కృష్ణాలో చంద్ర‌బాబుకు షాక్‌.. వల్లభనేని వంశీ నిర‌స‌న‌

ప్ర‌భుత్వంపై అధికార పార్టీ ఎమ్మెల్యే నిర‌స‌న‌కు దిగారు! భ‌ద్ర‌త పెంచాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరుతున్నా కనీసం ప‌ట్టించు కోక‌పోవ‌డంపై ఆందోళ‌న చెందుతున్నారు. ప్ర‌భుత్వం వ‌చ్చాక త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచే శారు. మూడేళ్లు స‌హ‌నంతో ఎద‌రుచూసిన ఆయ‌న.. ఇక నిర‌స‌న మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రభుత్వం త‌న‌కు క‌ల్పించిన గ‌న్‌మెన్ల‌ను స‌రెండ‌ర్ చేసి త‌న అసంతృప్తి, ఆవేద‌న‌ను ప్ర‌భుత్వానికి తెలియ‌జేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే, టీడీపీకి బాగా ప‌ట్టున్న కృష్ణాజిల్లాలో ఇలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన త‌న ఇద్ద‌రు గన్‌మెన్‌ను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. టు ప్లస్‌ టు గన్‌మెన్‌లు కావాలని ఎమ్మెల్యే వంశీ ప్రభుత్వాన్ని గ‌తంలో కోరారు. అయితే ఏపీ సర్కార్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తనకు అదనంగా సెక్యూరిటీ ఇవ్వనందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన తనకు కేటాయించిన గన్‌మెన్‌ను వెనక్కి తిప్పి పంపించివేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ ప్ర‌భుత్వ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

‘నా గన్‌మెన్‌కు కేవలం ఒక పిస్టల్‌ ఇచ్చారు. కనీసం కార్బన్‌ వెపన్‌ కూడా ఇవ్వలేదు. మూడున్నరేళ్ల నుంచి భద్రతను పెంచమని అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. నా లైసెన్స్‌డ్‌ ఆయుధాలు మూడింటిని రెన్యువల్‌ కోసం పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించా. కనీసం వాటిని కూడా తిరిగి ఇవ్వలేదు’ అని వివ‌రించారు. తనకు పోలీసు అధికారి సీతారామాంజ నేయులు నుంచి ప్రాణహాని ఉందని అనేక మంది పోలీసు ఉన్నతాధికారులకు తెలిపినా, తన భద్రతను పెంచలేద న్నారు. తనకు టూ ప్లస్ టూ గన్ మెన్లను ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నానన్నారు. మూడున్నరేళ్ల నుంచి తనను పట్టించుకోకుండా, తన భద్రతను పెంచలేద‌ని వంశీ అసంతృప్తి వ్య‌క్తంచేశారు. తమ ప్రభుత్వం వచ్చాక కూడా తనకు న్యాయం జరగలేదన్నారు.