నంద్యాల‌లో వైసీపీకి హైప్ వెన‌క కుట్ర జ‌రుగుతోందా..!

అవును! అంద‌రూ ఇప్పుడు ఈ విష‌యంపైనే దృష్టి పెట్టారు. నంద్యాల మాదే.. నంద్యాల సీటు మాకే! అంటూ ఊరూ వాడా తిరుగుతూ చాటింపు వేస్తున్నారు వైసీపీ నేత‌లు. అంతేకాదు, రోజా లాంటి ఫైర్ బ్రాండ్ లైతే.. నంద్యాల‌లో గెలుపు ఎవ‌రిదో తెలిసిపోయిందంటూ.. న‌ర్మ‌గ‌ర్భంగా త‌మ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డి గెలిచేశాడ‌ని ఆమె ఆనందంతో ఉబ్బి త‌బ్బిబ్బ‌యిపోతోంది. అదేవిధంగా మిగిలిన నేత‌లు కూడా వైసీపీదే గెలుప‌ని, టీడీపీ కేవ‌లం నామ్‌కేవాస్తే.. పోటీ మాత్ర‌మేన‌ని, నిజంగా వార్ వ‌న్ సైడ్ జ‌రుగుతోంద‌ని, జ‌గ‌న్ ను చూసి నంద్యాల జ‌నాలు “జ‌జ్జ‌న‌క‌రి“ ఆడేస్తున్నార‌ని ఓ పుంఖాను పుంఖానులుగా చెప్పేసుకుంటున్నారు. దీంతో ఒక‌ర‌కంగా ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌కుండానే వైసీపీ విన్నింగ్ మూడ్ లోకి వెళ్లిపోయి.. ఆనందంతో గంతులేస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో విశ్లేష‌కులు వైసీపీ నేత‌ల ప్ర‌చారంపై దృష్టి పెట్టారు. వీరు చెబుతున్న‌ట్టు నిజంగానే నంద్యాల వైసీపీ సొంత‌మా? జ‌గ‌న్‌ను చూసి జ‌నాలు నిజంగానే జై కొడుతున్నారా? వారి ఓట్ల‌న్నీ ఏం జ‌రిగినా.. జ‌గ‌న్ ఖాతాలోకే వెళ్లిపోతాయా? అని జ‌రుగుతున్న చ‌ర్చ‌పై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో తెలిసింది ఏమిటంటే.. ఇదంతా ఓ హైప్ అని!! నిజంగానే నంద్యాల‌లో వైసీపీని త‌ప్పుదోవ పట్టించేందుకు తెర‌వెనుక కొన్ని శ‌క్తులు బ‌లంగా ప‌నిచేస్తున్నాయ‌ని, దీనిని జ‌గ‌న్ తెలుసుకోలేక‌పోతున్నాడ‌ని, అందుకే ఇలా ట్రాప్‌లో చిక్క‌కుపోయి.. తానే గెలిచేసిన‌ట్టు.. త‌న అభ్య‌ర్థి విజ‌యం ఖాయ‌మైన‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకుని, అధికార ప‌క్షంపై దాడి చేస్తున్నాడ‌ని అంటున్నారు.

