ఐవైఆర్‌-చంద్ర‌బాబు.. త‌ప్పెవ‌రిది?

రాష్ట్రంలో 24 గంట‌ల్లో తుఫాను మాదిరి వ‌చ్చి వెళ్లిన ఐవైఆర్ ఫేస్‌బుక్ విమ‌ర్శ‌ల ఉదంతం.. ప్ర‌భావం ఇప్ప‌టితో అయిపోయిందా? లేక ముందు ముందు కూడా చంద్ర‌బాబును, ఆయ‌న ప్ర‌భుత్వాన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తుందా? ప‌్రస్తుతం ఈ ప్ర‌శ్న రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెను సంచ‌ల‌నంగా మారింది. దీనికికార‌ణం ఐవైఆర్ ప్ర‌క‌టించిన‌ట్టు ఆయ‌న రాస్తున్న పుస్త‌మే! త‌న అనుభ‌వ సారంతో ఐవైఆర్ ఓ పుస్త‌కం రాస్తున్నారు. దీనిలో బాబుపై చండ ప్ర‌చండ నిప్పులు కురిపిస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌నేది విశ్లేష‌కుల మాట‌.

ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎపిసోడ్‌ను విశ్లేషిస్తే.. ఎవ‌రిది త‌ప్పు? అనే మాట ఉత్ప‌న్నం అవుతుంది. ప్ర‌భుత్వం ఏరికోరి ఇచ్చిన ప‌ద‌విని అనుభ‌విస్తూ.. నేరుగా చంద్ర‌బాబుపైనే విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని బాబు అనుకూల మీడియా పెద్ద ఎత్తున త‌ప్పుప‌ట్టింది. ముఖ్యంగా ద‌మ్మున్న ప‌త్రిక‌, ఛానెల్‌.. పిచ్చుక‌పై బ్ర‌హ్మాస్త్రంగా దీనిని పెద్ద‌ది చేయ‌డం మ‌రో కోణం. ఇక‌, ఈ విష‌యంలో చంద్ర‌బాబు.. తొంద‌ర ప‌డ్డార‌నేది కొన్ని వ‌ర్గాల మాట‌. మేమంతా పెద్దాయ‌న‌గా భావించాం అంటూ ఐవైఆర్‌పై వ్యాఖ్యానించిన నేత‌లు.. మ‌రి ఆయ‌న నుంచి వివ‌ర‌ణ తీసుకోవ‌డంలో ఎందుకు ఆ పెద్ద‌రికాన్ని గౌర‌వించ‌లేదో అర్ధం కావ‌డంలేదు.

ఇక‌, ఐవైఆర్ విష‌యానికి వ‌స్తే..తాను డీప్‌గా హ‌ర్ట్ అయ్యాన‌ని.. ఆయ‌న చెప్పారు. ఒక‌వేళ అంత‌గా హ‌ర్ట్ అయి ఉంటే.. తాను గౌర‌వంగా బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసి త‌ప్పుకొని ఉంటే బాగుండేది. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌కుండా ఉంటే కూడా బాగుండేది. ఎందుకంటే.. గ‌తంలోనూ ఆయ‌న సీఎస్‌గా చంద్ర‌బాబు ద‌గ్గ‌ర రెండేళ్లు ప‌నిచేశారు. కాబ‌ట్టి.. కొన్ని లోపాలు ఆయ‌నకు తెలిసి ఉండొచ్చు. నిజానికి ఐఏఎస్‌గా ప్ర‌మాణం చేసే ట‌ప్పుడే ప్ర‌భుత్వ ర‌హ‌స్యాల‌ను వెల్ల‌డించ‌బోన‌ని చెబుతారు.

కానీ, నిన్న‌టి ప్రెస్ మీట్‌లో మాత్రం.. నిజాలు ప్ర‌జ‌లకు తెలియ‌డం లేద‌ని పెద్ద కామెంట్ చేశారు. అదేస‌మ‌యంలో తాను చెప్పాల్సినవి చాలా ఉన్నాయ‌ని అన్నారు. బాబు అనుకూల మీడియా ఈ విష‌యాల‌ను హైలైట్ చేయ‌లేదు. అయితే, ఐవైఆర్ ప్రెస్ మీట్ చూసిన వారికి మాత్రం ఆయ‌నెక్క‌డా ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డిన దాఖ‌లాలు క‌నిపించ‌లేదు. పైగా జ‌రిగింది చెప్పారు అంతే!! కాబ‌ట్టి.. ఈ విష‌యంలో ఐవైఆర్ కూడా వాక్ స్వాతంత్రం పేరుతో ఫేస్‌బుక్ వేదిక‌గా తొంద‌ర‌ప‌డ‌కుండా ఉండి.. త‌న మ‌నోభావాల‌ను నేరుగా ప్ర‌భుత్వంతోనే పంచుకుని ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఏదేమైనా.. టీ క‌ప్పులో తుఫాన్ మాదిరిగా వ‌చ్చి వెళ్లినా.. ఐవైఆర్ తుఫాన్ మాత్రం భ‌విష్య‌త్తులో బాబుకు తీవ్ర దెబ్బేన‌న్న‌ది వాస్త‌వం!!