దేవినేని నెహ్రూ కొడుకు అవినాష్ ఫ్యూచ‌ర్ ఏంటి..!

ఏపీలో కీల‌క‌మైన కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లోనే కాదు అప్ప‌ట్లో స‌మైక్యాంధ్ర‌లోనే కాక‌లు తీరిన యోధుడిగా పేరున్న మాజీ మంత్రి దేవినేని రాజ‌శేఖ‌ర్ (నెహ్రూ) ఈ రోజు ఆక‌స్మికంగా మృతిచెందారు. కృష్ణా జిల్లా కంకిపాడు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న ఓసారి ఎన్టీఆర్ హ‌యాంలో మంత్రిగా కూడాప‌నిచేశారు. కంకిపాడు నుంచి 1983-1985-1989-1994ల‌లో టీడీపీ త‌ర‌పున గెలిచిన నెహ్రూ…టీడీపీ ఆవిర్భావ స‌మ‌యంలో ఆయ‌న ఎన్టీఆర్ వైపే ఉన్నారు. ఎన్టీఆర్ చ‌నిపోయేంత వ‌ర‌కు టీడీపీలోనే ఉన్న నెహ్రూ ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2004లో ఆయ‌న కాంగ్రెస్ త‌ర‌పున కంకిపాడు నుంచి అప్ప‌టి విజ‌య‌వాడ సిట్టింగ్ ఎంపీ గ‌ద్దే రామ్మోహ‌న్‌ను ఓడించారు.

2009, 2014లో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి మారిన నెహ్రూ ఈ రెండుసార్లు కూడా ఓడిపోయారు. గ‌త ఎన్నిక‌ల తర్వాత ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి అధ్వానంగా ఉండ‌డంతో ఆయ‌న త‌న కుమారుడితో స‌హా కాంగ్రెస్‌ను వీడి త‌న సొంత గూడు అయిన టీడీపీలో చేరిపోయారు. నెహ్రూ ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఆయ‌న కుమారుడు అవినాష్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుంద‌న్నదానిపై ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఎవ‌రి లెక్క‌లు వారు వేసుకుంటున్నారు.

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనే అవినాష్ కాంగ్రెస్ త‌ర‌పున విజ‌య‌వాడ లోక్‌స‌భ సీటుకు పోటీ చేశారు. కాంగ్రెస్ ప్ర‌భావం ఆ ఎన్నిక‌ల్లో లేక‌పోవ‌డంతో అవినాష్ ఓడిపోయారు. ఇక నెహ్రూ ఉండి ఉంటే ఆయ‌న‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పెన‌మ‌లూరు అసెంబ్లీ సీటుపై హామీ ల‌భించిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు నెహ్రూ లేక‌పోవ‌డంతో ఆయ‌న అనుచ‌ర‌గ‌ణం మొత్తం అవినాష్‌కే పూర్తిగా స‌పోర్ట్ చేయ‌డం ఖాయం. మ‌రి చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌కీయాల్లో జూనియ‌ర్ అయిన అవినాష్‌కు పెన‌మ‌లూరు ఎమ్మెల్యే సీటు ఇస్తారా ? లేదా అన్న‌ది కాస్త సందిగ్ద‌మే.

నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే అవినాష్‌కు ఎమ్మెల్యే సీటు ఇవ్వ‌డం బాబుకు పెద్ద క‌ష్టం కాదు. ఇప్పుడున్న నియోజ‌క‌వ‌ర్గాలే ఉంటే పెన‌మ‌లూరు త‌ప్ప అవినాష్‌కు అప్ష‌న్ లేదు. అలా చేయాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్‌ను త‌ప్పించి మ‌రీ అవినాష్‌కు టిక్కెట్టు ఇవ్వాల్సి ఉంటుంది. మ‌రి చంద్ర‌బాబు అవినాష్ ఫ్యూచ‌ర్‌ను ఏం చేస్తారో ? చూడాలి.