టీడీపీ మంత్రిని టార్గెట్ చేసిన బీజేపీ మంత్రి

ఏపీ రాజ‌కీయాల్లో ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ-టీడీపీ మ‌ధ్య మిత్ర బంధం తెగిపోయే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌..ప్ర‌ధాని మోదీతో భేటీ అనంత‌రం అటు బీజేపీ, ఇటు టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. అస‌లే హీట్ పెరిగిపోతున్న స‌మ‌యంలో కేబినెట్లోని బీజేపీ మంత్రి.. మ‌రో టీడీపీ మంత్రిని టార్గెట్ చేయ‌డం అగ్నికి ఆజ్యం పోసిన‌ట్లు మారింది. మ‌ద్యం అమ్మ‌కాల విష‌యంలో తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం ఇప్పుడు చర్చ‌నీయాంశ‌మైంది. కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉన్న ఆయ‌న‌.. ఒక్క‌సారిగా ఇలా విమ‌ర్శ‌లు గుప్పించ‌డం వెనుక ధైర్యం ఏమైఉంటుందోన‌నే చ‌ర్చ మొద‌లైంది.

ప్రతిపక్ష నేత జగన్‌ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి రాజకీయ మద్దతు ప్రకటించిన తర్వాత ఏపీలో రాజకీయ వాదోపవాదాలు పెరిగిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి తిరిగివచ్చిన త‌ర్వాత సీఎం చంద్ర‌బాబు కూడా జగన్‌పేరు, వైసీపీ పేరు ప్రస్తావించకుండా రాజకీయంగా అనాల్సినవన్నీ అనేశారు. దేశంలో అవినీతి పరులపై దాడులు పెరుగుతున్నాయి గనక ప్రధానిని ప్రసన్నం చేసుకోవడానికి జగన్‌ కలిశారన్నట్టు సీఎం మాట్లాడ్డం బీజేపీ నాయ‌కుల‌కు మింగుడుపడలేదు. సోము వీర్రాజు వంటివారు దీనిపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరో కొత్త వివాదం రెండు పార్టీల మధ్యనే గాక మంత్రివర్గ సభ్యుల మధ్యనే రాజుకోవడం విశేషం.

గోదావరి జిల్లాలకు చెందిన దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాల రావు విచ్చలవిడి మద్యం అమ్మకాలు బెల్టుషాపులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కొత్తగా మంత్రి పదవి తీసుకుని ఆ శాఖ బాధ్యతలు చేపట్టిన జవహర్‌కు ఇది ఇరకాటంగా మారింది. బెల్టుషాపులపై కఠిన వైఖరి అనుసరిస్తామని ఆయన చెప్పినా అసలు వాటిని ఎలా నడవనిస్తున్నారని మాణిక్యాలరావు నిలదీస్తున్నారు. ప్రతిపక్షాలు గాక ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రిగా ఉన్న వారే విమర్శలు చేస్తుంటే ఏం చెప్పాలో తోచని స్థితి జవహర్‌కు ఎదురవుతున్నదట. వాస్తవానికి ఇది బీజేపీ సొంత పునాది పెంచుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నమని కూడా మరో అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇద్దరు మంత్రుల వివాదం రసవత్తర రాజకీయాన్ని తలపిస్తోంది. మ‌రి ఈ ప‌రిణామాలు ఏ వివాదానికి దారి తీస్తాయో వేచిచూడాల్సిందే!