మోడీ ప్ర‌స‌న్న కోసం వెంక‌య్య ఏదైనా చేస్తాడా..!

ప్ర‌ధాని మోడీ ప‌ర‌మ వీర విధేయులైన భ‌క్తుల్లో కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు ఎప్పుడూ అగ్ర స్థానంలోనే ఉంటారు. ఆయ‌న మెప్పు పొంద‌డానికి నిరంతరం, అహ‌ర్నిశ‌లు, ప‌గలురాత్రి అన్న తేడా లేకుండా శ్ర‌మిస్తూ ఉంటారు. సంద‌ర్భం దొరికిన ప్రతిసారీ మోడీని.. దేశ ప్ర‌జ‌ల‌ను కాపాడ‌టానికి వ‌చ్చి దైవ‌దూత‌గా అభివ‌ర్ణిస్తూ.. ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇందుకోసం సొంత రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తృణ‌ప్రాయంగా విడిచిపెట్టేస్తారు. హిందీని మ‌రోసారి ప్ర‌వేశ‌పెట్టే య‌త్నాల‌కు వెంక‌య్య జ‌త‌క‌లిశారు. మోడీని హీరో చేయ‌డం కోసం సొంత భాష‌ను గుజ‌రాత్ న‌డి వీధిలో తాక‌ట్టు పెట్టారు. త‌న మాతృభాష హిందీ అని చెప్ప‌డంతో తెలుగువారంతా అవాక్క‌వుతున్నారు.

రోమ్‌లో ఉన్న‌ప్పుడు రోమ‌న్‌గానే ఉండాలంటారు. దీనిని కేంద్ర‌మంత్రి వెంక‌య్య బాగా గుర్తుంచుకున్నారు. అందుకే ఏపీకి వ‌చ్చి తెలుగు భాష‌ను, తెలుగు కీర్తిని, తెలుగు ఔన్న‌త్యాన్ని, తెలుగువాడివేడీ, ద‌మ్ము, భాష.. ఇలా ఏ అంశంపైన అయినా అన‌ర్గ‌ళంగా, సుదీర్ఘంగా లెక్చ‌ర్ల మీద లెక్చ‌ర్లు ఇస్తూ ఉంటారు. తెలుగు గెడ్డ‌పై పుట్ట‌డం అదృష్ట‌మ‌ని ప‌దేప‌దే చెబుతూ ఉంటారు. కానీ ఢిల్లీ వీధుల్లో ఇప్పుడు అదే తెలుగును ఆయ‌న మరిచిపోయారు. హిందీ హ‌మారీ మాతృ భాషా హై హిందీ అనేశారు. హ‌మే ఇస్పే గ‌ర్వ్ క‌ర్నా చాహియే అంటూ గ‌ర్వ‌ప‌డిపోయారు! గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మానికి వెళ్లిన ఆయ‌న ఇలా వ్యాఖ్యానించారు.

దేశంలో కొన్ని చోట్ల హిందీకి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి క‌దా! బెంగ‌ళూరులో మెట్రో సైన్ బోర్డుల్లో హిందీ భాష‌ను పెట్ట‌డాన్ని అక్క‌డ చాలామంది వ్య‌తిరేకించారు. ఇక‌, త‌మిళ‌నాడులో అయితే హిందీ ఎవ్వ‌రూ మాట్లాడరు! ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకుని వెంక‌య్య హిందీ రాగం అందుకున్నారు. హిందీ మ‌న జాతీయ భాష అనీ, దీన్ని అంద‌రూ క‌చ్చితంగా నేర్చుకోవాల‌ని చెప్పారు. దేశం ఎద‌గాలంటే అంద‌రూ హిందీ నేర్చుకోవాల్సిందే అని ఉద్బోధించారు. దేశంలోని ఎక్కువ శాతం ప్ర‌జ‌లు మాట్లాడేది హిందీ మాత్ర‌మేన‌నీ, కానీ కొంత‌మందికి హిందీ అంటే చిన్న‌చూపు ఉంద‌ని వెంక‌య్య చెప్పారు.

ప్ర‌ధాని మోడీ సొంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్‌లో హిందీపై ఇన్ని లెక్చ‌ర్లు ఇచ్చింది.. మోడీ ప్ర‌స‌న్నం కోస‌మేనా అనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. దేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడుతున్నార‌ని వెంక‌య్య వాస్త‌వాల్ని విస్మ‌రిస్తే ఎలా? ప‌్ర‌శ్నిస్తున్నారు. ఉత్త‌రాది ఆధిప‌త్యానికి వెంక‌య్య మోక‌రిల్లి, మోడీని ప్ర‌స‌న్నం చేసుకునే ప్ర‌యాస‌లో భాగంగానే ఇలా మాట్లాడార‌ని చెబుతున్నారు. దేశంలోని అత్య‌ధికులు మాట్లాడేది తెలుగు, త‌మిళ భాష‌లు ఉంటాయని గుర్తుచేస్తు న్నారు. ద‌క్షిణాదిపై హిందీని మరోసారి రుద్దే ప్ర‌య‌త్నానికి వెంక‌య్య వ‌కాల్తా పుచ్చుకున్న‌ట్టుందని అంటున్నారు. మ‌రి వెంకయ్య త‌న స్వామి భ‌క్తిని వ‌దిలి తెలుగును ప‌ట్టించుకుంటే బాగుంటుంద‌ని సూచిస్తున్నారు.