ఆ ఫ్యామిలీ ఫ్యూచ‌ర్‌పై జ‌గ‌న్ షాకింగ్ డెసిష‌న్‌

ఈ సారి అధికారం చేజిక్కించుకోవాలంటే గోదావ‌రి జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్‌ స్ట్రాంగ్‌గా డిసైడ్ అయిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో లోపాల‌ను ఒక్కొక్క‌టిగా స‌రిజేసుకుంటూ.. అభ్య‌ర్థుల ఎంపిక‌లోనూ జాగ్ర‌త్త‌లు ప‌డుతున్నారు. కొన్నిచోట్ల అభ్య‌ర్థుల ఎంపిక కూడా కొంత బెడిసికొట్టిన విష‌యం తెలిసిందే! ఇందులో భాగంగానే తూర్పుగోదావ‌రి జిల్లాలో రాజాన‌గ‌రం నుంచి మొద‌లుపెట్టారు. ఇక్క‌డ మాజీ మంత్రి జ‌క్కంపూడి రామ్మోహ‌న్‌రావు కుటుంబానికి మంచి ప‌ట్టు ఉంది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో మోహ‌న‌రావు స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మికి టికెట్ ఇచ్చినా.. ఈసారి మాత్రం ఆమె త‌న‌యుడికి టికెట్ ద‌క్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

సోనియా గాంధీ తో తగాదా పడి జగన్ కాంగ్రెస్ కు గుడ్ బై కొట్టి సొంత పార్టీ పెట్టిన నాటి నుంచి జక్కంపూడి కుటుంబం కష్టాల్లో వైఎస్ తనయుడి వెంటే నడిచింది. రామ్మోహన్ అనారోగ్యానికి గురయ్యాక ఆయన వారసురాలిగా 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కడియం అసెంబ్లీ స్థానం నుంచి ఆయన భార్య విజయలక్ష్మి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి రాజానగరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆమె పరాజయం పాలయ్యారు . ఈ రెండు ఎన్నికల్లోనూ స్వల్ప తేడా తోనే ఆమె ఓడిపోయారు. సహజంగా మంచి వక్త అయిన విజయలక్ష్మికి, రామ్మోహన్ చరిష్మా లేకపోవడం పలు వివాదా లు కొన్ని వర్గాలు ఆమెకు దూరం జరిగేలా చేశాయి.దీంతో రెండు సార్లూ ఓడిపోయారు.

ఇదే స‌మ‌యంలో ఆమె త‌న‌యుడు రాజా దూసుకుపోతున్నారు. ఆయ‌న‌పై ఉన్న న‌మ్మ‌కంతో పార్టీలో అత్యంత కీలకమైన రాష్ట్ర యువజన విభాగానికి అధ్యక్షుడిని చేశారు. మెడిసన్ డిస్కంటీన్యూ చేసిన రాజా.. వైసీపీ పటిష్టం కోసం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతూ అధినేత అడుగుజాడల్లో నడుస్తున్నారు. తండ్రిలాగే అందరిని కలుపు కొని వెళ్లే తత్త్వం ప్లస్ పాయింట్. అంతే కాకుండా తల్లి ఓటమికి గురయినా అటు రాజమండ్రి రూర‌ల్‌, ఇటు రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామస్థాయిలో అందరితో సన్నిహిత సంబంధాలను మెయిన్ టెయిన్ చేస్తున్నారు. దీంతో ఈసారి రాజాన‌గ‌రం నుంచి రాజాను బరిలోకి దించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

ప్ర‌స్తుతం విజ‌య‌ల‌క్ష్మి వైసీపీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. అయితే 2019 ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవిని ఇస్తామనే హామీతో.. ఆమె కుమారుడు రాజాకు టికెట్ ఇస్తామ‌ని సూచించారట‌. దివంగ‌త వైఎస్ఆర్ కి తూర్పుగోదావరి జిల్లాలో ముక్క జక్కంపూడి రామ్మోహన రావు తురుపు ముక్క‌లా ఉండేవారు. ఇప్పుడు ఈ జ‌న‌రేష‌న్‌లో జ‌గ‌న్‌-రాజా జోడి ఏవిధంగా దూసుకుపోతుందో మ‌రి!!