వైసీపీని రెచ్చ‌గొట్ట‌డంలో భాగంగా కొన్ని శ‌క్తులు జ‌గ‌న్‌కి తిరుగు లేద‌ని, జ‌గ‌న్ అంత‌టి వాడు లేడ‌ని, జ‌గ‌న్‌ను చూసి జ‌నాలు విర‌గ‌బ‌డుతున్నార‌ని లేనిపోని క‌థ‌లు సృష్టిస్తున్నారే త‌ప్ప నిజంగా జ‌గ‌న్‌కి అంత‌లేద‌ని విశ్లేష‌కులు తేల్చి పారేస్తున్నారు. జ‌గ‌న్‌ని ఇలా రెచ్చ‌గొట్టడం వ‌ల్ల జ‌గ‌న్‌.. రెచ్చిపోయి.. అధికార ప‌క్షం టీడీపీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌తాడ‌ని, బాబును నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు అనేస్తాడ‌ని అవ‌న్నీ వైసీపీకి మైన‌స్ అయిపోయి.. అధికార ప‌క్షానికి ప్ల‌స్‌లుగా మారే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ఈ సంద‌ర్భంగా త‌మ మాట‌లు నిజ‌మో కాదో తెలియాలంటే ఒక్క‌సారి 2014లోకి వెళ్లాల‌ని కూడా వారు సూచిస్తున్నారు. అప్ప‌ట్లో కూడా రాష్ట్ర వ్యాప్త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌దే విజ‌యం అని, ఆయ‌నే సీఎం అని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింది. దీంతో నిజంగానే సీఎం సీటు త‌న‌దే అయిపోయినంత ప‌నిగా జ‌గ‌న్‌రెచ్చిపోవ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బాబుకు యాంటీగా ఆయ‌న ఇస్తున్న హామీలు వేస్ట్ అని.. రైతుల రుణ మాఫీ సాధ్యం కాద‌ని, తాను నిజాలే చెబ‌తాన‌ని చెప్పుకొచ్చాడు. ఈ ప్ర‌చారం అప్ప‌ట్లో ఎంత‌మేర‌కు వైసీపీకి లాభించిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు కూడా ఇలాంటి త‌ల‌తిక్క స‌ర్వేల‌నే జ‌గ‌న్ విశ్వ‌సిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వంలోకి జ‌గ‌న్ రావాల్సి ఉంద‌ని, నంద్యాల‌లో జ‌నం వ‌స్తున్నారు కాబ‌ట్టి బ‌లుపు అని అనుకోవ‌డం మంచిదికాద‌ని అంటున్నారు.

అదేస‌మ‌యంలో టీడీపీకి అనుకూలంగా మ‌రింత బ‌లంగా ఉన్న ఐదు అంశాల‌ను ఇక్క‌డ ప్ర‌స్తావిస్తున్నారు… అవి

+ జ‌గ‌న్ జైలుకు వెళ్లి 16 నెల‌లు జైలు కూడు తిన్నాడు. మ‌రి బాబుపై అలాంటి మ‌చ్చ‌లు లేవు.

+ నంద్యాల‌లో ఫుల్లు సెంటిమెంట్ ప‌నిచేస్తోంది. నాగిరెడ్డి పేరు చెబితే.. చాలు అంద‌రి క‌ళ్ల‌లోనూ నీళ్లు తిరుగుతున్నాయి. ఇది బ్ర‌హ్మానంద‌రెడ్డికి ఎదురొచ్చిన వ‌రం.

+ చంద్ర‌బాబును ఉరేయాలి, కాల్చేయాలి, చెప్పుతోకొట్టాలి వంటి వ్యాఖ్య‌లు వైసీపీకి తీవ్ర న‌ష్టం తెచ్చాయి. అదేస‌మ‌యంలో టీడీపీకి బ‌లంగా మారాయి.

+ బ్ర‌హ్మానంద రెడ్డి సౌమ్యుడు, నాగిరెడ్డి వార‌సుడిగా రంగంలోకి వ‌చ్చాడు. చ‌దువుకున్న‌వాడు. కావ‌డంతో ప్ర‌జ‌లు ఆయ‌న‌కు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు, అవినీతి మ‌ర‌క‌లు ఆయ‌న‌పై లేవు.

+ శిల్పా మోహ‌న్‌రెడ్డి విష‌యంలో ఆయ‌న గ‌తంలో ప‌దేళ్లు ప‌ద‌వులు అనుభ‌వించారు. వ్యాపారాలు పెంచుకున్నారు. ప్ర‌జ‌ల‌కు చేసింది ఏమిటి? అని అడిగితే.. క‌నీసం ఓ అర‌గంట పాటు ఆపుకోకుండా చెప్పే ప‌రిస్థితిలోనూ ఆయ‌న లేడు.

సో.. ఇవ‌న్నీ.. టీడీపీకి క‌లిసొస్తున్నాయి. మ‌రి వైసీపీకి క‌లిసొచ్చేవి ఏమిటో అర్ధం కావ‌డం లేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.