బ్రాహ్మ‌ణి – జ‌య‌దేవ్ డీల్ ఇదే

ఏపీ సీఎం చంద్ర‌బాబు కోడ‌లు పొలిటిక‌ల్ ఎంట్రీపై గ‌త ఆరేడు నెల‌లుగా మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌న కోడ‌లిని ఎంపీగా పోటీ చేయిస్తార‌ని…ఇందుకోసం విజ‌య‌వాడ‌, గుంటూరు నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు ప‌రిశీలిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. నిన్న‌టి వ‌ర‌కు బ్రాహ్మ‌ణి విజ‌య‌వాడ నుంచి పోటీ చేస్తుంద‌ని కొంద‌రు అనుకున్నా…ఇప్పుడు ఈ సీటుపై బీజేపీ క‌న్నేయ‌డం.. పురందేశ్వ‌రి, కేంద్ర మంత్రి వెంక‌య్య కుమార్తె దీపా పేర్లు ఇక్క‌డ నుంచి విన‌ప‌డ‌డం, మ‌రోవైపు మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ సైతం టీడీపీలోకి వ‌చ్చి ఇక్క‌డ నుంచి ఎంపీగా పోటీ చేయాల‌నుకోవడం లాంటి అంశాలు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి.

ఈ క్ర‌మంలోనే బ్రాహ్మ‌ణి దృష్టి ఇప్పుడు గుంటూరు సీటుపై ప‌డిన‌ట్టు తెలుస్తోంది. చంద్ర‌బాబు సైతం బ్రాహ్మ‌ణిని గుంటూరు లోక్‌స‌భ సీటు నుంచే పోటీ చేయించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఇక్క‌డ టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త గ‌ల్లా జ‌య‌దేవ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి త‌ప్పుకుని త‌న సీటును బ్రాహ్మ‌ణికి ఇచ్చే అంశంపై చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయ‌న్న టాక్ గుంటూరు జిల్లాలోని టీడీపీ వ‌ర్గాల ద్వారా అత్యంత విశ్వ‌స‌నీయంగా తెలిసింది.

బ్రాహ్మ‌ణి కోసం సీటు వ‌దులుకుంటోన్న జ‌య‌దేవ్‌ను చంద్ర‌బాబు ఆయ‌న సొంత జిల్లా చిత్తూరులోని చంద్ర‌గిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాల‌ని భావించారు. అయితే జ‌య‌దేవ్ ఎంపీగా ఉండేందుకే ఇష్ట‌ప‌డ‌డంతో ఓ కండీష‌న్‌తో ఆయ‌న‌కు బాబు ఓకే చెప్పార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ్రాహ్మ‌ణిని గెలిపించే బాధ్య‌త‌ను బాబు జ‌య‌దేవ్‌పైనే పెట్టార‌ట‌. ఇందుకోసం ఆమెకు ప్రచారంలో సాయం చేయ‌డంతో పాటు, ఆర్థికంగాను కొంత సాయం చేయాల‌న్న‌దే ఆ కండీష‌న్‌.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో బాబు జ‌య‌దేవ్‌ను రాజ్య‌స‌భ‌కు పంపేలా ఒప్పందం కుదిరిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌లు ముందునుంచే బ్రాహ్మ‌ణి గుంటూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ప‌ర్య‌ట‌న‌లు స్టార్ట్ చేసి ప్ర‌చారం మొద‌లుపెడ‌తార‌ని తెలుస్తోంది. రాజ‌ధాని ఏరియాలో ఉన్న ఈ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌మ కుటుంబానికి చెందిన వారే ఎంపీగా ఉంటే పార్టీ ప‌రంగాను, ప్ర‌భుత్వ ప‌రంగాను చాలా యూజ్ అవుతుంద‌ని భావించిన చంద్ర‌బాబు బ్రాహ్మ‌ణినే రంగంలోకి దింపుతున్న‌ట్టు తెలుస్తోంది.