ఏలూరు టీడీపీ ఎంపీ సీటు మాగంటిదా ?  రాజీవ్‌దా ?

ప‌శ్చిమగోదావ‌రి జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట‌. ఈ కంచుకోట‌లో జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరు ఎంపీ సీటు కోసం ఇప్పుడు పార్టీలో ఆస‌క్తిక‌ర ఫైటింగ్ జ‌రుగుతోంది. ఇది పైకి పెద్ద‌గా క‌నిపించ‌క‌పోయినా ఈ ఎంపీ సీటుపై క‌న్నేసిన ఓ యంగ్ లీడ‌ర్ తెర‌వెన‌క ప్ర‌య‌త్నాలు తాను చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుత సిట్టింగ్ ఎంపీ మాగంటిబాబు వివాద ర‌హిత రాజ‌కీయాలు చేస్తూ సౌమ్యుడిగా పేరున్న వ్య‌క్తి. త‌న ఫ్యామిలీకి కాంగ్రెస్‌తో ఉన్న ద‌శాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న మాగంటి టీడీపీలోకి వ‌చ్చారు. పార్టీ త‌ర‌పున 2009లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు జిల్లాలోని మెట్ట‌ప్రాంతంలో పార్టీని త‌న భుజ‌స్కంధాల మీద న‌డిపించాడు. గ‌త ఎన్నిక‌ల్లో ల‌క్ష ఓట్ల భారీ తేడాతో గెలిచారు.

ఎంపీగా గెలిచిన ఈ మూడేళ్ల‌లో జిల్లాలో పార్టీని న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా నిలుస్తూ త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. తాను టిక్కెట్లు ఇప్పించి గెలిపించుకున్న ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేల‌తో ఆయ‌న‌కు గ్యాప్ ఉన్నా అందులో మాగంటిని త‌ప్పుప‌ట్ట‌లేం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2019 ఎన్నిక‌ల్లోను మ‌రోసారి ఎంపీగా పోటీ చేసేందుకు రెడీగానే ఉన్నారు. ఇదిలా ఉంటే మాజీ కేంద్ర మంత్రి, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త బోళ్ల బుల్లిరామ‌య్య మ‌న‌వ‌డు బోళ్ల రాజీవ్ చాప‌కింద నీరులా ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నాడు.

లోకేశ్‌కు అత్యంత స‌న్నిహితుడు, బంధువు అయిన రాజీవ్ గ‌త ఎన్నిక‌ల్లోనే ఏలూరు ఎంపీ సీటు కోసం ప్ర‌య‌త్నాలు చేశాడు. ఇక అదే టైంలో బాల‌య్య రెండో అల్లుడు తాత‌, మాజీ కేంద్ర మంత్రి కావూరు సైతం టీడీపీ నుంచి ఏలూరు సీటు కోసం ప్ర‌య‌త్నించారు. అయితే చంద్ర‌బాబు మాత్రం పార్టీనే న‌మ్ముకున్న మాగంటికే ఎంపీ సీటు ఇవ్వడం, ఆయ‌న గెల‌వ‌డం జ‌రిగిపోయాయి.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటోన్న రాజీవ్ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌న జ‌రిగితే ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. లేనిప‌క్షంలో మాగంటి ప్లేస్‌లో ఏలూరు ఎంపీ సీటు ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. లోకేశ్‌కు స‌న్నిహితుడు కావ‌డం రాజీవ్‌కు ప్ల‌స్‌పాయింట్‌. రాజీవ్ ప్ర‌య‌త్నాలు ఎలా ఉన్నా చంద్ర‌బాబు మాత్రం సిట్టింగ్ ఎంపీగా మాగంటిని ప‌క్క‌న పెట్టే సాహ‌సం చేయ‌డం క‌ష్ట‌మే. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనే కావూరు కోసం బాల‌య్య రెండో అల్లుడు గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేసినా చంద్ర‌బాబు మాత్రం మాగంటికే ఓటేశారు.

ఇక రాజీవ్ పై స్థాయిలో ఎంపీ సీటు కోసం లోకేశ్ ద్వారా లాబీయింగ్ చేస్తున్నా జిల్లాలో మాత్రం కేవ‌లం త‌న తాత బుల్లిరామ‌య్య పేరుతోనే ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారే త‌ప్ప కార్య‌క‌ర్త‌ల‌కు ఏదైనా విష‌యాల్లో అండ‌గా ఉండ‌డం, జిల్లాలో పార్టీ ప‌రంగా క‌లియతిర‌గ‌డం చేయ‌ట్లేదు. ఏలూరు ఎంపీ సీటు కోసం ట్రై చేసే వ్య‌క్తికి జిల్లా స్థాయిలో ఓ రేంజ్‌లో ఇమేజ్ ఉండాలి. అది రాజీవ్‌కు ఉందా అని ప్ర‌శ్నించుకుంటే ఆన్స‌ర్ లేన‌ట్టే. ఇక ఏలూరు ఎంపీ సీటు ప‌రిధిలోని ఎమ్మెల్యేలు సైతం మాగంటికే ఓటేస్తార‌న‌డంలో డౌటే లేదు.

ఇక మాగంటి బాబు వార‌సులు సైతం పొలిటిక‌ల్ ఎంట్రీకి రెడీగా ఉన్నారు. త‌న‌యుడు రాంజీ జిల్లా తెలుగు యువ‌త అధ్య‌క్షుడిగా ఎంపిక‌య్యారు. ఇక ఏలూరు ఎంపీ సీటుపై రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా ఆధిప‌త్యం వ‌హిస్తోన్న మాగంటి ప‌ట్టును వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌చ్చు. మ‌రి లోకేశ్ ద్వారా బోళ్ల రాజీవ్ చేస్తోన్న ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ? రాజీవ్‌కు మ‌రోదైనా సీటు వ‌స్తుందా ? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్ కావాలంటే 2019 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.