వైసీపీలో పండ‌గ‌.. జ‌గ‌న్ లండ‌న్ టూర్‌!

రాష్ట్రంలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీకి ఒకింత ఎదురు దెబ్బ‌త‌గిలినా.. తాజాగా ఓ వార్త మాత్రం ఉత్సాహం నింపింది. పార్టీ అధినేత జ‌గ‌న్ పెద్ద కుమార్తెకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు ల‌భించింది. దీనిని ఆ పార్టీ నేత‌లు, అభిమానులు పెద్ద పండ‌గ‌లా చేసుకుంటున్నారు. ఎంద‌కంత పండ‌గ‌? ఎందుకింత హంగామా? అంటే.. నిజానికి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అతి పెద్ద ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌. ఎంతో మేధావులు ఈ సంస్థ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వాళ్లే. దాదాపు 100 ఏళ్ల‌కు పైగా ఈ విద్యాల‌యం విశ్వ విఖ్యాత ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.

ఈ స్కూళ్ల‌లో చ‌దివిన వాళ్లు.. ఆయా దేశాల వ్యవస్థలను శాసిస్తున్నారు. భారత్ నుంచి కూడా అనేక మంది అక్కడ సీటు సంపాదించి చదవి.. ఉన్నత స్థానాలకు ఎదిగారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ప‌శ్చిమ‌బెంగాల్‌కు దాదాపు 35 ఏళ్ల‌పాటు సీఎంగా వ్యవహరించిన జ్యోతిబసు, నేటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఊర్జిత్ పటేల్.. వీళ్లంతా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదవిన వాళ్లే. వీళ్లేగాక ఇంకా ఎంతోమంది ఈ స్కూల్ నుంచి వ‌చ్చి గొప్ప‌వాళ్ల‌య్యారు. మరి అలాంటి విద్యాలయంలోకి జగన్ కూతురు ఎంటర్ అవుతోంది.

దీంతో ఇప్పుడు వైసీపీ శ్రేణులు కూడా ఆనందంలో మునిగిపోయాయి. త‌మ అధినేత కూమార్తె ప్ర‌పంచ మేధావిగా అవ‌త‌రిస్తుంద‌ని, ఆమెకు ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని, భ‌విష్య‌త్తులో గొప్ప ఆర్థిక వేత్త కావ‌డం ఖాయ‌మ‌ని పేర్కొంటూ పెద్ద ఎత్తున పండ‌గ చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆమెను లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌న‌మిక్స్ లో జాయిన్ చేసి వ‌చ్చేందుకు నిత్యం ఎంతో బిజీగా ఉండే జగ‌న్ స్వ‌యంగా త‌న కూతురును వెంట‌బెట్టుకుని లండ‌న్ వెళ్తున్నారు.

ఈ నెల 11 వ తేదీన జగన్ లండన్ వెళ్తున్నాడని, 19 వ తేదీన తిరిగి వస్తాడని వైసీపీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇదిలావుంటే, జ‌గ‌న్ చ‌దువుపై గ‌తంలో అసెంబ్లీ సాక్షిగా విమ‌ర్శ‌లు గుప్పించిన టీడీపీ అధినేత సీఎం చంద్ర‌బాబు ఇప్పుడేమంటారో చూడాలి.