ఈ ప్ర‌ణాళిక ప్ర‌కారం చేసుకుంటూ వెళితేనే జగన్ విజయం

ఏపీ ప్ర‌జ‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వంపై.. కొంత అసంతృప్తి ఉంది. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా, రైల్వే జోన్‌, రాష్ట్రానికి నిధుల మంజూరు వంటి విష‌యాల్లో కేంద్ర వైఖ‌రి ఎలా ఉన్నా.. టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై కొంత ఆగ్ర‌హం ఉంది. రెండేళ్ల‌లో ఎన్నిక‌లు త‌రుముకొస్తున్న త‌రుణంలో.. ఈ అసంతృప్తిని, ఆగ్ర‌హాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో ప్ర‌తిపక్ష నేత జ‌గ‌న్‌.. వెనుక‌బ‌డే ఉన్నార‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం! ఉన్న ఈ తక్కువ స‌మ‌యంలోనే.. త‌న వ్య‌వ‌హార శైలి మార్చుకుని.. ప్ర‌జ‌ల్లోకి వెళితే మెరుగైన ఫ‌లితాలు సాధించే అవ‌కాశం ఉంద‌ని సూచిస్తున్నారు. రాజ‌కీయాల్లో దూకుడుగా వ్య‌వ‌హ‌రించాలని.. కానీ అన్ని సంద‌ర్భాల్లోనూ దీనినే న‌మ్ముకుంటే ఎదురుదెబ్బ‌లు త‌గిలే ప్ర‌మాద‌ముంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

గ్రామ‌స్థాయిలో క్యాడ‌ర్ బ‌లంగా ఉన్నా దానిని ముందుకు తీసుకెళ్లే నాయ‌కులు లేకపోవ‌డం! కొన్ని చోట్ల న‌డిపించే వారున్నా ఆధిప‌త్య పోరు.. స‌మ‌న్వ‌య‌లోపం! ప్ర‌భుత్వాన్ని స‌రైన స్థాయిలో టార్గెట్ చేయ‌లేక‌పోవ‌డం! ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే సంద‌ర్భాల్లో మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రించి విమ‌ర్శ‌లు ఎదుర్కోవ‌డం! సీనియ‌ర్ల మాట‌ల‌ను పెడ‌చెవిన పెడుతూ.. ఒంటెత్తు పోక‌డ‌లు ప్ర‌ద‌ర్శించ‌డం.. నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌రైన అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌లేపోవ‌డం.. ఇలా ఒక‌టి కాదు రెండు కాదు జ‌గ‌న్ అండ్ టీంని క‌ల‌వ‌ర‌పెడుతున్న అంశాలు చాలానే ఉన్నాయి. వీట‌న్నింటికీ తోడు ప్ర‌భుత్వంపై ఆశించిన స్థాయిలో పోరాడ‌లేక‌పోవ‌డం కూడా శ్రేణుల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో అతి త‌క్కువ ఓట్లతో అధికారానికి దూర‌మైపోయామ‌ని జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతున్నారు. అందుకు తగినట్టే వ్యూహాలు అమ‌లుచేస్తున్నారు. అయితే వీటిని స‌క్ర‌మంగా ఫాలో అవ‌లేక‌పోతున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం న‌వ్యాంధ్ర నుంచే ఏపీ ప‌రిపాలన కొన‌సాగుతున్నా.. జ‌గ‌న్ ఇంకా హైద‌రాబాద్‌లోనే ఉండ‌టం కూడా వైసీపీకి కొంత డ్యామేజ్ చేస్తోంద‌ని చెబుతున్నారు. అధినేత నిర్వ‌హించే స‌మావేశాల‌కు హైద‌రాబాద్ వెళ్లాల్సి వ‌స్తోంద‌ని పార్టీ నేత‌లే కొంద‌రు గుస‌గుస‌లాడుకుంటున్నారు. అందుకే వీలైనంత అమ‌రావ‌తికి రావాల‌ని సూచిస్తున్నారు. ఇక త‌మ మాట‌కు విలువ ఉండ‌టం లేద‌ని సీనియ‌ర్లు వాపోతున్నారు. వీరి స‌ల‌హాలు కూడా పాటించాల‌ని చెబుతున్నారు.

ఇక ప్ర‌ధానంగా త‌న దూకుడు స్వ‌భావాన్ని జ‌గ‌న్ మార్చుకోవాలి. ప్ర‌తి విష‌యంలోనూ చంద్ర‌బాబునే టార్గెట్ చేసుకోకుండా.. అక్రమ వ్య‌వ‌హారాల్లోని వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి. ఏదైనా అంశంపై తొలుత దుందుడుకుగా వ్య‌వ‌హ‌రిం చినా.. త‌ర్వాత దానిని వ‌దిలేయకుండా నిరంత‌రం పోరాటాలు చేయాలి. అంతా తానే అనే కాకుండా.. ఇత‌ర పార్టీల‌ను కూడా క‌లుపుకొని వెళ్లాలి. ఇక గ్రామ‌స్థాయిలో క్యాడ‌ర్‌ను స‌మ‌ర్థంగా న‌డిపించే నాయ‌కుల‌ను ఎంపిక చేసి.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ప్ర‌జ‌ల‌ను జాగృతం చేయాలి. మ‌రి వీట‌న్నింటినీ ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం చేసుకుంటూ వెళితే.. రెండేళ్ల నాటికి త‌న సీఎం క‌ల నెర‌వేరే అవ‌కాశాలు మెరుగ‌వుతాయి!