న‌ల్గొండ బాధ్య‌త‌లు ఉత్త‌మ్‌కి.. ప‌ద‌వికి ఎస‌రేనా?

రాజ‌కీయాల్లో ఎవ‌రు మిత్రులో ఎవ‌రు శ‌త్రువులో చెప్ప‌డం క‌ష్టం. అయిన వాళ్లు.. నిన్న‌టి దాకా భుజం భుజం రాసుకుని తిరిగిన వాళ్లు కూడా అవకాశం వ‌స్తే.. ఎక్కేయ‌డానికి, ఏకేయ‌డానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇప్పుడు తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు కెప్టెన్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. ఈయ‌నపై గ‌తం కొంత కాలంగా స్థానిక నేత‌ల్లో చాలా మందికి ప‌డ‌డం లేదు. అటు పార్టీ ప‌రంగా కావొచ్చు, ఇటు వ్య‌క్తిగ‌త రాజ‌కీయ ప‌రంగానూ కావొచ్చు. ఉత్త‌మ్‌ను పీసీసీ ప‌ద‌వికి దూరం చేసి, ఆ సీటు కొట్టేయాల‌ని ఇప్ప‌టికే అనేక మంది నేత‌లు ఢిల్లీ స్థాయి నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే, ఉత్త‌మ్‌కి రాహుల్ ద‌గ్గ‌ర మంచి మార్కులుండ‌డంతో ఆయ‌న‌ను ఆ సీటు నుంచి త‌ప్పించ‌డం ఎవ‌రి త‌ర‌మూ కావ‌డంలేదు.

పోనీ, ఉత్త‌మ్ విఫ‌ల‌మ‌య్యాడ‌ని, నేత‌లు వ‌న్‌బైవ‌న్ టీఆర్ ఎస్ గూటికి చేరిపోతున్నార‌ని, ఫ‌లితంగా కాంగ్రెస్‌ను కాపాడాలంటే ఆయ‌నను రీప్లేస్ చేయాల‌ని చెబుదామా? అంటే కాంగ్రెస్ అధిష్టానానికి తెలియ‌నివేవీ కావు. కాబ‌ట్టి ఎవ‌రికి వారే ఎప్ప‌టిక‌ప్పుడే మౌనం వ‌హిస్తున్నారు. అయితే, అవ‌కాశం వ‌స్తే మాత్రం ఉత్త‌మ్‌ని సాగ‌నంపాల‌ని మాత్రం ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అంద‌ని మావి అందిన‌ట్టు.. ఇప్పుడు ఆ అవ‌కాశం వ‌చ్చింది టీ కాంగ్రెస్ నేత‌ల‌కు. అది కూడా కేసీఆర్ రూపంలో అందివ‌చ్చిన అవ‌కాశం. దీంతో ఈ ద‌ఫా ఎవ‌రి ప్ర‌మేయ‌మూ లేకుండానే ఉత్త‌మ్ స‌ర్వోత్త‌మంగా సీటును ఖాళీ చేసి చేతులు జోడించి న‌మ‌స్కారం పెట్టే స‌మ‌యం వ‌చ్చింద‌ని నేత‌లు మురిసిపోతున్నారు.

ఇటీవ‌ల రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో త‌న బ‌లం, పార్టీ బ‌లం నిరూపించుకునేందుకు కేసీఆర్ ఏదైనా ఉప ఎన్నిక‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌కు బ‌లం ఉన్న న‌ల్గొండ ఎంపీ స్థానాన్ని ఎంచుకున్నారు. ఇక్క‌డి నుంచి గెలిచిన గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డిని రాజీనామా చేయించి ఉప‌పోరుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఎన్నిక బాధ్య‌త‌ను కాంగ్రెస్ నేత‌లు ఉత్త‌మ్ పై పెట్టేలా రాష్ట్ర నేత‌లు చ‌క్రం తిప్పారు. దీంతో ఇప్పుడు ఉత్త‌మ్ అగ్ని ప‌రీక్ష ఎదుర్కొంటున్నారు. వాస్త‌వానికి 2014లో ఇక్క‌డ కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థిగా గుత్తా రెండు ల‌క్ష‌ల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ఆయ‌న టీఆర్ ఎస్ గూటికి చేరారు.

దీంతో కాంగ్రెస్ ఎంత‌మేర‌కు స‌క్సెస్ అవుతుంది? అనేది ఒక ప్ర‌శ్న‌.ఎలాగైనా ఈ ఉప పోరులో గెలిచి కాంగ్రెస్ స‌హా అన్ని విప‌క్షాల నోరు నొక్కాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. మ‌రి ఆయ‌న గ‌ట్టిగానే ఖ‌ర్చు కూడా పెట్టే సూచ‌న‌లు క‌న‌పిస్తున్నాయి. మ‌రి ఈ పోరులో ఉత్త‌మ్ ఏర‌క‌మైన వ్యూహంతో వెళ్తారు? కేసీఆర్‌ను చిత్తు చేయ‌గ‌ల సామ‌ర్థ్యం ఉందా? అంటే ప్ర‌స్తుతానికి పెద‌వి విరుపే క‌నిపిస్తోంది. దీనిని ఆధారం చేసుకునే కాంగ్రెస్ నేత‌లు ఉత్త‌మ్‌ను బ‌లి ప‌శువును చేయాల‌ని డిసైడ్ అయ్యారు. ఎన్నిక‌ల్లో ఎలాగూ గెలిచే ప‌రిస్థితి లేదు కాబ‌ట్టి ఉత్త‌మ్ ఖ‌చ్చితంగా నైతిక బాధ్య‌త వ‌హించి సీటు ఖాళీ చేస్తాడ‌ని, దానిని కొట్టేయాల‌ని కొంద‌రు భావిస్తున్నారు. ఏం జ‌రుగుతుందో చూడాలి.