ఏపీ ఇంత క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉందా..?

ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు. సాధార‌ణంగా ఆయ‌న ఎప్పుడో కానీ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై నోరు విప్ప‌రు. నిన్న చూచాయ‌గా అలాంటి కామెంట్లే చేశారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు. అంతేకాదు, రాష్ట్ర వృద్ధి చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు, బ‌డ్జెట్‌లో పేర్కొన్న‌ట్టు 11.61 ఒక్క‌టే వాస్త‌వ‌మ‌ని మిగిలిన లెక్క‌ల‌న్నీ చాలా ఇబ్బందుల్లో ప‌డ్డాయ‌ని అన్నారు.

ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌నీ, గ‌తంలో నిలిపేసిన బిల్లుల‌న్నీ ఒకేసారి చెల్లించాల్సి రావ‌డ‌మే కార‌ణ‌మని వివ‌రించారు. పాత బ‌కాయిలతో క‌లిపి ఈ త్రైమాసికంలో రూ. 49 వేల కోట్లను చెల్లించామ‌నీ, ఈ నెలాఖ‌ర‌కు మ‌రో రూ. 10 వేల కోట్లు బిల్లులు పెండింగ్ లో ప‌డ‌తాయ‌ని య‌న‌మల స్ప‌ష్టం చేశారు.

రాష్ట్ర ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండ‌టం లేద‌నీ, ఇదే త‌రుణంలో ఖ‌ర్చులు ఎక్కువ‌గా ఉంటున్నాయ‌ని చెప్పారు. ఈ ప‌రిస్థితి మ‌రో త్రైమాసికం కొన‌సాగితే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందుల్లోకి వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గ‌తంలో చంద్ర‌బాబు సైతం ప‌దే ప‌దే ఇలాంటి లెక్క‌లు చెప్పేవారు . అయితే, ఆయ‌న విదేశీ ప్ర‌యాణాలు, ఖ‌ర్చులు చూస్తే.. నిజ‌మా ? అని అనిపించేది. అయితే, ఇప్పుడు కూడా సీఎం త‌న దుబారా ఖ‌ర్చును త‌గ్గించుకోవ‌డం లేదు. ప్ర‌తి అకేష‌న్‌కి కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు చేసి అనుకూల మీడియాకు ప్ర‌క‌ట‌న‌లు గుప్పించేస్తున్నారు.

శాఖ‌ల‌కు సుద్ద‌లు

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాలేద‌న్న మంత్రి య‌న‌మ‌ల అదే టైంలో శాఖ‌ల‌కు సుద్దులు చెప్పారు. శాఖ‌లు ఖ‌ర్చు త‌గ్గించుకోవాల‌న్నారు. శాఖ‌ల‌వారీగా నిధులు కేటాయించినా.. అంత‌మించి నిధుల‌ను అడ‌గ‌డం సరికాద‌ని అన్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం కేటాయించిన నిధుల‌తోనే స‌ర్దుకోవాల‌నీ, ప్రాధాన్య‌త‌ల‌ను స‌మీక్షించుకుని ఖ‌ర్చుల్ని త‌గ్గించుకోవాల‌న్నారు.

కొన్ని శాఖ‌లవారు త‌మ‌కు కేటాయించిన నిధుల్నీ పీడీ ఖాతాల్లో ఉంచుతున్నార‌నీ, ఈ ప‌ద్ధ‌తిని మార్చుకోవాల‌న్నారు. అదనంగా నిధులు కావాల‌ని ఎవ్వ‌రూ అడ‌గొద్ద‌నీ, ఆ శాఖ‌ల్లోనే స‌ర్దుబాట్లు చూసుకోవాల‌న్నారు. మ‌రి నిజంగా ఇంత ఇబ్బంది ఉన్న‌ప్పుడు మిత్ర‌ప‌క్షంగా ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన అమౌంట్‌ను తెప్పించుకోవ‌చ్చుక‌దా ? ఈ విష‌యంలో ఎందుకు తాత్సారం అనేది ప్ర‌శ్న‌. దీనికి మాత్రం య‌న‌మ‌ల ద‌గ్గ‌ర స‌మాధానం లేదు.