జ‌గ‌న్ న‌యా ప్లాన్‌కు సూప‌ర్ రెస్పాన్స్‌

వైసీపీ అధినేత‌, ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌.. ఏపీ ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌నుకుని వేసిన ప్లాన్ అదిరింద‌నే టాక్ వినిపిస్తోంది. 2014లో కొంచెంలో మిస్స‌యిపోయిన సీఎం పీఠాన్ని 2019లో ఎలాగైనా స‌రే కైవసం చేసుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఉత్త‌రాది నుంచి ఎన్నిక‌ల స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిషోర్‌ను ఇంపోర్టు చేసుకుని మ‌రీ ఇప్ప‌టి నుంచే అప్ప‌టి ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే పీకే ఇచ్చే స‌ల‌హాల‌ను తూ.చ‌. త‌ప్ప‌క పాటిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్ కుటుంబం పేరుతో ఓ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారంచుట్టారు. ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను ఈ మాధ్య‌మం ద్వారా న‌మోదు చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు.

ఆయా స‌మ‌స్య‌ల‌కు జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ప‌రిష్కారం చూపిస్తార‌న్న‌మాట‌. దీనికిగాను ఓ ఫోన్ నెంబ‌ర్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీనిలో రిజిస్ట‌ర్ చేసుకోవ‌డం ద్వారా ప్ర‌జ‌లు వైఎస్సార్ కుటుంబంలో చేరొచ్చు. మ‌రోప‌క్క‌, రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 4.3 లక్షల మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యులకు శిక్షణను ఇచ్చిన తరువాత వారంతా ఈ నెల 11 నుంచి రాష్ట్రంలోని ప్రతి గడపకూ వెళుతున్నారు. దివంగత వైఎస్‌ హయాంలో పాలన ఎలా ఉండేదో వారికి గుర్తు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ, పింఛన్లు, ఫీజులు తిరిగి చెల్లింపు పథకాలు ఎలా అమలు జరిగేవో వివరించి చెబుతు న్నారు.

అలాంటి పాలననే రాష్ట్ర ప్రజలకు అందించేందుకు జగన్‌ ఇటీవల జాతీయ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలు పథకాల గురించి వివరిస్తున్నారు. ఇంటి నుంచి ఒక్కరైనా వైఎస్సార్‌ కుటుంబంలో భాగస్వాముల య్యేలా చేస్తున్నారు. 91210 91210కు ఫోన్‌ చేయడం ద్వారా ఈ కుటుంబంలో చేరవచ్చని తెలియజేస్తున్నారు. దీనిలో భాగంగా ఇంటింటికి వెళ్లే కార్యకర్తలకు ఒక కిట్ ను అందచేస్తారు. ఈ పబ్లిసిటీ కిట్ లో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు, గైడ్, విజిటింగ్ కార్డు, బాబు పాలనపై మార్కులు వేసే పత్రం, వైఎస్ఆర్ బ్యాడ్జి, వైఎస్ఆర్ కుటుంబం లో చేరిన తర్వాత వారి ఇంటికి వైఎస్ఆర్ కుటుంబం అని అంటించే స్టిక్కర్ ఉంటాయి.

వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమై 11 రోజులు పూర్తై ఇప్పటికి 38 లక్షల మంది వైస్సార్ కుటుంబంలో చేరినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. రాష్ట్ర స్థాయిలో పార్టీ సీనియర్లు మరియు ముఖ్య నేతలతో వై ఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులు పై సమీక్ష జరిపారు. మొత్తంగా ఈ కార్య‌క్ర‌మానికి ఊహించ‌ని విధంగా రెస్పాన్స్ రావ‌డంపై జ‌గ‌న్ స‌హా వైసీపీ వ‌ర్గాలు ఫుల్ జోష్‌లో ఉన్నాయి.