పీకే స‌ల‌హా.. వాడుకుని వ‌దిలేయ‌డ‌మే!

ఏపీ విప‌క్షం వైసీపీలో ఇప్పుడు నేత‌ల‌కు కంటిపై కునుకు క‌రువ‌వుతోంది. ప్ర‌స్తుతం పార్టీనే అంటి పెట్టుకుని జ‌గ‌న్‌కి అన్ని విధాలా ఉప‌యోగ‌ప‌డి, ఆయ‌న క‌ష్టాల్లోనూ పాలు పంచుకుని అన్ని విధాలా న‌ష్ట‌పోయి కూడా పార్టీలోనే కొన‌సాగ‌తున్న వారికి అస్స‌లు నిద్ర ఉండ‌డం లేద‌ట‌! అంతేకాదు.. ఎప్పుడు ఎలాంటి వార్త వినాలో న‌ని వారు తీవ్రంగా టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్లే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో అధికార టీడీపీని మ‌ట్టి క‌రిపించి తాను అధికారంలోకి రావాల‌ని ప్లాన్ చేసుకుంటున్న వైసీపీ అధ‌నేత జ‌గ‌న్ కోట్ల రూపాయ‌లు పోసి.. ఎన్నిక‌ల వ్యూహ క‌ర్త‌గా ఐఐటీయెన్ ప్ర‌శాంత్ కిశోర్‌ని నియ‌మించుకున్న విష‌యం తెలిసిందే. ఈయ‌న హైద‌రాబాద్‌లోకి అడుగుపెట్ట‌డంతో పాటు త‌న టీంతో ప‌నిలోకి కూడా దిగిపోయాడు.

అంతేకాదు, జ‌గ‌న్‌కి కొన్ని స‌ల‌హాలు సూచ‌న‌లు సైతం ఇస్తున్నాడు. తాను చెప్పింది వినాల‌ని.. అలా అయితేనే 2019 ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్క‌డం సాధ్య‌మ‌వుతుంద‌ని పీకే తేల్చి చెప్పాడు. దీంతో ఎవ‌రిమాటా విన‌ని వాడిగా పేరు తెచ్చుకున్న జ‌గ‌న్‌.. పీకేకి మాత్రం స‌రెండర్ అయిపోయాడు. ఆయ‌న చెప్పిన స‌ల‌హాను తు.చ‌. త‌ప్ప‌కుండా పాటిస్తున్నాడు. అంతేకాదు, పీకేను సంప్ర‌దించ‌కుండా ఏ ప‌నీ చేయ‌డం లేద‌ని కూడా స‌మాచారం. ఈ క్ర‌మంలోనే పీకే ఇచ్చిన ఓ ప‌నికిమాలిన స‌ల‌హా ఒక‌టి పార్టీలో ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఏ ఒక్క నేత‌కీ ప్ర‌శాంతంగా నిద్ర లేకుండా చేస్తున్నాయి. అందేంటంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న నేత‌ల‌ను వాడుకుని వ‌దిలేయాల‌ని, కొత్త‌వారికి ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేవారికి మాత్రమే టికెట్లు ఇవ్వాల‌ని పీకే నూరిపోశాడ‌ట‌.

దీనికిముందు పీకే నిర్వ‌హించిన స‌ర్వేలో గెల‌వ‌లేని వైసీపీ నేత‌ల పేర్ల‌తో ఓ జాబితాను జ‌గ‌న్‌కి అందించాడ‌ట‌. వీరికి మాత్రం టికెట్ ఇస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని చెప్పాడ‌ట‌. దీంతో జ‌గ‌న్ ఆలిస్టు ప్ర‌కారం వాళ్ల‌ని ఎలిమినేట్ చేయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. నిజానికి గత ఎన్నికల్లో ఓటమి పాలైన నేతల్లో చాలా మంది పార్టీకి దూరమైపోగా., ఓడినా పార్టీనే అంటిపెట్టుకున్న వారికి ఈ దఫా టిక్కెట్లు ఇస్తార‌ని అన్న‌య్య‌మీద ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, ఇప్పుడు పీకే స‌ర్వేల‌తో అంతా మారిపోయింది. 2014లో వైసీపీలో గెలిచి.. బాబు ఆక‌ర్ష్‌తో టీడీపీలోకి వెళ్లిపోయిన స్థానాల్లో కొత్త‌వారికి సీటు కేటాయించాల‌ని పీకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, 2014లో ఓడిపోయిన స్థానాల నుంచి ఒకింత పలుకుబ‌డి, డ‌బ్బు ఖ‌ర్చు పెట్ట‌గ‌లిగే వాళ్ల‌కే టికెట్ ఇవ్వాల‌ని పీకే సూచించాడ‌ట‌.

ఈ రెండు ఫార్ములాల‌తో జ‌గ‌న్ వెళ్లిన‌ట్ట‌యితే.. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న నేత‌ల‌కు, ముఖ్యంగా జ‌గ‌న్‌ను క‌ష్టాల్లో ఆదుకున్న వారికి టికెట్ వ‌చ్చే ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. దీంతో ఈ విష‌యం వైసీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు దారితీస్తోంది. నీకు టికెట్ క‌ష్టం అంటే.. నీకు అస‌లే రాదు.. అనే ప్ర‌చారం భారీగా సాగుతోంది. ఇది ఓ ర‌కంగా నేత‌ల మ‌నోస్థైర్యాన్ని దెబ్బ‌తీయ‌డ‌మేన‌ని చెబుతున్నారు. మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం ఏంటంటే.. పీకే స‌ల‌హా ప్ర‌కారం ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లో డ‌మ్మీలుగా ఉండి.. గ‌తంలో కేంద్రంలో చ‌క్రం తిప్పిన పురందేశ్వ‌రి, ల‌క్ష్మి, ఉగ్ర నరసింహారెడ్డి., ఆమంచి కృష్ణమోహన్‌., మాగుంట వంటి నేతలను పార్టీలోకి ఆహ్వానించి వారికి టికెట్ ఇవ్వ‌డం ద్వారా బాబుకు చెక్ పెట్టాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది.

నిజానికి వీళ్లంతా గ‌తంలో జ‌గ‌న్‌పై కేసులు పెట్టిన‌ప్పుడు, ఆయ‌న జైలు పాలైన‌ప్పుడు తీవ్రంగా విమ‌ర్శించిన‌వారే. మ‌రి జ‌గ‌న్ ఇలా పీకే స‌ల‌హాల‌తో ఉన్న‌వారిని, త‌న‌కు అన్ని విధాలా సాయం చేసిన వారిని వ‌దిలేసుకుని, రాజ‌కీయ అవ‌స‌రాల‌కోసం త‌న‌ను తిట్టి తెగిడిన వారికి రెడ్ కార్పెట్ ప‌రుస్తాడ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.