అక్కడ వైసీపీకి దిక్కెవ‌రు?

ప్ర‌స్తుతం ఈ ప్ర‌శ్న ప‌లువురిని క‌లిచివేస్తోంది! ముఖ్యంగా తెలంగాణ రాజ‌కీయ నేత‌ల‌ను ఉక్కిరిబిక్క‌రికి గురి చేస్తోంది. వైసీపీని జ‌గ‌న్ వ‌దిలేశారా? అంటూ త‌మ‌లో తాము ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఉమ్మ‌డి ఏపీలో సంచ‌ల‌నం సృష్టించిన రాజ‌కీయ పార్టీ వైసీపీ. ముఖ్యంగా కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అత్యంత బ‌లంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డి తెలుగు నేల‌పై సొంతంగా ఏర్ప‌డ్డ పార్టీ కూడా ఇదొక్క‌టే. తాను కోరుకున్న సీఎం ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో పంతం ప‌ట్టి.. కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వైఎస్ త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ స్థాపించిన పార్టీ.. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న రాజ‌కీయాల‌ను పెను కుదుపున‌కు గురి చేసింది.

ఓట్ల షేరింగ్‌లో దూసుకుపోయింది. ముఖ్యంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. అలాంటి పార్టీ రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత నానా తిప్ప‌లు ప‌డుతోంది. ఏపీలో విప‌క్షంగా ప‌రువు ద‌క్కించుకున్నా.. విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ‌లో మాత్రం పార్టీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. గెలిచిన ఒక‌రిద్ద‌రు ప్ర‌జా ప్ర‌తినిధులు సైతం కేసీఆర్ దెబ్బ‌కు టీఆర్ ఎస్ కారెక్కి గులాబీ ద‌ళంలో చేరిపోయారు. అండ‌గా ఉంటాడ‌ని భావించిన బాజి రెడ్డి గోవ‌ర్థ‌న్‌.. వంటి నేత‌లు సైతం జ‌గ‌న్‌కు ముఖం చాటేశారు.

అయిన‌ప్ప‌టికీ.. కేడ‌ర్ మాత్రం ఉండ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 22న అంటే గురువారం పెద్ద ఎత్తున తెలంగాణ‌లో వైసీపీ ప్లీన‌రీ నిర్వ‌హించేందుకు ప్లాన్ చేశారు. దీనిని ఆస‌రా చేసుకుని పార్టీ విస్త‌ర‌ణ‌కు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా జ‌గ‌న్ మాత్రం అదే రోజు విశాఖ‌లో జ‌ర‌గిన భూ కుంభ‌కోణానికి వ్య‌తిరేకంగా భారీ నిర‌స‌న‌కు ప్లాన్ చేసి వైజాగ్ వ‌చ్చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి అస‌లు నేతే హైద‌రాబాద్ వ‌దిలేస్తే.. ప్లీన‌రీని న‌డిపించేంది ఎవ‌రు? అని ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఇప్పుడు సందేహం నెల‌కొంది.

నిజానికి ఏపీలో పార్టీ బాధ్య‌త‌ను తాను చూస్తూ.. తెలంగాణ పార్టీని త‌న చెల్లెలు, జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణం అయిన ష‌ర్మిలకు క‌ట్ట‌బెడ‌తార‌ని పెద్ద ఎత్తున గతంలో ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఏమైందో ఏమో.. ష‌ర్మిల ఇప్ప‌టి వ‌ర‌కు(2014 ఎన్నిక‌ల ప్ర‌చారం త‌ర్వాత‌) మీడియాకు ట‌చ్‌లో లేకుండా పోయింది. దీంతో ఆమె తెలంగాణ బాధ్య‌త‌లు చేప‌డుతుంద‌నే ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. ఈ నేప‌థ్యంలో మ‌రి వైసీపీని తెలంగాణ‌లో జ‌గ‌న్ వ‌దిలేశాడా? అనే సందేహం ఇప్పుడు ఉమ్మ‌డి రాజ‌ధానిలో హ‌ల్‌చల్ చేస్తోంది.