అమ‌రావ‌తి విరాళాల సంగ‌తేంటి?

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించి అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న మేర‌కు నూతన రాజ‌ధాని నిర్మాణానికి కేంద్రమే నిధులు కేటాయించాలి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఒకసారి 2500 కోట్లు, రూ.1000 కోట్లు చొప్పున మొత్తంగా రూ.3500 కోట్లు ఇచ్చింది. ఇక‌, ఈ డ‌బ్బుల‌కు సంబంధించిన ఖ‌ర్చుల వివ‌రాల‌ను, బిల్లుల‌ను స‌మ‌ర్పిస్తే.. మ‌రింత‌గా ఇచ్చేందుకు రెడీ అని ఇటీవ‌ల అరుణ్ జైట్లీ నుంచి ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడికి లేఖ అందింది. అయితే, ఈ లేఖ అందికూడా నెల రోజులు పూర్త‌వుతున్నా.. దీనిపై ఎలాంటి ఉలుకూ ప‌లుకూ లేకుండా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది.

మ‌రోప‌క్క‌, కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా అమ‌రావ‌తి నిర్మాణాల‌కు అయిన ఖ‌ర్చు కేవ‌లం 2200 కోట్లు మాత్ర‌మేన‌ని అధికారులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్రం నుంచి వ‌చ్చిన రూ.3500 కోట్ల‌లో మిగిలిన 1300 కోట్ల రూపాయ‌ల లెక్క‌లు ఇప్పుడు తేలడం లేదు. దీనిపై సీఎం స‌హా సీఆర్‌డీఏ కూడా మౌనం వ‌హిస్తోంది. అమ‌రావ‌తికి సంబంధించి ఇది నాణేనికి ఒక ప‌క్క అయితే, మ‌రో వైపు ప‌రిస్థితి మ‌రీ ఘోరంగా ఉంది. అమ‌రావ‌తి నిర్మాణం పేరిట చంద్ర‌బాబు హైద‌రాబాద్ నుంచి కార్య‌క‌లాపాలు సాగించిన రోజుల్లోనే పెద్ద హుండీ ఒకటి ఏర్పాటు చేయ‌డంతోపాటు.. విరాళాలు ఇవ్వాల‌ని, అమ‌రావ‌తి ఇటుక‌లు కొనుగోలు చేయాల‌ని భారీ ప్ర‌చారం నిర్వ‌హించారు.

రాజ‌ధాని నిర్మాణం విష‌యంపై ఎన్ఆర్ ఐలు స్పందించాల‌ని, మ‌న భూమి, మ‌న మ‌ట్టి, మ‌న రాజ‌ధాని పేరిట పెద్ద స్లోగ‌న్లు సైతం ఇచ్చారు. వీటికి ఆక‌ర్షితులైన అనేక మంది మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఉన్న‌త వ‌ర్గాలు, ఉద్యోగులు.. అమ‌రావ‌తికి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారు. కొంద‌రు మ‌హిళ‌లైతే.. త‌మ ఒంటి మీద బంగారాల‌ను నిలువు దోపిడీ ఇచ్చిన చందంగా చంద్ర‌బాబుకు స‌మ‌ర్పించారు. ఇక‌, ఆన్‌లైన్‌లో నా ఇటుక‌-నా అమ‌రావ‌తికి భారీ స్పంద‌న వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు 56,64,888 ఇటుక‌ల‌ను ఒక్కొక్క‌టీ రూ.10 చొప్పున 2,27,057 మంది కొనుగోలు చేశారు. అంటే, దీనివ‌ల్ల ప్ర‌భుత్వానికి సుమారు రూ.6 కోట్ల వ‌ర‌కు నిధులు స‌మ‌కూరాయి.

అదేవిధంగా.. ఓ ప‌ది హేను మంది వ‌ర‌కు త‌మ‌కు వార‌సులు లేక‌పోవ‌డంతో త‌మ స్థిరాస్తిని సైతం అమ‌రావ‌తికి ఇచ్చేశారు. మ‌రికొంద‌రు అమ‌రావ‌తి కోసం త‌మ పొలాలు, స్థ‌లాల‌ను సైతం అడ‌గ‌కుండానే ఇచ్చారు. ఇలా ప్ర‌జ‌ల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ డ‌బ్బు ఏమైంది? ఆనాడు ఈ విరాళాలు సేక‌రించే స‌మ‌యంలో ప్ర‌తి ఏటా అమ‌రావ‌తికి శంకు స్థాప‌న జ‌రిగిన రోజున.. ఈ లెక్క‌లు వెల్ల‌డిస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. కానీ, ఇప్ప‌టికి రెండు శంకుస్థాప‌న రోజులు ముగిశాయి. అంటే 2015 ద‌స‌రా రోజున ప్ర‌ధాని మోడీతో శంకు స్థాప‌న చేయించారు. ఈ లెక్క‌న‌ నెల 30న మూడో శంకు స్థాప‌న రోజు వ‌స్తోంది.

దీంతో అమ‌రావ‌తిపై ఇంట్రస్టు ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఇప్ప‌టికైనా ఎంత మొత్తం విరాళాల రూపంలో వ‌చ్చింది? ఎంత ఖ‌ర్చు చేశారు? వ‌ంటి లెక్క‌లు చెబుతార‌ని ఎదురు చూస్తున్నారు. మ‌రోప‌క్క‌, ఖ‌జానా కొల్ల‌బోయింద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అదేవిధంగా కేంద్రం నుంచి అందిన అమ‌రావ‌తి నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని, ప్ర‌చారాల‌కు ఖ‌ర్చు చేశార‌ని, వీటిని కేంద్రం ఎట్టి ప‌రిస్తితిలోనూ ఒప్పుకోద‌ని, అందుకే లెక్క‌లు అడుగుతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా ఇప్పుడు ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌పై స‌ర్వ‌త్రా అనుమానాలు రేగుతున్నాయి. ప‌రిస్థితి ఇలా ఉంటే అస‌లు అమ‌రావ‌తి నిర్మాణం ముందుకు సాగేనా? అనే సందేహాలూ వ‌స్తున్నాయి. స‌మాధానం చెప్పేది ఎవ‌రు?