ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య‌.. త‌న మార్క్ ఖాయం!

నెల్లూరుకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ దురంధ‌రుడు ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశం భార‌త్‌కి రెండో పౌరుడిగా, ఉప‌రాష్ట్ర‌ప‌తిగా బాధ్య‌తలు స్వీక‌రించారు. వెంక‌య్య గురించి ప్ర‌ధానంగా చాలా త‌క్కువ మందికి తెలిసిన విష‌యం.. ఆయ‌న రాజ‌కీయ అజాత శ‌త్రువు! అంతేకాదు, అన్ని పార్టీల నేత‌ల‌కూ ఆయ‌న ఆప్తుడు!! ఆద్యంతం అంత్య ప్రాస‌ల‌తో సాగే ఆయ‌న ప్ర‌సంగ ప్ర‌వాహాన్ని విని ఆస్వాదించ‌ని, ఆనందించ‌ని నేత‌లు తెలుగునాట లేరంటే అతిశ‌యోక్తే! మాతృభాష కాని హిందీలోనూ అనితరసాధ్యమైన మాటల తూగు.. పదాల విరుపుతో ఉత్తరాదివారినీ ఆకట్టుకున్న మాటల మాంత్రికుడు!!

బీజేపీ అగ్రనేతల పోస్టర్లు అతికించే స్థాయి నుంచి అదే పార్టీకి రెండుసార్లు అధ్యక్షుడైన రాజకీయ కృషీవలుడుగా ఆయ‌న పేరు సాధించారు. కేంద్ర మంత్రిగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అచ్చ తెలుగు బిడ్డ వెంకయ్య‌. నెల్లూరుజిల్లా చవటపాలెంలో పుట్టిపెరిగి.. విద్యార్థి నేతగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. దేశ రెండో అత్యున్నత పదవిని అధిష్ఠించే స్థాయికి ఎదిగిన వెంకయ్య ప్రస్థానంలో ఎన్నో మెరుపులు! మరెన్నో సవాళ్లు ఉన్నాయంటే ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌మాన‌దు. అడగకుండానే పలు పదవులు వరించి వచ్చినప్పుడు పొంగిపోకుండా.. సవాళ్లు ఎదురైనప్పుడు కుంగిపోకుండా నిబ్బరంగా నిలవడమే వెంకయ్యకు తెలిసిన విష‌యం అంటారు ఆయ‌నను బాగా అర్ధం చేసుకున్న యార్ల‌గ‌డ్డ ల‌క్ష్మీ ప్ర‌సాద్ వంటి వారు.

ఆరెస్సెస్‌ ప్రచారక్‌ బోగాది దుర్గాప్రసాద్‌ స్ఫూర్తితోనే వెంకయ్య సంఘ్‌ వైపు అడుగులు వేశారు. 1967లో ఏబీవీపీలో చేరారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేసేటప్పుడు వెంకయ్యకు మేధావుల‌తో పరిచయమైంది. రాజకీయ సభల్లో ఎలా మాట్లాడాలో, ఎలాంటి పదప్రయోగాలు చేస్తే ప్రజల హృదయాలను చూరగొనవచ్చో తనకు బోధించింది తెన్నేటి విశ్వనాథమేనని వెంకయ్య ఎప్పుడూ చెబుతారు. ఇక, ఎమర్జెన్సీ సమయంలో జైలు శిక్ష.. వెంకయ్య జీవితాన్ని మలుపుతిప్పిన మరో ఘట్టం. ఆ సమయంలో దాదాపు ఏడాదిన్నరపాటు ఆయన జైల్లో ఉన్నారు. గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం, చలసాని ప్రసాద్‌ తదితరులు జైల్లో ఆయన సహఖైదీలు. ఆ సమయంలో వారి జీవితానుభవాల నుంచి వెంకయ్య ఎంతో నేర్చుకున్నారు.

రాజ‌కీయ ప్ర‌స్థానం ఇలా.. మొద‌లైంది!
1978లో ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వెంక‌య్య తొలి ప్ర‌య‌త్నంలోనే ప్ర‌జా క్షేత్రంలో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1983లో మరోసారి ఉదయగిరి నుంచే పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. మూడోసారి ఆత్మకూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కర్ణాటక నుంచి మూడుసార్లు, రాజస్థాన్‌ నుంచి ఒకసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. దక్షిణాదిన బీజేపీకి ఎలాంటి పట్టూ లేని రోజుల నుంచీ పార్టీనే అంటిపెట్టుకుని ఉండి.. దక్షిణాదిన పార్టీకి వెన్నుద‌న్ను ఆయ‌నే అయ్యారు. 1993 నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. క్రమంగా పార్టీ జాతీయ అధ్యక్ష స్థాయికి ఎదిగారు. వాజ్‌పేయి హయాంలో ఆయనకు విద్యుత్‌ శాఖ, ఉపరితల రవాణా వంటి కీలక శాఖలు ఇస్తానన్నా వద్దని.. గ్రామీణాభివృద్ధి శాఖను పట్టుబట్టి తీసుకున్నారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు కీలక బిల్లులు ఆమోదం పొందడంలో ఆయన కృషి చాలా కీలకమైంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినప్పుడు.. ‘‘నేను చిన్నప్పుడే తల్లిని కోల్పోయాను. పార్టీనే తల్లిగా భావించి ఎదిగాను. నేనీ స్థాయికి చేరుకోవడానికి పార్టీయే కా రణం. ఉపరాష్ట్రపతిగా వెళ్తే తల్లిలాంటి పార్టీకి రాజీనామా చేయాల్సి వస్తుంది. పార్టీ వదిలి వెళ్లాంటే నాకు మనసు రావట్లేదు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. కాగా, వెంక‌య్య‌కు ఇప్పుడు రాజ్య‌స‌భ‌లో అంత ఆశాజ‌న‌క వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేద‌ని అంటారు విశ్లేష‌కులు.

నిర్మొహ‌మాటంగా, నిక్క‌చ్చిగా ఉండే వెంక‌య్యకు స‌భ‌ను న‌డిపించ‌డం చాలా క‌ష్ట‌మైన ప‌నేని చెబుతున్నారు. ఇక‌, ఆయ‌న త‌న మార్కుతో వ్య‌వ‌హ‌రించి గ‌తంలో ఉప‌రాష్ట్ర‌ప‌తిగా చేసిన డాక్ట‌ర్ సర్వే ప‌ల్లి రాధాకృష్ణ‌న్‌ను బీటౌట్ చేస్తార‌ని చెబుతున్న‌వాళ్లూ ఉన్నారు. ఏదేమైనా.. నిత్య కృషీవ‌లునికి గుర్తింపు త‌థ్యం అన్న నానుడి వెంక‌య్య విష‌యంలో నిజ‌మైంది! కంగ్రాట్స్‌.. వెంక‌య్య స‌ర్‌!!