పీత‌ల ఈ గ్రూపు రాజ‌కీయాల‌తో లాభం ఏంటి…?

టీడీపీ కంచుకోట అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో అధికార పార్టీలో గ‌త మూడేళ్లుగా ఎంపీ వ‌ర్సెస్ మాజీ మంత్రి మ‌ధ్య జ‌రుగుతోన్న ఆధిప‌త్య పోరుతో పార్టీకి తీర‌ని న‌ష్టం జ‌రుగుతోంది. ఈ పోరులో త‌ప్పొప్పుల విష‌యంలో ఎవ‌రి వాద‌న‌లు వారు త‌మ‌కు అనుకూలంగా వినిపించుకోవ‌డం కామ‌న్‌. వాస్త‌వంగా చూస్తే ఎక్క‌డో డెల్టాకు చెందిన పీత‌ల సుజాత‌ను గ‌త ఎన్నిక‌ల్లో చింత‌ల‌పూడికి ఆహ్వానించారు. చింత‌ల‌పూడిలో ఆమెను టీడీపీ కార్య‌క‌ర్త‌లు క‌ష్ట‌ప‌డి గెలిపించుకున్నారు. ఎస్సీ లేడీ కోటాలో ఆమెకు గెలిచిన వెంట‌నే మంత్రి ప‌ద‌వి కూడా వ‌చ్చింది.

వాస్త‌వంగా చూస్తే ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు అస‌లు ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు, టీడీపీ కేడ‌ర్‌కు సుజాత అంటే ఎవ్వ‌రో తెలియ‌దు. ఇక్క‌డ పార్టీని ఎంపీ మాగంటి బాబు టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కాపాడుకుంటూ వ‌చ్చారు. ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బాబు ప్ర‌తి కార్య‌క‌ర్త‌ను పేరుతో ప‌ల‌క‌రించేంత గ్రిప్ ఆయ‌న‌కు ఉంది. ఇక సుజాత ఇక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే బాబును లెక్క చేయ‌కుండా స్వ‌తంత్య్రంగా వ్య‌వ‌హ‌రించ‌డం స్టార్ట్ చేశారు.

త‌న‌కంటూ సొంతంగా ఓ గ్రూపును ఏర్పాటు చేసుకుని ఆమె వ్య‌వ‌హ‌రించారు. మంత్రి ప‌ద‌వి చేతిలో ఉండ‌డంతో ఆమె ఈ మూడేళ్లు కాస్త దూకుడుగానే వెళ్లారు. మంత్రిగా ఆమె తీవ్ర వ్య‌తిరేక‌త మూటక‌ట్టుకున్నారు. శాఖ‌లోను ఫెయిల్ అవ్వ‌డం, ఇటు నియోజ‌క‌వ‌ర్గంలోను స‌రైన మార్కులు లేక‌పోవ‌డంతో చంద్రబాబు ఆమె మంత్రి ప‌ద‌విని ఊస్టింగ్ చేశారు. ఇక మంత్రి ప‌ద‌వి పోవ‌డంతో సుజాత ఇప్పుడు ఏఎంసీ చైర్మ‌న్ పోస్టును అడ్డం పెట్టుకుని టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను నిలువునా చీల్చేశారు.

పార్టీ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు దాటుతోంది. జిల్లాలోని అన్ని ఏఎంసీలు ఒక విడ‌త పాల‌క‌వ‌ర్గం కంప్లీట్ చేసుకుని రెండోసారి ప‌ద‌వి చేప‌ట్టినా చింత‌ల‌పూడి ఏఎంసీ మాత్రం ఇంకా ఖాళీగానే ఉంది. పార్టీ ఆవిర్భ‌వించినప్ప‌టి నుంచి పార్టీనే న‌మ్ముకుని ఉన్న కామ‌వ‌ర‌పుకోట మండ‌లానికి చెందిన సీనియ‌ర్ లీడ‌ర్ కోనేరు వెంక‌ట సుబ్బారావుకు ఏఎంసీ ఇవ్వాల‌న్న డిమాండ్ నియోజ‌క‌వ‌ర్గంలోనే కాదు జిల్లాలోను ఉంది. ఎంపీ మాగంటి బాబుతో పాటు జిల్లాలోని అంద‌రూ ప్ర‌జాప్ర‌తినిధులు ఆయ‌న‌కే ఏఎంసీ ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఇటీవ‌ల కోనేరు చైర్మ‌న్‌గా బాబు ఉత్త‌ర్వులు తెచ్చినా సుజాత మాత్రం వాటిని ప‌ట్టుబ‌ట్టి ర‌ద్దు చేయించారు.

సుజాత పార్టీకి నిబ‌ద్ధ‌తో ప‌ని చేస్తోన్న కోనేరును కాద‌ని, గ‌తంలో ప‌లు పార్టీలు మారి వ‌చ్చిన చింత‌ల‌పూడి మండ‌లానికి చెందిన చిన్నంశెట్టి సీతారామ‌య్య‌కు ఏఎంసీ ఇవ్వాల‌ని భావించారు. ఆమె ప్ర‌తిపాద‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో ఆమె లింగ‌పాలెం మండ‌లానికి చెందిన జూనియ‌ర్ లీడ‌ర్ నందిగం తిల‌క్ (బాబి) పేరును తెర‌మీద‌కు తెచ్చారు. చిన్నంశెట్టి కాపు వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. కోనేరు, తిల‌క్ క‌మ్మ వ‌ర్గానికి చెందిన వారు. కోనేరుకు ప‌ద‌వి ఇవ్వ‌డం ఇష్టంలేని ఆమె వ్యూహాత్మ‌కంగానే తిల‌క్ పేరు తెర‌మీద‌కు తెచ్చి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీని నిట్ట‌నిలువునా చీల్చేశారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో బలంగా ఉండే టీడీపీ ఇప్పుడు నిలువునా చీలిపోయింది.

ఇక నియోజ‌క‌వ‌ర్గంలో కొంద‌రు టీడీపీ నాయ‌కులు తాత్కాలిక ప్ర‌యోజ‌నాల కోసం సుజాత‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఈ రెండేళ్లు ఆమె సుజాత‌కు తానా తందానా ఆడ‌తారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకు మ‌రోసారి టిక్కెట్ రాద‌న్న సంకేతాలు కూడా వ‌స్తున్నాయి. త‌ర్వాత సుజాత ఈ నియోజ‌క‌వ‌ర్గం వైపు క‌న్నెత్తే చూడ‌ర‌న్న‌ది కూడా స‌త్య‌మే. మ‌రి టీడీపీ నాయ‌కులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగ‌కుండా రెండుగా చీల‌డంతో పార్టీకి న‌ష్టం త‌ప్ప‌డం లేదు. మ‌రి సుజాత ఈ రెండేళ్ల‌లో ఏం సాధించాల‌ని గ్రూపు రాజ‌కీయాల‌కు ఊత‌మిస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని జిల్లా టీడీపీ నాయ‌కులు సైతం త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.