జ‌గ‌న్ `చిరు`  ఆశ‌లు ఫ‌లిస్తాయా?

నంద్యాల, కాకినాడ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత వైసీపీ రూటు మార్చింది. వ్యూహాలకు మ‌రింత ప‌దును పెడుతోంది. వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌.. స‌రికొత్త ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే కాపు సామాజికవ‌ర్గాన్ని అక్కున చేర్చుకోవ‌డం అన్నివిధాలా శ్రేయ‌స్క‌ర‌మ‌ని వైసీపీ అధినేత గుర్తించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఆ వ‌ర్గానికి కీల‌కంగా ఉన్న మెగా బ్ర‌ద‌ర్స్‌ను ఎలాగైనా త‌మ వాళ్ల‌ను చేసుకునేందుకు ప్ర‌యత్నాలు మొద‌లుపెట్టారు! వాళ్ల‌కు స‌న్నిహితంగా ఉండే హీరోలు, ఇతరుల ద్వారా.. లాబీయింగ్ తీవ్రంగా చేస్తున్నారు. ఇక రేపో మాపో జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌టన ముగించుకుని వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇది మ‌రింత ఎక్కువ‌గా జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం!

మెగా బ్ర‌ద‌ర్స్ మెగాస్టార్ చిరంజీవి, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వైసీపీ దృష్టిసారించింది. గ‌త ఎన్నిక‌ల్లో తాను విజ‌యం సాధించ‌లేకపోవ‌డానికి కాపు సామాజికవ‌ర్గ ఓట్లు ప‌వ‌న్ ద్వారా.. టీడీపీకి వెళ్ల‌డ‌మేన‌ని జ‌గ‌న్ బాగా విశ్వ‌సిస్తున్నారు. అందుకే ఈసారి ఎలాగైనా ఆ వ‌ర్గాన్ని త‌మ వైపు తిప్పుకునేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం తమది కావాలంటే మెగా ఫ్యామిలీని దగ్గరకు చేర్చుకోవడమే మేలని వ్యూహక‌ర్త‌ పీకే కూడా స‌ల‌హా ఇవ్వ‌డంతో ఇప్పుడు ఈ ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు జ‌గ‌న్‌! ముఖ్యంగా మెగా హీరో, రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు వైసీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌న్న‌ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కొన్నేళ్లుగా చిరంజీవి రాజకీయాల‌కు దూరంగా ఉంటున్నారు. వ‌రుస‌గా సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఇక వ‌చ్చే ఏడాదిలో చిరంజీవి రాజ‌కీయ స‌భ్య‌త్వం కూడా ముగిసిపోనుంది. దీంతో మ‌రోసారి పార్టీ నుంచి చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు జగన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. చిరంజీవికి అత్యంత సన్నిహితుడు నాగార్జున ద్వారా ఈ ప్రతిపాదనను ఆయన ముందుకు తెచ్చే ప్రయత్నాన్ని ఇప్పటికే వైసీపీ ప్రారంభించింద‌ట‌. నాగార్జున, చిరంజీవి ఇద్దరూ మాటీవీలో మొన్నటి వరకూ పార్ట్ నర్స్. మ్యాట్రిక్స్ ప్రసాద్ కూడా చిరుకు సన్నిహితుడే. వీరిద్దరి ద్వారా చిరంజీవిని వైసీపీలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వైసీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.

ప్ర‌స్తుతం మ‌రో మెగా బ్ర‌ద‌ర్‌ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. జ‌గ‌న్‌కు పోటీగా నిలుస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీచేస్తాన‌ని చెప్ప‌డంతో జ‌గ‌న్‌లో టెన్ష‌న్ మొద‌లైంది. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీ ఓట్లు చీలే అవకాశముంది. ఏపీలోని కాపు ఓటర్లు జ‌న‌సేన వెంటే న‌డిచే అవ‌కాశ‌ముంది. దీంతో త‌న సీఎం ఆశ‌ల‌కు గండి ప‌డే అవ‌కాశాలే ఎక్కువ‌. దీనిని గ్రహించిన జ‌గ‌న్‌.. పవన్ ను పార్టీలోకి తీసుకొచ్చి అత్యధిక ప్రాధాన్య‌మివ్వాల‌ని భావిస్తున్నార‌ట‌. ప్రశాంత్ కిషోర్ పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవడానికి ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు. పవన్ ఒకవేళ తమ ప్రతిపాదనకు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా చిరంజీవిని దగ్గరకు తీయాలన్నది పీకే వ్యూహం. జగన్ కూడా లండన్ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత దీనిపై కసరత్తు ప్రారంభించే అవకాశముంది.