టీఆర్ఎస్ కీల‌క నేత‌ల మౌనం.. అస‌లేం ఏం జ‌రిగింది? 

తెల్లారింది మొద‌లు పొద్దు గూకే వ‌ర‌కు మీడియా మైకుల ముందు మాట‌ల ప్ర‌వాహంతో విప‌క్షాల‌ను దంచికొట్టే.. టీఆర్ ఎస్ నేత‌లు ఇప్పుడు ఒక్క‌సారిగా మౌనం పాటించేస్తున్నారు! ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ క‌విత‌, మంత్రి హ‌రీష్‌రావు, నాయిని త‌దిత‌ర ప్ర‌ధాన పోస్టుల్లో ఉన్న నేత‌లు సైతం ఇప్పుడు మీడియాకు ముఖం చాటేస్తున్నారు. మ‌రో రెండేళ్ల‌లో కీల‌క‌మైన ఎన్నిక‌లు రాబోతున్న త‌రుణంలో నేత‌లు ఇలా గ‌ప్‌చుప్ అయిపోవ‌డం.. ఇప్పుడు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల కాలంలో విప‌క్షాల దూకుడు పెరిగింది. బీజేపీ అధినేత అమిత్ షా వ‌చ్చి మార్గ‌ద‌ర్శ‌నం చేసి వెళ్లాక‌.. క‌మ‌ల ద‌ళంలో కొత్త ఊపు క‌నిపిస్తోంది. దీంతో వారు టీఆర్ ఎస్ స‌ర్కారుపై దూకుడు పెంచారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ నేత‌లు కూడా చురుగ్గా ఉంటున్నారు. దీనికితోడు.. రాష్ట్రంలో ఇటీవ‌ల బ‌య‌ట‌ప‌డ్డ భూ కుంభ‌కోణంలో ప్ర‌భుత్వ నేత‌లే పాత్ర‌ధారుల‌నే టాక్ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో మూకుమ్మ‌డిగా విప‌క్షాలు కేసీఆర్ ప్ర‌భుత్వంపై దాడి షురూ చేశాయి. ఈ నేప‌థ్యంలో ఎదురు దాడికి దిగాల్సిన టీఆర్ ఎస్ నేత‌లు. మౌనం పాటించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

దీనికి ప్ర‌ధానంగా అధినేత కేసీఆర్‌.. కిందిస్థాయిలో నేత‌ల‌కు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ ఇవ్వ‌లేద‌ని అంటున్నారు. ఒక‌వేళ ఏదైనా మాట్లాడాల‌ని అనుకున్నా.. పైస్థాయిలో సంప్ర‌దింపుల అనంత‌ర‌మే వీరు మీడియా ముందు మౌత్ విప్పుతున్నార‌ని స‌మాచారం. ఇటీవ‌ల వెలుగు చూసిన భూ కుంభ కోణం నేప‌థ్యంలో కేసీఆర్ మ‌రింత‌గా ఆదేశాలు జారీ చేశార‌ని అంటున్నారు. ఎవ‌రూ మీడియాతో మాట్లాడ‌ద్దంటూ ఆయ‌న హుకుం జారీ చేశార‌ని టాక్‌. ఈ క్ర‌మంలోనే హ‌రీష్‌.. నాయిని, క‌విత వంటి కీల‌క నేత‌లు సైతం మౌనంగా ఉంటున్నార‌ని తెలుస్తోంది. మ‌రి ఎన్నాళ్లిలా ఉంటారో చూడాలి!!