ఎన్నో ఆశ‌లతో సైకిల్ ఎక్కితే ఇప్పుడు ఈ పరిస్థితి

2019.. అధికార టీడీపీకి ఇది ఎంతో కీల‌కం కాబోతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని ఒక‌వైపు వైసీపీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోపక్క చుట్టూ స‌మ‌స్య‌లు, వివాదాలు, విమ‌ర్శలు! ఇవ‌న్నీ టీడీపీ అధినేత‌కు స‌వాళ్లు విసురు తున్నాయి. ఇంకా రెండేళ్ల కంటే త‌క్కువ స‌మ‌యం ఉన్నా.. ఇదంతా టీడీపీకి ముళ్ల బాటే కానుంది. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు లేన‌ట్టేన‌ని కేంద్రం స్పష్టంచేయ‌డంతో పాటు ఎన్నో ఆశ‌లు పెట్టుకుని టీడీపీలోకి వ‌చ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి చెల‌రేగుతోంది. ఈనేప‌థ్యంలో 2019 ఎన్నిక‌ల్లో టీడీపీలో పెను సంక్షోభం రావ‌డం ఖాయ‌మ‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. ఇదే జ‌రిగితే పార్టీలో చాలామంది జంప్ అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని విశ్లేషిస్తున్నారు.

`హోదా` ఇక ముగిసిన అధ్యాయం, ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకోక త‌ప్ప‌దు! రైల్వేజోన్ ఊసే లేదు! నిధులు విదిల్చింది అరకొర‌.. అభివృద్ధి అణువంతైనా లేదు! ఆదుకుంటుంద‌ని మిత్ర ప‌క్షంగా చేసుకుంటే.. షాక్‌ల మీద షాకులు ఇస్తూనే ఉంది. 2019 ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీచేస్తుందో లేదో తెలియ‌దు! ఇవ‌న్నింటికి తోడు నియోజ‌క‌వ‌ర్గాల పెంపుపై ఫిరాయింపు ఎమ్మెల్యేలు పెట్టుకున్న ఆశ‌లు పేక‌మేడ‌ల్లా కూలిపోయాయి! 2104 ఎన్నిక‌ల్లో ఎన్నో సానుకూల అంశాలతో బ‌రిలోకి దిగిన టీడీపీ.. 2019లో మాత్రం సంక్షోభాల‌తో ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి. మరోవైపు నియోజకవ వర్గాల్లో నేతలెవరైనా పనితీరు ఆధారంగానే వారికి సీట్ల కేటాయింపు ఉంటుందని చంద్రబాబు నాయుడు ఇటీవల చెబుతున్నారు.

పార్టీ మారిన వారైనా 2018లో జరిగే సీట్లు ఎంతవరకు దక్కుతాయన్నది ప్రశ్నార్ధకమే. దీంతో వారి రాజకీయ భవిష్యత్తు మీద నీలినీడలు కమ్ముకున్నాయి. టికెట్ ద‌క్క‌క‌పోవ‌తే అటు వైసీపీలోకి వెళ్లలేక‌,, ఇటు టీడీపీలో ఇమ‌డ‌లేక‌.. రెండింటికి చెడ్డ రేవ‌డిలా మార‌డం ఖాయం! ఇక ఇదే స‌మయంలో మిత్ర‌ప‌క్షం బీజేపీ వైఖ‌రి తీవ్రంగా క‌ల‌వ‌ర‌పెడు తోంది. అటు వైసీపీతో దోస్తీ క‌డుతూనే.. ఇటు టీడీపీకి నెమ్మ‌దిగా దూర‌మ‌వుతోంద‌నే అభిప్రాయం టీడీపీ నేత‌ల‌ను వెంటాడుతోంది. మ‌రి 2019 వ‌ర‌కూ టీడీపీ-బీజేపీ దోస్తీపై న‌మ్మ‌కం లేద‌ని విశ్లేష‌కులు వివరిస్తున్నారు. ఇక కాపు రిజ‌ర్వేష‌న్ల అంశం కూడా టీడీపీకి మైన‌స్‌గా మారింది.

ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌, మాదిగ‌ల మ‌హాస‌భ‌కు అడ్డుకోవ‌డం వంటి సంఘ‌ట‌న‌లు ఆయా వ‌ర్గాల్లో టీడీపీపై వ్య‌తిరేక‌త పెంచుతున్నాయి. దీంతోపాటు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధి ప‌నులు ఒక్క అడుగు కూడా ముందుకు క‌ద‌ల‌లేదు. ఇక ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అంత‌ర్గ‌త కుమ్ములాటలు కూడా పార్టీని ప్ర‌జ‌ల‌కు దూరం చేస్తున్నాయి. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే 2019 ఎన్నిక‌ల నాటిక పార్టీ నుంచి చాల ఆ మంది బ‌య‌ట‌కు వెళ్లిపోతార‌ని విశ్లేష‌కులు హెచ్చ‌రిస్తున్నారు. దీంతో ఇక టీడీపీలో పెను సంక్షోభం త‌ప్ప‌ద‌ని వివ‌రిస్తున్నారు. ముందుంది ముసళ్ల పండ‌గ అంటే ఇదేనేమో!!