చంద్ర‌బాబు హ‌డావిడి వెన‌క క‌థేంటి..!

రాష్ట్రంలో ఇటు అధికార ప‌క్షం, అటు విప‌క్షం రెండూ అప్పుడే మ‌రో సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌చ్చేశాయా? అన్నంత హ‌డావుడి మొద‌లు పెట్టేశాయి. వైసీపీ అధినేత జ‌గ‌న్ త‌న న‌వ‌ర‌త్నాలు, వైఎస్సార్ ఫ్యామిలీ వంటి కార్య‌క్ర‌మాల‌తో జ‌నంలోకి వెళ్తున్నారు. ఇక‌, టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు తాజాగా సోమ‌వారం ఇంటింటికీ టీడీపీ కార్య‌క్ర‌మాన్ని షురూ చేశారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ఆలు లేదు చూలు లేదు.. కొడుకు పేరు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ ఇద్ద‌రిపైనా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇద్ద‌రికీ అధికార‌మే త‌ప్ప‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై దృష్టి ప‌డ‌దా? అనే ప్ర‌శ్న‌లూ ఊపందుకున్నాయి.

2019లో అధికారంలోకి రావాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న విప‌క్షంలో ఉన్నాడు కాబ‌ట్టి.. ఆయ‌న ఈ ల‌క్ష్యం విధించుకోవ‌డం, ఆదిశ‌గా అడుగులు వేయ‌డాన్ని ఎవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు. ఇక‌, టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు కూడా 2019 లోనూ తిరిగి సీఎం పీఠం ద‌క్కించుకోవాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌ట్లో క‌నుచూపు మేర‌లో కూడా లేని ఎన్నిక‌ల కోసం ఆయ‌న పెద్ద ఎత్తున ప్ర‌ణాళిక సిద్ధం చేసేసి.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లిపోతున్నారు. అధికారంలోకి మ‌రోసారి రావాల‌నుకోవ‌డం త‌ప్పు కాక‌పోయినా.. అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు చేయ‌డం, మంత్రులు, ఎమ్మెల్యేల‌ను రోడ్ల వెంట తిప్ప‌డం ఏమీ బాగోలేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ఇప్ప‌టికే గ‌డిచిన రెండు నెల‌లుగా రాష్ట్రంలో పాల‌న స్తంభించిపోయింది. నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేష‌న్‌కు ముందు నుంచే దాదాపు 10 మంది మంత్రుల‌ను అక్క‌డ మోహ‌రించారు. దీంతో పాల‌న ప‌డ‌కేసింది. ఆ త‌ర్వాత కాకినాడ ఎన్నిక‌ల‌కు పంపారు. ఇక‌, ఇది ముగిసింది క‌దా అనుకున్న త‌రుణంలో పార్టీ వ‌ర్క్ షాపు పేరుతో నాలుగు రోజులు తినేశారు. ఇక‌, ఇప్పుడు ఇంటింటికీ టీడీపీ పేరుతో రోడ్ల మీద‌కు పంపుతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో పాల‌న ప‌డ‌కేయ‌డం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ కార్య‌క్ర‌మాల‌తో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వారివారి కార్యాల‌యాల్లో ఎప్పుడుంటారు? అక్క‌డికి వ‌చ్చే వారి స‌మ‌స్య‌లు ఎప్పుడు ప‌రిష్క‌రిస్తారు? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

అయితే, ఎప్పుడో వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టి నుంచే ఎందుకింత హ‌డావుడి అనేది కూడా ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అధికారం లేనివారు చేసినా.. బాగుంటుందేమో కానీ, అధికారంలో ఉండి ఇంకా ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర‌పైనే స‌మ‌యం ఉండ‌గానే.. బాబు ఇప్ప‌టి నుంచే ఇలా ప్ర‌చారం ప్రారంభించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం అధికారంలోనే ఉన్నారు కాబ‌ట్టి.. పూర్తిస్థాయిలో అధికారులు, మంత్రుల‌ను స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టేలా చేసి, ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేలా చేయ‌గ‌లిగితే.. చాల‌ని అంత‌క‌న్నా ప్ర‌చారం ఇంకేముంటుంద‌ని కూడా చెబుతున్నారు. కానీ, బాబు లేనిపోని ప్ర‌చారం నెత్తికెత్తుకుంటున్నార‌ని అంటున్నారు.