డ్రగ్స్ కేసు కూడా ఆ కేసులా మిగిలి పోతుందా?

మాద‌క ద్ర‌వ్యాల కేసుకు సంబంధించి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్‌ను దాదాపు 11 గంట‌ల‌కు పైగా హైద‌రాబాద్ సిట్ అధికారులు విచారించ‌డం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించింది. ప్ర‌స్తుతానికి 12 మంది పేర్ల‌నే సిట్ బృందం బ‌య‌ట‌పెట్టినా.. దీని వెనుక చాలా మంది పెద్ద త‌ల‌కాయ‌లే ఉన్న‌ట్టు తెలుస్తోంది. నిప్ప‌లేందే పొగ‌రాద‌న్న‌ట్టు.. కేవ‌లం 12 మందితోనే భాగ్య‌న‌గ‌రంలో మాద‌క ద్ర‌వ్యాల వ్య‌వ‌హారం సాగుతోంద‌ని చెప్ప‌లేం. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం పాత్ర కీల‌కంగా మారింది. నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రించి సంబంధిత వ్య‌క్తులు ఎంత‌టి వారైనా ప‌ట్టుకుని న్యాయ‌స్థానం ముందు నిల‌బెట్టాల్సిన బాధ్య‌త కేసీఆర్ స‌ర్కారుపైనే ఉంది. అయితే, ఇప్పుడు ఇక్క‌డే అనేక సందేహాలు త‌లెత్తుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా గ‌తంలో జ‌రిగిన న‌యీం కేసును చెప్పుకోవాల్సి వుంటుంది. ఈ కేసులోనూ అనేక మంది పేర్లు ముఖ్యంగా వివిధ పార్టీల్లో మంత్రులుగా చేసిన‌వారు. పోలీస్ బాస్‌లుగా చేసిన‌వారు కూడా ఉన్న‌ట్టు, న‌యీంకు స‌హ‌క‌రించిన‌ట్టు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో తీవ్ర ఇర‌కాటంలో ప‌డిన ఆయా నేత‌లు మీడియా ముందుకు వ‌చ్చి తాము స‌చ్ఛీలుర‌మ‌నే వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది.

ముఖ్యంగా మాజీ డీజీపీ దినేష్ రెడ్డి.. కూడా న‌యీం కేసులో వివ‌ర‌ణ ఇచ్చుకునే స్థాయికి వ‌చ్చారు. ఇక‌, టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం న‌యీంతో అంట‌కాగార‌ని పోలీసులే ఆఫ్ ది రికార్డుగా వెల్ల‌డించారు. వీరంద‌రికీ శిక్ష ఖాయ‌మ‌ని, ఊచ‌లు లెక్క‌పెట్ట‌డం ఖాయ‌మ‌ని అన్నారు. ఇంత‌లో ఏమైందో ఏమో.. ష్‌.. గ‌ప్ చుప్ చందంగా .. అంతా సైలెంట్ అయిపోయింది. కింది స్థాయి చిన్న చిన్న అధికారుల‌తో ఈ కేసును చుట్ట‌బెట్టేశారు.

ఇక‌, ఇప్పుడు డ్ర‌గ్స్ విష‌యానికి వ‌స్తే.. బ‌డా నిర్మాత‌ల పుత్ర ర‌త్నాలు, ఓ వ‌ర్గానికి చెందిన సినీ ప్ర‌ముఖులు ఇందులో ఉన్న‌ట్టు చూచాయ‌గా తెలుస్తోంది. ఈ విష‌యాలు ఇటు అధికారుల‌కు, అటు ప్ర‌భుత్వానికీ పూర్తిగా తెలుస‌న‌నేది మ‌రో సంచ‌ల‌న విష‌యం. అయిన‌ప్ప‌టికీ కెల్విన్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగానే అంటూ.. కేవ‌లం 12 మంది పేర్ల‌తో స‌రిపెడుతున్నారు. వారిని కూడా అరెస్టు చేయ‌డానికి వీల్లేని సెక్ష‌న్ 67 కింద పిలిచి విచారిస్తున్నారు. దీంతో ఈ కేసు విచార‌ణ అనంత‌రం ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో ఏవిధంగా తెర‌మ‌రుగు అవుతుందో అని ప‌లువురు సామాజిక ఉద్య‌మ కారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

నిజానికి ఇలాంటి కేసుల్లో ప‌ట్టిష్ట‌మైన చ‌ట్టాలున్న‌ప్ప‌టికీ.. అరెస్టుకు వీలు లేని, త‌ప్పించుకునే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్న సెక్ష‌న్ల కింద సిట్ అధికారులు కేసులు ఎందుకు న‌మోదు చేస్తున్నారో అర్ధం కావ‌డం లేదని ఓ ఆంగ్ల దిన‌ప‌త్రిక ప్ర‌త్యేక క‌థ‌నం కూడా ప్ర‌చురింది. మ‌రి భ‌విష్య‌త్తులో ఈ కేసు మ‌రో న‌యీం త‌ర‌హా కేసుగా మిగిలి పోతుందా? లేక ప‌టిష్ట‌మైన విచార‌ణ సాగి.. నేర‌స్తుల‌ను క‌టాక‌టాల వెన‌క్కి నెడుతుందా? చూడాలి.!