పశ్చిమగోదావరి టీడీపీ ఎమ్మెల్యేల గెలుపు ఓటముల పరిస్థితి

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పేరు చెపితే టీడీపీకి స్ట్రాంగ్ కంచుకోట అన్న విష‌యం ప్ర‌తి ఒక్క‌రి మ‌దిలో మెదులుతుంది. అస‌లు ఈ రోజు చంద్ర‌బాబు సీఎం పీఠం మీద ఉన్నారంటూ అందుకే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లానే కార‌ణం. గ‌త ఎన్నిక‌ల్లో జిల్లాలోని 15 ఎమ్మెల్యే సీట్ల‌తో పాటు 3 ఎంపీ స్థానాలు టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి జ‌రిగిన చాలా ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ క్లీన్‌స్వీప్ చేసింది. టీడీపీకి అంత కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లాలో ఇప్పుడు పార్టీ కోట బీట‌లు వారుతోందా ? అంటే అవున‌న్న ఆన్స‌ర్ జిల్లాలోని టీడీపీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జిల్లాలో టీడీపీ స‌గం సీట్లు గెలిస్తే గొప్పే అన్న‌ట్టుగా ప్ర‌స్తుత ప‌రిస్థితి ఉంది. జిల్లాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొన్నారు.

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే జిల్లాలోని ఉండి ఎమ్మెల్యే క‌లువ‌పూడి శివ‌, త‌ణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ‌, ప్ర‌భుత్వ విప్‌, దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, ఎక్సైజ్ శాఖా మంత్రి, కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్‌.జ‌వ‌హ‌ర్ మాత్ర‌మే మరోసారి గ్యారెంటీగా గెలుస్తార‌ని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. ప్ర‌భాక‌ర్‌కు కాంట్ర‌వ‌ర్సీ కింగ్ అన్న బిరుదు ఉన్నా అభివృద్ధి, ప్ర‌జ‌ల మ‌నిషిగా ఆయ‌న‌కు తిరుగులేదు. ఉండి ఎమ్మెల్యే శివ‌కు జిల్లాలోనే ఫ‌స్ట్ ర్యాంకు ఇవ్వొచ్చు. మూడోసారి ఆయ‌న ఎమ్మెల్యే పోస్టు రెన్యువ‌ల్ చేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక త‌ణుకు ఎమ్మెల్యే రాధా సౌమ్యుడిగా రాణిస్తూ, అభివృద్ధిలో దూసుకుపోతున్నాడు. జ‌వ‌హ‌ర్ అంద‌రికి అందుబాటులో ఉండ‌డంతో పాటు ఇటీవ‌ల మంత్రి అవ్వ‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌కు బ‌లంగా కొమ్ముకాసే వ‌ర్గం ఆయ‌న‌కు బలంగా మారాయి.

ఇక డెల్టాలోని పాల‌కొల్లు, న‌రసాపురం, భీమ‌వ‌రం ఎమ్మెల్యేలు వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు. వీరికి వ్య‌తిరేక‌త‌కు తోడు తుందుర్రు మెగా ఫుడ్ పార్క్ వ్య‌వ‌హారం, జ‌న‌సేన ప్ర‌భావం కూడా ఈ ముగ్గురి గెలుపోట‌ముల‌ను ప్ర‌భావితం చేయ‌నున్నాయి. ఇక కొత్త‌గా మంత్రి అయిన పితాని స‌త్య‌నారాయ‌ణ‌పై నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌తిరేక‌త చాలా ఎక్కువే ఉంది. గ‌త ఎన్నిక‌ల్లోనే స్వ‌ల్ప మెజార్టీతో భ‌య‌ట‌ప‌డ్డ పితాని ఈ సారి గెలుస్తార‌న్న గ్యారెంటీ లేదు.

ఇక ఎస్సీ, ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోల‌వ‌రం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్‌, మాజీ మంత్రి చింత‌ల‌పూడి ఎమ్మెల్యే పీత‌ల సుజాత‌, గోపాల‌పురం ఎమ్మెల్యే ముప్పిడి వెంక‌టేశ్వ‌ర‌రావు భారీ వ్య‌తిరేక‌త‌తో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ముగ్గురు క్యాడెంట్ల‌ను మారిస్తే త‌ప్ప లేక‌పోతే ఈ మూడు సీట్లు పోవ‌డం ఖాయ‌మ‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌లే ఒప్పుకుంటున్నారు. పీత‌ల‌, ముడియంపై ఆరోప‌ణ‌ల‌కు లెక్కేలేదు. ముప్పిడి మ‌రీ వీక్ అన్న టాక్ వ‌స్తోంది.

తాడేప‌ల్లిగూడెం నుంచి బీజేపీ కోటాలో మంత్రిగా ఉన్న పైడికొండ‌ల మాణిక్యాల‌రావుకు జ‌డ్పీచైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజుకు మ‌ధ్య జ‌రుగుత‌న్న ఆధిప‌త్య పోరు ఆయ‌న‌కు మైన‌స్ అయ్యింది. నిన్న‌టి వ‌ర‌కు కాంట్ర‌వ‌ర్సీల‌కు దూరంగా ఉన్న పైడికొండ‌ల సైతం ఇప్పుడు కాంట్ర‌వర్సీల్లో త‌ల‌దూర్చ‌డం, జ‌నసేన ఎంట్రీ ఆయ‌న‌కు మైన‌స్‌గా మారాయి.

ఏలూరు ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జికి సెటిల్‌మెంట్లు, ఇత‌ర రాజ‌కీయ వ్య‌వ‌హారాలు బిగ్ మైన‌స్ అయ్య‌యి. జిల్లా కేంద్రం కావ‌డంతో ఉద్యోగుల ఎఫెక్ట్ ఇక్క‌డ బాగా ఉంది. ఉంగుటూరు ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయుల ప‌నితీరు, ఇత‌ర‌త్రా అంశాలు బాగానే ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న కాపు వ‌ర్గం వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన వ‌స్తే ఎటు స‌పోర్ట్ చేస్తుంద‌న్న‌దానిపైనే ఆయన గెలుపోట‌ములు ఆధార‌ప‌డి ఉన్నాయి. నిడ‌ద‌వోలు ఎమ్మెల్యే జిల్లాలో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేల్లో ఒక‌రు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు బ‌దులుగా ఆయ‌న సోద‌రుడికి టిక్కెట్టు ఇస్తార‌న్న చ‌ర్చ‌లు జిల్లాలో వినిపిస్తున్నాయి. ఏదేమైనా ప్ర‌స్తుతం టీడీపీకి కంచుకోట లాంటి ఈ జిల్లాలో ఆ పార్టీ కోట‌కు బీట‌లు మొద‌ల‌య్యాయ‌న్న టాకే రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.