీ ఉన్న ద‌ర్శ‌కుడు తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా డైలాగ్స్ చూస్తే అర్థ‌మ‌వుతుంది.

హీరో సునీల్‌కు ఈ పాత్ర కొట్టిన‌పిండే. ప్ర‌కాష్‌రాజ్‌తో అత‌డి కాంబినేష‌న్ బాగుంది. ఇక తమిళ, మళయాళ పరిశ్రమల్లో సినిమాలు చేస్తున్న మియా జార్జి, తన ఫస్ట్ తెలుగు సినిమా అయినా కూడా బాగానే నటించింది. బాదం బాబా గా పోసాని, చే గువేరాగా వెన్నెల కిషోర్ నవ్విస్తారు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…

ముందుగా ఈ సినిమాలో నిర్మాణ విలువ‌ల‌కు మంచి మార్కులు వేయాలి. సునీల్ వ‌రుస ప్లాపుల్లో ఉన్నా నిర్మాత ప‌రుచూరి కిరిటీ అత‌డిని న‌మ్మి బాగానే ఖ‌ర్చుపెట్టాడు. గిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు రాగానే మ‌ర్చిపోతాం. సుర్వేష్ మురారి ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాత పెట్టిన ఖర్చును తెరపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు.

క్రాంతి మాధ‌వ్ డైరెక్ష‌న్ క‌ట్స్ :

క్రాంతి మాధ‌వ్ గ‌తంలో ఒకే జాన‌ర్ తీసుకుని దానిని చాలా సెన్సిటివ్‌గా తెర‌కెక్కించాడు. ఈ సినిమా కోసం రెండు, మూడు జాన‌ర్లు మిక్సీలో వేసి తిప్ప‌డంతో క‌థ‌నం విష‌యంలో త‌డ‌బ‌డ్డాడు. సినిమాకు కీల‌క‌మైన సెకండాఫ్ బోరింగ్‌గా త‌యారైంది. సునీల్ రాత‌ను ఏ మాత్రం మార్చలేక‌పోయాడు. ఈ సినిమా చూస్తే ఓన‌మాలు, మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇదిరాని రోజు వంటి సెన్సిబుల్స్ ఉన్న సినిమాలు తీసిన ద‌ర్శ‌కుడు క్రాంతి మాధ‌వ్ ఇత‌డేనా అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. రియాలిటీకి దూరంగా, పాత క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌ను మ‌ళ్లీ రుద్దే ప్ర‌య‌త్నం చేశాడు. గ‌తంలో చూసిన సినిమాల్లోని సన్నివేశాలే మ‌న‌కు క‌న‌డ‌ప‌డ‌తాయి. సునీల్ నెక్ట్స్ టైం బెట‌ర్ ల‌క్.

ప్లస్ పాయింట్స్ (+) :

– సునీల్ యాక్టింగ్‌

– ప్రకాష్ రాజ్

– నిర్మాణ విలువ‌లు

మైనస్ పాయింట్స్ (-):

– రొటీన్ సీన్స్

– బోరింగ్ అండ్ సాగ‌దీత సీన్లు

– వేస్ట్ స్టోరీ

– వీక్ డైరెక్ష‌న్‌

– సెకండాఫ్‌

TJ ఫైన‌ల్ పంచ్‌: వీక్ రాంబాబు

TJ ఉంగ‌రాల రాంబాబు రేటింగ్‌: 2 / 5