ఉంగుటూరు ఎమ్మెల్యే గ‌న్నిది కొత్త రూటా..? పాత రూటా..?

ఏపీలో అధికార టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా ప‌శ్చిమ‌గోదావ‌రి. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న వార్త‌లు ఇక్క‌డ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను టెన్ష‌న్ పెట్టిస్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాలు కొత్తగా మారితే ? తాము ఎక్క‌డ నుంచి పోటీ చేయాలి ? అన్న ప్ర‌శ్న ఇప్పుడు వీళ్ల‌కు పెద్ద సంక‌టంగా మారాయి. ఈ క్ర‌మంలోనే ఉంగుటూరు టీడీపీ ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు ? ఆయ‌న రూటు ఎలా ? ఉంటుంది ? అన్న‌దానిపై అప్పుడే టీడీపీ, ఎమ్మెల్యే అనుచ‌ర‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ప్ర‌స్తుతం ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో భీమ‌డోలు, ఉంగుటూరు, నిడ‌మ‌ర్రు, గ‌ణ‌ప‌వ‌రం మండ‌లాలు ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై కేంద్రం సానుకూలంగా ఉండ‌డంతో పాటు చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చింది. నియోజ‌క‌వ‌ర్గాల మార్పును జిల్లా యూనిట్‌గా కాకుండా లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలను యూనిట్‌గా తీసుకుని మార్పులు, చేర్పులు చేయాల‌న్న కండీష‌న్ పెట్ట‌డంతో ఉంగుటూరు ఎలా మారుతుందా ? అన్న‌ది సస్పెన్స్‌గా ఉంది.

ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గం ఏలూరు ఎంపీ సెగ్మెంట్‌లో చివ‌ర‌గా ఉంది. పున‌ర్విభ‌జ‌న‌లో మండ‌లాల‌ను మాత్ర‌మే విడ‌దీసి విభ‌జ‌న చేస్తే ప్ర‌స్తుత ఉంగుటూరు సెగ్మెంట్‌లో ఉంగుటూరు, నిడ‌మ‌ర్రు, గ‌ణ‌ప‌వ‌రం మండ‌లాలు ఉంటాయి. చివ‌ర‌న ఉన్న భీమ‌డోలు దెందులూరు నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళుతుంది. భీమ‌డోలు దెందులూరులో క‌లిస్తే ప్రస్తుతం ఉన్న దెందులూరు స్వ‌రూపం కూడా మారుతుంది. దెందులూరులో ప్ర‌స్తుతం ఉన్న పెద‌వేగి మండ‌లం ఏలూరు రూర‌ల్‌లో క‌ల‌వ‌నుంది.

అదే జ‌రిగితే గ‌న్ని సొంత మండ‌లం భీమ‌డోలు ఉన్న దెందులూరు నుంచి పోటీ చేస్తారా ? లేదా ఉంగుటూరు నుంచే పోటీ చేస్తారా ? అన్న‌ది ప్ర‌స్తుతం స‌స్పెన్స్‌గా ఉంది. గ‌న్నికి భీమ‌డోలు మండ‌లం కంచుకోట‌. ఆయ‌న ఎమ్మెల్యే అయ్యాక ఈ మండ‌లంలో భారీ స్థాయిలో అభివృద్ది ప‌నులు చేపట్టారు. ఆయ‌న ఓటు కూడా ఇదే మండ‌లంలోని కురెళ్ల‌గూడెంలో ఉంది. ప్ర‌స్తుతం దెందులూరు నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తోన్న విప్ ప్ర‌భాక‌ర్ ఏలూరు రూర‌ల్ నుంచి పోటీ చేస్తార‌న్న చ‌ర్చ‌లు జిల్లాలో వినిపిస్తున్నాయి.

అదే జ‌రిగితే గ‌న్నికి అటు దెందులూరు, ఉంగుటూరు రెండు ఆప్ష‌న్లు ఉంటాయి. దెందులూరు సీటు అయితే కుల‌ప‌రంగా గ‌న్నికి ప్ల‌స్‌గా ఉంటే, ఉంగుటూరు సీటు ఆయ‌న‌కు అభివృద్ధి ప‌రంగా క‌లిసిరానుంది. దీనిపై గ‌న్ని అంత‌రంగం ఎలా ఉన్నా ? చంద్ర‌బాబు డెసిష‌న్, అప్పటి ఈక్వేష‌న్లు ఎలా ఉంటాయో ? చూడాలి.