2019 నాటికి బెజవాడ రాజకీయాల్లో పెను మార్పులు

ఏపీలో రాజ‌కీయంగా కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన కృష్ణా జిల్లా రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మార‌తాయో కూడా చెప్ప‌డం క‌ష్టం. ఇక విజ‌య‌వాడ‌లో అయితే ప్ర‌తి ఎన్నిక‌ల‌కు రాజ‌కీయ నాయ‌కులు జంపింగ్స్ చేస్తుంటారు. 2004లో టిక్కెట్టు రాలేద‌ని ప్ర‌స్తుత ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ టీడీపీలోకి జంప్ చేశారు. 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా ప్ర‌జారాజ్యంలోకి వెళ్లారు. ఇక 2009లో ప్ర‌జారాజ్యంలో ఉన్న కేశినేని 2014లో విజ‌య‌వాడ నుంచి టీడీపీ త‌ర‌పున ఎంపీగా పోటీ చేశారు. ప‌లుపార్టీలు మారిన జ‌లీల్‌ఖాన్ వెస్ట్ నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేశారు. ఇక వెస్ట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంప‌ల్లి శ్రీనివాస్ బీజేపీలో చేరి అక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

ఇలా విజ‌య‌వాడ‌లో ప్ర‌తి సాధార‌ణ ఎన్నిక‌ల‌కు రాజ‌కీయం రంగులు మారుతుంటుంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే 2019 ఎన్నిక‌ల‌కు కూడా విజ‌య‌వాడ రాజ‌కీయం మ‌రోసారి ఆస‌క్తిక‌రంగా రంగులు మారేందుకు రంగం అంతా సిద్ధ‌మైన‌ట్టు క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఏపీ, తెలంగాణలో జ‌రిగే సాధార‌ణ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీ అధినేత ప‌వ‌నే స్వ‌యంగా ఈ ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ‌కు వ‌చ్చే స‌రికి ప్ర‌స్తుతం సెంట్ర‌ల్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు జ‌న‌సేన‌లోకి వెళ్ల‌వ‌చ్చ‌న్న ఊహాగానాలు విజ‌య‌వాడ‌లో వినిపిస్తున్నాయి. టీడీపీలో మంత్రి ప‌ద‌వి ఆశించి భంగ‌ప‌డ్డ ఉమా పార్టీ అధిష్టానంపై చాలా గుర్రుగా ఉన్నారు. ఇక ఇదే టైంలో వైసీపీలో న‌గ‌ర అధ్య‌క్ష ప‌ద‌వి ఊడ‌డంతో ప్ర‌యారిటీ లేని వ్య‌క్తిగా ఉన్న వంగ‌వీటి రాధా చూపులు సైతం జ‌న‌సేన వైపే ఉన్నాయ‌ట‌.

రాధాకు ప‌వ‌న్‌కు మంచి స్నేహం ఉంది. గ‌తంలో ప‌వ‌న్ యువ‌రాజ్యంలో రాధా కీల‌కంగా ప‌నిచేశారు. ఇక ప్ర‌స్తుతం టీడీపీ, వైసీపీలో ఉన్న ఒక‌రిద్దరు కీల‌క వ్య‌క్తులు కూడా విజ‌య‌వాడ ఎంపీ సీటుపై క‌న్నేసి జ‌న‌సేన‌లోకి జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ట‌. ఏదేమైనా 2019 నాటికి విజ‌య‌వాడ రాజ‌కీయం రంగులు మారే సూచ‌న‌లు అయితే క‌నిపిస్తున్నాయి.