టీడీపీలో నేడు ఐవైఆర్‌…రేపు వేటు ఎవ‌రిపైనో..!

ఏపీ బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఐవైఆర్‌.కృష్ణారావుపై ప్ర‌భుత్వం వేటు వేయ‌డం టీడీపీ వర్గాల్లో పెద్ద క‌ల‌క‌లం రేపుతోంది. కృష్ణారావు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డంతో పాటు చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా వైసీపీ వాళ్లు పెడుతోన్న పోస్టుల‌ను షేర్ చేస్తున్నార‌న్న కార‌ణంతోనే ఆయ‌న్ను ప‌ద‌వి నుంచి తొల‌గించిన‌ట్టు తెలుస్తోంది. కృష్ణారావుపై నిర్దాక్షిణ్యంగా వేటు వేసిన ప్ర‌భుత్వం ఆ స్థానంలో కొత్త చైర్మ‌న్‌గా వేమూరి ఆనంద‌సూర్య‌ను నియ‌మించింది.

ఏదేమైనా చంద్ర‌బాబు గీత దాటుతోన్న‌, అవినీతి ఆరోప‌ణ‌లు ఎద‌ర్కొంటోన్న వారి విష‌యంలో ఇక‌పై ఉపేక్షించేది లేద‌ని డిసైడ్ అయిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. కొద్ది రోజుల క్రితం అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న ఇద్ద‌రు ఎమ్మెల్సీల‌ను సైతం ఆయ‌న పార్టీ నుంచి స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు టీడీపీలో పార్టీ ప‌రువు తీస్తూ, అధిష్టానానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించే వారి విష‌యంలో కూడా ఎలాంటి షాకింగ్ డెసిష‌న్లు అయినా తీసుకునే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి.

అదే జ‌రిగితే ఈ లిస్టులో ఎప్పుడూ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు చేస్తోన్న అనంత‌పురం ఎంపీ జేసీ.దివాక‌ర్‌రెడ్డి ముందు ఉంటారు. జేసీ ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీతో బాబుకు త‌ల‌నొప్పులు తెస్తున్నారు. ఈ లిస్టులో ఒక్క జేసీనే కాదు మ‌రో ఇద్ద‌రు ముగ్గురు సీనియ‌ర్ ఎమ్మెల్యేల పేర్లు కూడా లైన్లో ఉన్నాయి. వారు ఇప్ప‌టికే గీత దాటి బాబును, ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసేలా మాట్లాడినా బాబు మాత్రం మౌనం దాలుస్తున్నారు. మ‌రి ఇప్పుడు ఐవైఆర్ విష‌యంలో బాబు ప‌ద‌వి నుంచి నిర్దాక్షిణ్యంగా వేటు వేయ‌డం టీడీపీలో కాస్త దూకుడుగా ఉండేవాళ్ల‌లో టెన్ష‌న్ రేపుతోంది.