విశ్వేశ్వ‌ర్‌రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది…2019లో గెలుస్తాడా?

అనంతపురం జిల్లాలోని వెన‌క‌బ‌డిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా రెండుసార్లు గెలిచిన టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ ప‌య్యావుల కేశ‌వ్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు ఓడిపోవ‌డం విశేషం. విచిత్రం ఏంటంటే కేశ‌వ్‌పై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వ‌ర్‌రెడ్డి 2004లో సీపీఐ నుంచి, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి గ‌త ఎన్నిక‌ల్లో మూడోసారి పార్టీ మారి ఈ సారి వైసీపీ నుంచి పోటీ చేసి కేశ‌వ్‌పై ఎట్ట‌కేల‌కు 2275 ఓట్ల స్వ‌ల్ప ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు.

2009లో కేవ‌లం 300 ఓట్ల తేడాతోనే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి ఓడిపోయారు. జిల్లా మొత్తం మీద వైసీపీకి ఉన్న ఒకే ఒక శాస‌న‌స‌భ్యుడు విశ్వేశ్వ‌ర్‌రెడ్డి. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 5 మండ‌లాల్లో 1.95 ల‌క్ష‌ల ఓటర్లు ఉన్నారు. మొత్తం ఉర‌వ‌కొండ‌కు 12 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీ 5 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు, వైసీపీ ఒక‌సారి, ఇండిపెండెంట్లు రెండుసార్లు గెలిచాయి. ఇక నియోజ‌క‌వ‌ర్గంలోని ఓట‌ర్ల‌లో బీసీలు ఎక్కువ‌, ఆ త‌ర్వాత ఎస్సీలు, మైనార్టీలు ఉన్నారు. ఇక ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన విశ్వేశ్వ‌ర్‌రెడ్డి ఈ మూడున్న‌రేళ్ల‌లో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఏం చేశారు ? ఆయ‌న ప్ల‌స్‌లు, మైన‌స్‌లు ఏంటో ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో చూద్దాం.

అభివృద్ధి ఎలా ఉంది… స‌మ‌స్య‌లు ఏంటి…

నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన ఉర‌వ‌కొండ‌లో చేనేత కార్మికులు ఎక్కువ. ఈ వృత్తిమీదే ఆధార‌ప‌డి 5 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే ఈ వృత్తికి స‌రైన చేయూత‌, ప్రోత్సాహం లేక ఉర‌వ‌కొండ‌లో మ‌గ్గాలు మూల‌న‌ప‌డుతున్నాయి. ఇక ఉర‌వ‌కొండ‌లో తీవ్ర నీటి ఎద్ద‌డి ఉంది. ఇస్తోన్న నీళ్లు కూడా అర‌కొర‌గా ఇస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో లెక్క‌కుమిక్కిలిగా ఉన్న స‌మ‌స్య‌లు ఎమ్మెల్యేకు ఏ మాత్రం ప‌ట్ట‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వస్తున్నాయి. ఆయ‌న ప్ర‌తి చిన్న ప‌నికి కూడా తాను ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేను అని, ప్ర‌భుత్వం త‌న నియోజ‌క‌వ‌ర్గంపై చిన్న చూపు చూస్తోంద‌ని సింపుల్‌గా చెప్పేసి ఆయ‌న చేతులు దులిపేసుకుంటున్నారు.

ఇక మండ‌ల కేంద్ర‌మైన వ‌జ్ర‌క‌రూర్ పేరు గొప్ప‌..ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది. ఇక్క‌డ వ‌జ్రాల ప్రోసెసింగ్ యూనిట్ పెట్టి యువ‌త‌కు ఉపాధి క‌ల్పించాల‌న్న హామీలు ఇంకా నెర‌వేర‌డం లేదు. ఇక ఎమ్మెల్యే గ‌త ఎన్నిక‌ల టైంలో తాను ఉర‌వ‌కొండ‌కు సాగు, తాగు నీటి స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాన‌ని, హంద్రినీవా ద్వారా నీటి హామీ, ఉర‌వ‌కొండలో పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల పంపిణీ హామీలు అలాగే ఉన్నాయి.

