రాధా.. జ‌గ‌న్‌ల బంధానికి బీట‌లు..

విజ‌య‌వాడ‌లో త‌న కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న వంగ‌వీటి వంశ వార‌సుడు వంగ‌వీటి రాధాకృష్ణ‌కి వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి బెడిసి కొట్టింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే రాజ‌కీయంగా వైసీపీకి కొంత‌కాలంగా త‌ట‌స్థంగా ఉంటూ వ‌స్తున్న రాధాని యువ నాయ‌క‌త్వం నుంచి జ‌గ‌న్ ఇటీవ‌ల త‌ప్పించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రాధా.. జ‌గ‌న్ పార్టీకి గుడ్ బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి తండ్రి రంగా నుంచి వ‌చ్చిన వార‌స‌త్వంతో కాంగ్రెస్‌లో త‌న కంటూ గుర్తింపు పొందిన రాధా.. వైఎస్ హ‌యాంలో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే, అనంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్ పంచ‌న చేరిన ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ నేత గద్దె రామ్మోహ‌న్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అప్ప‌టి నుంచి వైసీపీ కార్య‌క‌లాపాల్లో పెద్ద ఆస‌క్తి చూప‌ని రాధా.. ఎప్పుడు అవ‌కాశం వ‌స్తుందా.. ఎప్పుడు జంప్ చేద్దామా? అని ఎదురు చూస్తున్నాడు. దీనికి జ‌గ‌న్ కూడా కార‌ణ‌మేన‌ని విమ‌ర్శ‌లున్నాయి. టీడీపీ నుంచి రాధాపై ముప్పేట మాట‌ల యుద్ధం జ‌రిగిన‌ప్పుడు జ‌గ‌న్ ఏమాత్ర‌మూ స్పందించ‌లేదు. దీంతో రాధా త‌న దారి తాను చూసుకుందామ‌ని డిసైడ‌య్యాడు.

దీనికి అనుకూలంగా ప్ర‌స్తుతం జ‌న‌సేన పార్టీ రాధాకు ఆహ్వానం ప‌లికిన‌ట్టు స‌మాచారం. రాధా.. ప‌వ‌న్‌లు ఒకే సామాజిక వ‌ర్గం వారు కావ‌డంతో రాధా .. ఇక జ‌న‌సేన‌లోకి జంప్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదే జ‌రిగితే.. వైసీపీకి ఒకింత దెబ్బేన‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు ఇప్పుడు జ‌గ‌న్ పార్టీపై దృష్టి పెట్టార‌ని అంటున్నారు. ఎలాగూ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాధా ఔట్ అయితే, ఆ ఖాళీ ని పూర్తి చేసే నాయ‌కుడు వైసీపీలో లేక‌పోవ‌డం ఒక అవ‌కాశంగా క‌నిపిస్తుంటే.. ఇంక రాబోయే 2019 ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ పుంజుకునే ఛాన్స్ లేక‌పోవ‌డంతో మ‌ల్లాది పార్టీ మార‌డ‌మే మంచిద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. సో.. రాబోయే రెండు మూడు నెల‌ల్లోనే వీరు పార్టీ కండువాలు మార్చేసే ఛాన్స్ క‌నిపిస్తోంది. పాలిటిక్స్ అన్నాక ఏమైనా జ‌ర‌గొచ్చు.