రాముల‌మ్మ చివ‌రి చూపులు టీడీపీలోకా..!

వెట‌ర‌న్ హీరోయిన్ విజ‌య‌శాంతి ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ ఓ క్రాస్‌రోడ్‌లో ఉన్నారు. ప‌లు పార్టీలు మారి త‌ల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన రాముల‌మ్మ 2009 ఎన్నిక‌ల వేళ ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి ఆ పార్టీ నుంచి మెద‌క్ ఎంపీగా పోటీ చేసి చ‌చ్చీ చెడీ గెలిచారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కేసీఆర్‌తో గ్యాప్ రావ‌డంతో రాముల‌మ్మ కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వ‌డంతో ఆ పార్టీలో చేరి మెద‌క్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తెలంగాణ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మా దేవేంద‌ర్‌రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు.

ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయిన రాముల‌మ్మ త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే (శ‌శిక‌ళ వ‌ర్గం)కు మ‌ద్ద‌తు ఇచ్చి నానా హ‌డావిడి చేశారు. ఆ పార్టీ నుంచి ఆమె రాజ్య‌స‌భ‌కు వెళ‌తార‌న్న ఊహాగానాలు కూడా జోరుగా వ‌చ్చాయి. ఆ త‌ర్వాత శ‌శిక‌ళ జైలుకు వెళ్ల‌డంతో అక్క‌డ రాముల‌మ్మ పేరు ఎత్తేవారే లేకుండా పోయారు. ప్ర‌స్తుతం పొలిటిక‌ల్‌గా జంక్ష‌న్‌లో ఉండి ఎటు వెళ్లాలో తెలియని ఆయోమ‌యంలో ఉన్న రాముల‌మ్మ‌కు ఇప్పుడు ఓ కొత్త ఆప్ష‌న్ వ‌చ్చిన‌ట్టు టీ పాలిటిక్స్‌లో చ‌ర్చ‌లు విన‌వ‌స్తున్నాయి.

తెలంగాణ‌లో కొన ఊపిరితో ఉన్న తెలుగుదేశం పార్టీని బ‌తికించుకునేందుకు చంద్ర‌బాబుతో పాటు అక్క‌డ త‌మ్ముళ్లు నానా పాట్లు ప‌డుతున్నారు. దీంతో వారి దృష్టి రాముల‌మ్మ‌పై ప‌డిన‌ట్టు తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి రావ‌డం త‌ర్వాత సంగ‌తి క‌నీసం అసెంబ్లీలో అయినా ఉండాలంటే కొద్దో గొప్పో పేరున్న విజ‌య‌శాంతి లాంటి ఉద్య‌మ‌కారుల‌ను త‌మ‌పార్టీలో ఉండాల‌ని బ‌లంగా కోరుకుంటోంద‌ట‌.

ఇక టీటీడీపీలో బ‌ల‌మైన మ‌హిళా నేత‌ల కొర‌త కూడా ఉంది. ఈ క్ర‌మంలోనే రాముల‌మ్మ‌ను పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచనలో టీడీపీ నేత‌లు ఉన్నారని ప్ర‌చారం జ‌రుగుతోంది. రేవంత్‌రెడ్డితో పాటు కొంద‌రు టీడీపీ సీనియ‌ర్లు విజ‌య‌శాంతితో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు కూడా తెలుస్తోంది. మ‌రి విజ‌య‌శాంతి పొలిటిక‌ల్ యూ ట‌ర్న్ ఎలా ఉంటుందో చూడాలి.