ప్ర‌భుత్వం నుంచి ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేగా ఉన్న త‌న‌కు ఎలాంటి స‌హ‌కారం లేద‌ని ఎమ్మెల్యే చెపుతుంటే ఎమ్మెల్యే కేశ‌వ్ మాత్రం త‌మ ప్ర‌భుత్వం కోట్లాది రూపాయ‌ల‌తో అభివృద్ధి చేస్తుంద‌ని చెపుతున్నారు. విండ్ ఎన‌ర్జీ ఫ్యాన్స్ ప‌రిశ్ర‌మ ద్వారా ఉపాధి క‌ల్పించిన ఘ‌న‌త‌, గుంత‌క‌ల్లు బ్రాంచ్ కెనాల్ ఆధునీక‌ర‌ణ‌కు రూ.300 కోట్లు రిలీజ్ చేయించి ఘ‌న‌త త‌న‌దే అని చెపుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త 70 ఏళ్ల‌లో జ‌ర‌గ‌ని అభివృద్ధి ఈ మూడున్న‌రేళ్ల‌లో చేశామ‌ని ఆయ‌న చెపుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో ఎమ్మెల్యేకు అవ‌గాహన లేద‌ని కేశ‌వ్ విమ‌ర్శిస్తున్నారు. ఇక టీడీపీ హ‌యాంలోనే ఒకేచోట 50 వేల ఎక‌రాల‌కు బిందు సేద్యం ప‌ద్ధ‌తి అమ‌లు చేశామ‌ని ఆయ‌న చెపుతున్నారు.

రాజ‌కీయంగా ఎలా ఉందంటే……

రాజ‌కీయంగా ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి ఇప్పుడు గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే స్వ‌ల్ప ఓట్ల తేడాతో గెలిచిన ఆయ‌న ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌క‌పోవ‌డంతో పాటు త‌న ప్ర‌త్య‌ర్థి కేశ‌వ్ ఎమ్మెల్సీ అయిన వెంట‌నే దూసుకుపోతుండ‌డంతో విశ్వేశ్వ‌ర్‌రెడ్డి వెన‌క‌ప‌డిపోయారు. మ‌రోవైపు ఎన్నిక‌ల్లో ఓడిపోయాక వెన‌క‌ప‌డిన కేశ‌వ్ ఎమ్మెల్సీ అయ్యాక దూసుకుపోతున్నారు. విశ్వేశ్వ‌ర్‌రెడ్డికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో శివ‌రామిరెడ్డితో పాటు ఆయన కుమారుడి నుంచి పోటీ ఉంది. వీరిద్ద‌రు కూడా టిక్కెట్ కోసం పోటీప‌డుతున్నారు. దీంతో ఎమ్మెల్యేకు స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం తీవ్రంగా ఉంది. ఇక మ‌రో షాక్ ఏంటంటే నిన్న‌టి వ‌ర‌కు ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి రాకీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న త‌మ్ముడు మ‌ధుసూద‌న్‌రెడ్డికి సొంత కుటుంబంలోనే ప్రాధాన్యం తగ్గ‌డంతో ఆయ‌న టీడీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఇది కూడా ఎమ్మెల్యేకు రాజకీయంగా పెద్ద దెబ్బే.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– చెప్పుకోవ‌డానికి స‌రైంది ఒక్క‌టీ లేదు

మైన‌స్‌పాయింట్స్ (-):

– లెక్క‌కు మిక్కిలిగా…

తుది తీర్పు:

ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి గ‌త రెండుసార్లు ఓడిపోయిన సానుభూతితో గ‌త ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కేశారే గాని ఈ సారి మాత్రం ఆయ‌న‌కు అగ్నిపరీక్ష త‌ప్ప‌దు. అటు సొంత పార్టీలోనే బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులు ఉండ‌డంతో సీటు వ‌స్తుందో ? రాదో ? తెలియ‌దు. ఇచ్చిన హామీలు ఏవి నెర‌వేర్చ‌లేదు. తాను విప‌క్ష ఎమ్మెల్యేను అన్న మాట‌తో ఆయ‌న ఎస్కేప్ అయిపోతున్నారు. అటు టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కేశ‌వ్ బ‌లంగా త‌యార‌వుతున్నారు. ఏదేమైనా జిల్లాలో ఒకే ఒక్క వైసీపీ పీక‌ల్లోతు క‌ష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు.