జ‌న‌సేనాని అడుగు ముందుకా.. వెన‌క్కా?

ప్ర‌త్యేక‌హోదా ముగిసిన అధ్యాయం అని, ఇక ఏరాష్ట్రానికీ హోదా ఉండ‌బోద‌ని బీజేపీ స్ప‌ష్టంచేసింది. ఇక హోదాలో ఉన్న అన్ని అంశాలు ప్యాకేజీలో ఉన్నాయ‌ని, అదే మ‌హా ప్ర‌సాద‌మ‌ని టీడీపీ చెబుతోంది. అయినా ఒక‌ప‌క్క ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, మ‌రోప‌క్క జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. హోదాపై ఉద్య‌మం చేస్తామ‌ని ప‌దేప‌దేచెబుతూ వ‌చ్చారు. అయితే మారిన రాజకీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో జ‌గ‌న్‌.. హోదా అంశాన్నిప‌క్క‌న‌పెట్టేసిన‌ట్టేన‌ని అంతా భావించారు. ఇప్పుడు ప్లీన‌రీ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే హోదాను భుజానకెత్తుకున్న జ‌గ‌న్ మ‌ధ్య‌లోనే డ్రాప్ అయిపోవ‌డంతో.. మ‌రి ప‌వన్ హోదాపై ఉద్య‌మం కొన‌సాగిస్తాడా లేక జ‌గ‌న్‌నే అనుస‌రిస్తాడా అనే చ‌ర్చ మొద‌లైంది.

ఏపీలో నిన్న‌మొన్న‌టివ‌రకూ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, జ‌న‌స‌న అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు న‌డించింది. ఇద్ద‌రూ పోటాపోటీగా ప‌ర్య‌ట‌న‌లు చేశారు. ఎక్క‌డ బాధితులు ఉంటే అక్క‌డ చేరిపోయారు! ఇక ప్ర‌త్యేక‌హోదా పోరు లోనూ ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? అని అనేంతంగా.. పోటీ ప‌డ్డారు. అయితే త‌ర్వాత ఇద్ద‌రూ దీనిని వ‌దిలేశారు. ప్ర‌ధాని మోడీతో భేటీ అనంత‌రం.. వైసీపీ-బీజేపీ మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌నే ప్రచారం గుప్పుమంది. ఇక జ‌గ‌న్‌, హోదా గురించి కేంద్రాన్ని విమ‌ర్శించే అవ‌కాశం ఉండ‌ద‌ని అంతా భావించారు. పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన‌ ప్లీన‌రీలోనూ జ‌గ‌న్ హోదా అంశం గురించి మాట్లాడ‌క‌పోవ‌డంతో జ‌గ‌న్ క్లారిటీ ఇచ్చాడు.

ప్రత్యేక హోదా కోసం తన ఎంపీలచేత రాజీనామా చేయిస్తానని ప్రకటించిన జగన్ మోడీతో భేటీ తరువాత పూర్తిగా దానిని పక్కన పెట్టేశారు. అత్యంత కీలక మైన ఈ విషయం గురించి జగన్ ప్లినరీ లో కనీసం ప్రస్తవించలేదు. జగన్ పొర‌పాటుగా ఆ అంశాన్ని మరచిపోయారా ? లేక కావాలనే తన ప్రసంగం నుంచి స్పెషల్ స్టేటస్ ని తప్పించారా ? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఆయ‌న `హోదా` అంశాన్ని పక్కన పెట్టేసిన‌ట్టేన‌ని రాజకీయ విశేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెబుతున్న టిడిపి, బిజెపిల జాబితాలోకి వైసిపి కూడా చేరిపోయిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా హోదా ఇవ్వ‌ని బీజేపీని తీవ్రంగా దుయ్య‌బ‌డుతున్నారు. పాచిపోయిన ల‌డ్డూలిచ్చార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశాడు. స‌భ‌ల్లోనూ బీజేపీ నేత‌ల తీరుపై మండిప‌డ్డాడు. అప్పుడప్పుడూ ఆ ప్రస్తావన వస్తోందంటే పవన్ వల్లే అని చెప్పాలి. ఇప్పుడు జ‌గ‌న్ కూడా పోటీలో లేక‌పోవ‌డంతో జ‌గ‌న్ పోరాటం కొన‌సాగుతుందా? లేదా ఆయ‌న‌లానే మిడిల్ డ్రాప్ అవుతాడా అనేది అందరిలోనూ ఉత్సుక‌త రేపుతోంది. ఏమో రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చు క‌దా!!