పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యేలు ఆ విషయంలో సక్సెస్

ఏపీలో టీడీపీ బ‌లంగా ఉన్న జిల్లాల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఒక‌టి. ఈ జిల్లాలో అన్ని సీట్లు టీడీపీ ఖాతాలోనే ఉన్నాయి. మంత్రి మాణిక్యాల‌రావు ఒక్క‌రే బీజేపీ నుంచి ఉన్నారు. టీడీపీ అంత కంచుకోట‌లా ఉన్న ఈ జిల్లాలో ఎమ్మెల్యేలంద‌రూ గ‌త కొద్ది రోజులుగా చంద్ర‌బాబుతో పాటు టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి ఎస్పీ భాస్క‌ర భూష‌ణ్ ప‌నితీరుపై ఎమ్మెల్యేలు కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు.

జిల్లాలో ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు పార్టీకి, ప్ర‌భుత్వానికి పెద్ద త‌ల‌నొప్పిగా మారాయి. సౌమ్యుడిగా పేరున్న త‌ణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఓ కేసు విష‌యంలో ఎస్.ఐను, రైట‌ర్‌ను త‌న ఆఫీస్‌కు పిలిపించుకుని నిర్బంధించార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ విష‌యంలో రెండు వ‌ర్గాల‌ది త‌ప్పు ఉంది. అయితే మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ మాత్రం ఎమ్మెల్యేకు యాంటీగా నివేదిక ఇవ్వ‌డంతో చంద్ర‌బాబు కాస్త సీరియ‌స్ అయ్యారు.

రాధాకృష్ణ త‌ప్పేం లేదంటూ జిల్లా ఎమ్మెల్యేలంద‌రూ త‌మ గ‌న్‌మెన్ల‌ను సైతం వెన‌క్కి పంపారు. ఈ ఇష్యూ పెద్ద క‌ల‌క‌ల‌మే రేపింది. త‌మ మాట‌ను పోలీసులు లెక్క చేయ‌క‌పోతే ఎమ్మెల్యేలుగా త‌మ‌కు ఆ ప‌ద‌వులు ఎందుక‌ని వారంతా తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఇక దెందులూరు ఎమ్మెల్యే, విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ హ‌త్య‌కు కొంద‌రు కుట్ర ప‌న్న‌డం కూడా సంచ‌ల‌న‌మైంది.

ఈ విష‌యంలో పోలీసులు స‌రిగా స్పందించ‌లేద‌ని చింత‌మ‌నేని తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక త‌ణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇష్యూను సైతం జ‌ఠిలం చేసింది ఎస్పీ భాస్క‌ర్ భూష‌ణే అని ఎమ్మెల్యేలు ఆగ్ర‌హంగా ఉన్నారు. దీంతో చివ‌ర‌కు ఎమ్మెల్యేలు చంద్ర‌బాబుపై ఎస్పీని బ‌దిలీ చేయాల‌ని తీవ్ర‌స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. తాజాగా చంద్ర‌బాబు ఎస్పీ భాస్క‌ర్ భూష‌ణ్‌ను బ‌దిలీ చేశారు. ఆయ‌న బ‌దులుగా కొత్త ఎస్పీ ర‌విప్ర‌కాష్ వ‌చ్చారు.

ఇక భాస్క‌ర్ భూష‌ణ్‌కు ఎక్క‌డా ప‌ద‌వి ఇవ్వ‌లేదు. ఆయ‌న్ను డీజీపీ ఆఫీస్‌లో రిపోర్టు చేశారు. ఇక ఎమ్మెల్యేల ఒత్తిడి మేర‌కే బాబు ఎస్పీని బ‌దిలీ చేసినా…సాధార‌ణ బ‌దిలీల్లో భాగంగానే చేసిన‌ట్టు క‌ల‌రింగ్ ఇచ్చారు. చంద్ర‌బాబు చాలా తెలివిగా త‌న మీద నెపం లేకుండా ఎస్కేప్ అవ్వ‌గా, ప‌శ్చిమ టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఎస్పీని బ‌దిలీ చేయించుక‌కుని స‌క్సెస్ అయ్యారు.