కోట‌గిరికి జ‌గ‌న్ షాక్‌… ఎంపీ సీటు నుంచి ఎమ్మెల్యే సీటుకు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపుకోసం నిన్న‌టి వ‌ర‌కు సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుల వార‌సుల‌ను వ‌రుస‌గా త‌న పార్టీలో చేర్చుకున్న జ‌గ‌న్ ఇప్పుడు స‌రికొత్త వ్యూహంతో వారికి ఒక్కొక్క‌రిగా షాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. జ‌గ‌న్ కొద్ది రోజుల క్రితం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన దివంగ‌త సీనియ‌ర్ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావు త‌న‌యుడు కోట‌గిరి శ్రీథ‌ర్‌కు ఏలూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. శ్రీథ‌ర్ సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏలూరు వైసీపీ ఎంపీ టిక్కెట్టు త‌న‌దే అన్న ధీమాతో నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా ప్ర‌చారం స్టార్ట్ చేసేశారు.

అయితే శ్రీథ‌ర్‌కు ఏలూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ఆ పార్టీలోనే చాలా మందికి న‌చ్చ‌లేదు. సామాజిక‌వ‌ర్గప‌రంగాను, అనుభ‌వంలోను ఆయ‌న ఎంపిక‌ను సొంత పార్టీ నేత‌లే వ్య‌తిరేకిస్తున్నారు. శ్రీథ‌ర్ సిట్టింగ్ టీడీపీ ఎంపీ మాగంటి బాబుకు స‌రైన ప్ర‌త్య‌ర్థి కాద‌న్న చ‌ర్చ‌లు సైతం న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌రోటాక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. శ్రీథ‌ర్‌కు జ‌గ‌న్ తాత్కాలికంగానే ఈ బాధ్య‌తలు అప్ప‌గించార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల టైంకు ఏలూరు ఎంపీగా బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌, సీనియ‌ర్ పొలిటిషీయ‌న్‌ను రంగంలోకి దించుతార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ జాబితాలో గ‌తంలో కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రులుగా ప‌నిచేసి ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఇద్ద‌రి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. అదే జ‌రిగితే శ్రీథ‌ర్‌కు డిమోష‌న్ ఖాయంగా క‌నిపిస్తోంది. ఏలూరు ఎంపీగా వైసీపీ నుంచి సీనియ‌ర్లు పోటీలో ఉంటే శ్రీథ‌ర్ ఏలూరు అసెంబ్లీ సీటుతో స‌రిపెట్టుకోక త‌ప్ప‌ద‌న్న టాక్ ఆ పార్టీలోనే వినిపిస్తోంది. ఏలూరు వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆళ్ల నాని ఇటీవ‌ల ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో నానికి అక్క‌డ సీటు ఇవ్వ‌న‌ని జ‌గ‌న్ తేల్చిచెప్పేశార‌ట‌.

ప్ర‌స్తుతం అక్క‌డ వైసీపీకి స‌రైన అభ్య‌ర్థి కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. శ్రీథ‌ర్‌కు ఎంపీ సీటు ద‌క్క‌ని ప‌క్షంలో జ‌గ‌న్ ఆయ‌న్ను అక్క‌డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచ‌న‌లో కూడా ఉన్న‌ట్టు స‌మాచారం. శ్రీథ‌ర్ తండ్రి, దివంగ‌త మాజీ మంత్రి కోట‌గిరి విద్యాధ‌ర‌రావుకు ఏలూరులో బ‌ల‌మైన అనుచ‌ర‌గ‌ణం ఉంది. వీరితో పాటు ఆళ్ల నాని అనుచ‌రులు శ్రీథ‌ర్‌కు స‌పోర్ట్ చేసే సూచ‌న‌లు ఉన్నాయి. మ‌రి శ్రీథ‌ర్ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌ను జ‌గ‌న్ ఎలా డిసైడ్ చేస్తారో ? చూడాలి.