రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి క్యాండెట్స్ కొర‌త‌

రాయ‌ల సీమ‌! వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి సొంత ప్రాంతం. ఈ ప్రాంతం జ‌గ‌న్‌కి కంచుకోట అనే అనుకుంటారు ఎవ‌రైనా! అయితే, ప‌రిస్తితి అందుకు భిన్నంగా ఉంది. జ‌గ‌న్ ఇప్పుడు ఇక్క‌డ త‌న ప్రాబ‌ల్యాన్ని కోల్పోతున్నార‌ట‌! క‌డ‌ప‌, చిత్తూరు, అనంతపురం, క‌ర్నూలు జిల్లాల్లో జ‌గ‌న్ హ‌వా సాగుతుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ, ప‌రిస్థితి ఇంద‌రు భిన్నంగా ఉంద‌ట‌. ఈ జిల్లాల్లోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జులు కూడా లేర‌ట‌.

నిజానికి గ‌త 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లాను మినహాయిస్తే మిగతా మూడు జిల్లాల్లోనూ వైసీపీ విజయభేరీ మోగించింది. అయితే, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన‌ కొంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోయారు. మరి ఇలా చేరిన వారి నియోజకవర్గాల్లోనే కాదు.. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓడిన కొన్ని నియోజకవర్గాల్లో కూడా పార్టీకి దిక్కూమొక్కూ లేని పరిస్థితి నెలకొని ఉంది.

మ‌రికొన్ని చోట్ల‌ పేరుకు నియోజకవర్గ ఇన్‌చార్జిలు.. జగన్‌ జిల్లాలకు వచ్చినప్పుడు వీరంతా ఆయన వెంట కనిపిస్తారు. అంతే.. మళ్లీ నియోజక వర్గంలో వీళ్లు కనిపించరు. దీంతో కేడ‌ర్‌కి భ‌రోసా ఇచ్చేవారు, కేడ‌ర్‌ను పెంచేవారు క‌రువ‌య్యారు. గడపగడపకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ చాలా నియోజకవర్గాల్లో అది మాత్రం నామమాత్రంగా జరిగింది.

పార్లమెంటరీ నియోజకవర్గల వారీగా చూసుకొంటే.. చాలాచోట్ల నామమాత్రంగా కూడా నేతలు లేకపోవడాన్ని గమనించవచ్చు. ఉదాహరణకు హిందూపురం నియోజకవర్గం. ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీ తెలుగుదేశం నేత నిమ్మల కిష్టప్ప. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండే నేత ఏమీకాదు. కులసమీకరణాలు, తెలుగుదేశం పార్టీకి ఉన్న కేడర్‌ పుణ్యమా అని వరసగా రెండుసార్లు గెలిచారాయన. ఇక్క‌డ ఒకింత ట్రై చేసుకుంటే వైసీపీ పాగా వేయొచ్చు. అయితే, ఆదిశ‌గా జ‌గ‌న్ పావులు క‌ద‌ప‌డం లేదు.

అనంతపురం టౌన్‌, ధర్మవరం, తాడిపత్రి, పుట్టపర్తి, హిందూపురం, శింగనమల, కదిరి, ఉరవకొండ, రాప్తాడు, గుంతకల్‌ నియోజకవర్గాల్లో పార్టీకి మంచి అభ్యర్థులే కనిపిస్తున్నారు. ఇక పెనుకొండ, మడకశిర, కల్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమిటో ఎవరికీ తెలీదు. కర్నూలు.. గెలిచిన వారిలో సగం మంది ఫిరాయించారు, కొన్నిచోట్ల వైకాపా ఓడింది. ఇక్కడ నంద్యాల ఎంపీ సీటుకు, ఆళ్లగడ్డ, నంద్యాల ఎమ్మెల్యే సీట్లకు బలమైన ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి. ఇక కర్నూలు టౌన్‌కు కూడా వైకాపా ధీటైన అభ్యర్థిని రెడీ చేసుకోవాల్సి ఉంది. మ‌రి ఇలాంటి ప‌రిస్థితి నుంచి సీమ‌లో వైసీపీని జ‌గ‌న్ ఎలా గ‌ట్టెక్కిస్తారో చూడాలి.