నంద్యాల‌లో ఆ ఓటింగ్ సానుభూతికా… వ‌్య‌తిరేకానికా..!

నంద్యాల‌లో పోలింగ్ ముగిసింది. ఓట‌రు తీర్పు ఎలా ఉంటుందో ?  ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. సాధార‌ణంగా ఉప ఎన్నిక అంటే ఓట‌ర్లు పెద్ద ఇంట్ర‌స్ట్ చూప‌రు. ఎవ‌రి ప‌నుల్లో వారు నిమ‌గ్నమైపోతారు. అయితే నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ మాత్రం సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేలా జ‌రిగింది. 80 శాతానికి కాస్త అటూ ఇటూగా పోలింగ్ న‌మోదైంది. ఓవ‌రాల్‌గా 79.20 శాతం పోలింగ్ జ‌రిగింది. 2014లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో 72.09 శాతం ఓటింగ్ న‌మోదు అయితే ఈ ఎన్నిక‌ల్లో దానికి మించి 7 శాతం ఎక్కువ పోలింగ్ జ‌రిగింది. 

నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న 2.09 ల‌క్ష‌ల ఓట్ల‌లో 1,73,335 ఓట్లు పోల‌య్యాయి. సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పోలిస్తే 7 శాతం ఓటింగ్ పెర‌గ‌డంతో ఇరు పార్టీలు కాస్త టెన్ష‌న్‌గానే ఉన్నాయి. ఇక మ‌హిళ‌లు, వృద్దులు పెత్త ఎత్తున త‌ర‌లివ‌చ్చి ఓటింగ్‌లో పాల్గొన‌డంతో ఈ ఓట్లు ఎవ‌రికి పోల‌య్యాయో ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. ఈ ఓట్లు ఎవ‌రికి ప‌డితే వాళ్ల‌దే గెలుపు అన్న‌ది స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. 

భారీగా జ‌రిగిన ఈ పోలింగ్ ఎవ‌రికి అనుకూలం, ఎవ‌రికి వ్య‌తిరేకం అన్న‌ది అంతుప‌ట్టడం లేదు. పోలింగ్ ముగిశాక గెలుపుపై ఇరు పార్టీలు ధీమాగానే ఉన్నాయి. టీడీపీ వాళ్లు భూమా చ‌నిపోవ‌డంతో ఆయ‌న కోసం మ‌హిళ‌లు, వృద్ధులు త‌ర‌లివ‌చ్చి మ‌రీ సైకిల్‌కు ఓటు వేశార‌ని చెపుతున్నారు. ఇక వృద్ధాప్య ఫించ‌న్లు కూడా టీడీపీకి క‌లిసి వ‌స్తాయ‌ని లెక్క వేస్తున్నారు. నంద్యాల ఓట‌ర్లు ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు క్యూలోనే ఉండి మ‌రీ ఓటు వేశారు. 

ఇక వైసీపీ లెక్క‌లు మ‌రోలా ఉన్నాయి. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు క్లీయ‌ర్‌గా క‌న‌ప‌డింద‌ని చెపుతోంది. 60 నుంచి 65 శాతం పోలింగ్ జ‌రిగితే అది త‌మ‌కు మైన‌స్సే అని అనుకున్నామ‌ని, కానీ డ్వాక్రా మ‌హిళ‌లు, రుణాల మాఫీ విష‌యంలో జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు రూపంలో చూపించార‌ని, అది త‌మ‌కు క‌లిసొస్తుంద‌ని వైసీపీ చెపుతోంది. ఏదేమైన నంద్యాల‌లో భారీగా జ‌రిగిన పోలింగ్‌లో సానుభూతి ఓటుతో టీడీపీ గెలుస్తుందా ?  వ్య‌తిరేక ఓటుతో వైసీపీ గెలుస్తుందా ? అన్న‌ది చూడాలి. ఎవ‌రు గెలిచినా బొటాబొటీ మెజార్టీతోనే బ‌య‌ట‌ప‌డేలా క‌న‌ప‌డుతోంది.