జ‌గ‌న్‌కి హైద‌రాబాద్‌పై మ‌క్కువ తీర‌లేదా?

ఇప్పుడు ఏపీలో అంద‌రూ ఇలానే అనుకుంటున్నారు. విప‌క్షం వైసీపీ నేత జ‌గ‌న్.. ఏపీ కోసం ఎన్నో ఉద్య‌మాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా కోసం ఆయ‌న విద్యార్థుల‌ను చైత‌న్య వంతం చేస్తున్నారు. మొన్నామ‌ధ్య విశాఖ‌లో పెద్ద ఎత్తున ఉద్య‌మించారు కూడా. అదేస‌మ‌యంలో రాజ‌ధాని రైతుల కోసం ఉద్య‌మాలు చేశారు. ప‌శ్చిమ గోదావ‌రిలోని ఆక్వాపార్క్ కు వ్య‌తిరేకంగానూ ఉద్య‌మించారు. రైతుల రుణ మాఫీ, ప‌ట్టిసీమ వ్య‌ర్థం అంటూ అనేకానేక పోరాటాల‌ను చేశారు. ఇప్పుడు విశాఖ భూ కుంభ‌కోణంపై మొన్నామ‌ధ్యే ధ‌ర్నా కూడా చేశారు.

రాష్ట్ర‌ప్ర‌తిప‌క్ష నేత‌గా ఆయ‌న అలా ధ‌ర్నాలు చేయ‌డం ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌రు. అయితే, అదేస‌మ‌యంలో ఆయ‌న ఎక్క‌డి నుంచి ఈ ధ‌ర్నాల‌కు పిలుపు నిస్తున్నార‌నేదే ఇప్పుడు కీల‌క అంశంగా మారింది. సీఎం చంద్ర‌బాబు అంత‌టి వ్య‌క్తే హైద‌రాబాద్‌లో విలాస భ‌వ‌నాల‌ను వ‌దిలిపెట్టి.. విజ‌య‌వాడ‌లో కృష్ణాన‌ది ఒడ్డున ఉంటూ పాల‌న సాగిస్తున్నారు. అలాంటిది నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండాల్సిన విప‌క్ష నేత జ‌గ‌న్ మాత్రం రాష్ట్రం స‌హా ప్ర‌భుత్వం ఏర్ప‌డి మూడేళ్లు గ‌డిచిపోతున్నా. . ఇంకా భాగ్య‌న‌గ‌రంలోనే ఉండిపోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

అయితే, ఈ విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్‌గా వైసీపీ నేత‌లు ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్ వ‌చ్చేస్తున్నారు… ఇళ్లు చూసేశాం.. అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. ఈ తంతు గ‌త మూడేళ్లుగా జ‌రుగుతూనే ఉంది. అయినా కూడా జ‌గ‌న్ ఎక్క‌డా విజ‌య‌వాడ‌లో అడుగుపెట్టిన జాడ‌, ఓ నిద్ర చేసిన ఆచూకీ కూడా క‌నిపించ‌డం లేదు. దీంతో ఇప్పుడు అస‌లు జ‌గ‌న్‌కి ఇల్లు దొర‌క్క ఏపీకి రావ‌డం లేదా? లేక హైద‌రాబాద్‌పై ఇంకా మ‌క్కువ చావ‌క అక్క‌డే ఉంటున్నారా? అని అంద‌రూ ప్ర‌శ్నించుకుంటున్నారు.

2019 ఎన్నిక‌లకు మ‌రో రెండేళ్ల స‌మ‌య‌మే ఉండ‌డంతో ఆయ‌న ఏపీలో ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, లేనిప‌క్షంలో బాగా న‌ష్ట‌పోతార‌ని అంటున్నారు జ‌గ‌న్ శ్రేయోభిలాషులు. ఇక‌, టీడీపీ నేత‌లు వారి శైలిలో విమ‌ర్శ‌లు సంధిస్తూనే ఉన్నారు. వారం వారం కోర్టులో చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డాలి కాబ‌ట్టి ఏపీలోకి రావ‌డం లేద‌ని అంటున్నారు. సో.. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ వీరి విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టి.. శ్రేయోభిలాషుల మాట‌లు చెవికెక్కించుకుంటారో లేదో చూడాలి.