కాంగ్రెస్ నుంచి విజ‌య‌శాంతి జంప్‌….ఆ పార్టీలోకేనా…!

ప్ర‌ముఖ సినీ న‌టి, ప్ర‌స్తుత కాంగ్రెస్ నేత విజ‌య‌శాంతి మ‌ళ్లీ పార్టీ మారుతున్నారా ? ఆమె కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి, తెలంగాణ పాలిటిక్స్‌ను వ‌దిలేసి త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కీల‌కంగా మార‌బోతున్నారా ? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే స్ప‌ష్టం చేస్తున్నాయి. గ‌తంలో ప‌లు పార్టీలు మారిన విజ‌య‌శాంతి ఇప్పుడు ఏకంగా స్టేటే మారిపోతున్నారు. ప్ర‌త్యేక తెలంగాణ కోసం త‌ల్లి తెలంగాణ పార్టీ స్థాపించి త‌ర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసిన ఆమె ఆ పార్టీ నుంచి మెద‌క్ ఎంపీగా గెలిచారు. త‌ర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో విబేధాలు రావ‌డంతో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ ప్ర‌త్యేక తెలంగాణ ఇవ్వ‌డంతో ఆమె ఆ పార్టీలో చేరి మెద‌క్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్ర‌స్తుత డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మా దేవేంద‌ర్‌రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు.

2014 ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి విజ‌య‌శాంతి రాజ‌కీయంగా అస్స‌లు యాక్టివ్‌గా లేరు. ఇక తాజాగా కొద్ది రోజులుగా ఆమె త‌మిళ రాజ‌కీయాల‌పై కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నారు. జ‌య‌ల‌లిత మృతి త‌ర్వాత చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌ను క‌లిసిన ఆమె అప్ప‌టి నుంచి ఆ పార్టీకి బాగా ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఆర్‌కె.న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో సైతం ఆమె శ‌శిక‌ళ అక్క కొడుకు దిన‌క‌ర‌న్‌కు ప్ర‌చారం చేశారు. అయితే త‌ర్వాత ఆ ఎన్నిక ర‌ద్దైన సంగ‌తి తెలిసిందే.

ఇక తాజాగా ఆమె జైలు నుంచి రిలీజ్ అయిన అన్నాడీఎంకే డిప్యూటీ నేత టీటీవీ దినకరన్‌తో సమావేశం అయ్యారు. తనకు మద్దతు పలికేందుకు వచ్చిన ఎమ్మెల్యేలను పక్కనబెట్టి మరీ విజయశాంతికి దినకరన్‌ స్వాగతం పలికారు. దిన‌క‌ర‌న్‌తో భేటీ అయ్యాక విజ‌య‌శాంతి మీడియాతో మాట్లాడుతూ ఆయ‌న అన్నాడీఎంకే వ్య‌వ‌హారాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా చ‌క్క‌దిద్దుతార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని వ్యాఖ్యానించారు. దినకరన్‌కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఇక విజ‌య‌శాంతి నేడో రేపో తెలంగాణ‌లో త‌ట్టా బుట్టా స‌ర్దేసుకుని చెన్నైకు మకాం మార్చేయ‌నున్న‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక దిన‌క‌ర‌న్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించే ఎమ్మెల్యే సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముందుగా 22 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అండగా నిలబడగా, బుధవారం సాయంత్రానికి ఈ సంఖ్య 32కు పెరిగింది. ఈ సంఖ్య ఒక‌టి రెండు రోజుల్లోనే 50కు చేరుకోనుంద‌ని తెలుస్తోంది.