నంద్యాల బై పోల్ ఏక‌గ్రీవం వెన‌క విజ‌య‌మ్మ‌..!

ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌.. నంద్యాల ఉప ఎన్నిక‌! ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో ఇప్పుడు దీనికి బైపోల్ అనివార్య‌మైంది. అయితే, ఇది వైసీపీ గెలిచిన సీటు. త‌ర్వాత పొలిటిక‌ల్ కార‌ణాల నేప‌థ్యంలో భూమా టీడీపీ సైకిల్ ఎక్క‌డం.. అనూహ్యంగా ఆయ‌న మ‌ర‌ణించ‌డం తెలిసిందే. దీంతో ఇప్పుడు అటు టీడీపీ.. ఇటు వైసీపీల‌కు ఈ బైపోల్ ఛాలెంజ్‌గా మారింది. త‌మ పార్టీ సీటే కాబ‌ట్టి బైపోల్‌లో పోటీ చేసే అర్హ‌త త‌మకే ఉంద‌ని వైసీపీ వాదిస్తుండ‌గా.. టీడీపీ మాత్రం త‌మ ఎమ్మెల్యే అని భూమాను ఓన్ చేసుకుంది. దీంతో ఇక్క‌డ పోటీ ర‌సవ‌త్త‌రం కానుంది.

అయితే, ఈ విష‌యంలో వైసీపీ గౌర‌వ అధ్య‌క్షురాలు విజ‌య‌మ్య జోక్యం చేసుకున్న‌ట్టు స‌మాచారం. నిజానికి ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఈ సీటును గెలుచుకోవ‌డం టీడీపీ, వైసీపీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కం. అయితే, ఒక‌ప్ప‌టి వైరి వ‌ర్గాలు శిల్పా బ్ర‌ద‌ర్స్, భూమా వ‌ర్గాలు ఒకే పార్టీలో ఉండ‌డం.. వైసీపీ త‌ర‌ఫున గంగుల ప్ర‌తాప రెడ్డి రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతుండ‌డంతో ఒకింత ఉత్కంఠ‌గా మారింది. దీంతో వార్ వన్ సైడ్ కావ‌డం సాధ్యం కాని ప‌రిస్థితి కానుంది.

మ‌రోప‌క్క‌, “నంద్యాల ఉపఎన్నికలో పోటీ పెడతానని వైకాపా అధినేత జగన్ చెప్పిన నేపథ్యంలో ఏకగ్రీవం అనేది అంత ఈజీ కాదు. అవతలిపక్షం వాళ్లు ఒప్పుకోవాలిగా… వాళ్లు సరేనంటారో లేదో చూడండి” అని ముఖ్యమంత్రి అన్నారట. ఏకగ్రీవం విషయంపై సీఎం నుంచి సానుకూల స్పందన రావడంతో మంత్రి అఖిలప్రియ, కాటసాని రామిరెడ్డి ఈ విషయంపై సీక్రెట్‌గా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

వైకాపాలో కూడా అంతర్గతంగా కాటసాని రామిరెడ్డి పావులు కదుపుతున్నారట. నంద్యాలలో పోటీచేస్తామని జగన్‌ ప్రకటించినందున.. ఏకగ్రీవం అంశం ఆయన దగ్గర ప్రస్తావిస్తే బాగుండదన్న ఉద్దేశంతో… ఈ విషయాన్ని వైఎస్‌ విజయలక్ష్మి దగ్గర ఇటీవల రామిరెడ్డి ప్రస్తావించారట. విజయలక్ష్మి కూడా “భూమా కుటుంబం పార్టీకి చాలా చేశారంటూ” పాజిటివ్‌గా స్పందించారట. దీనిపై జగన్‌తో కూడా మాట్లాడి ఏ విషయాన్ని త్వరలో చెప్తానని విజ‌య‌మ్మ హామీ ఇచ్చిన‌ట్టు తెలిసింది. అయితే, జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.