ఆ జిల్లాలో జ‌న‌సేన వైపు వైసీపీ క్యాడ‌ర్‌

ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్లే ఉండ‌టంతో ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. 2014లో టీడీపీ, వైసీపీ మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ ఉండ‌గా.. ఇప్పుడు జ‌న‌సే కూడా రంగంలోకి దిగ‌డంతో.. త్రిముఖ పోటీగా మారిపోయింది. ప్ర‌స్తుతం వైసీపీకి పోటీగా జ‌న‌సేన సిద్ధ‌మ‌వుతుండ‌టంతో వైసీపీ నేత‌ల‌తో పాటు కాంగ్రెస్ నేత‌లు కూడా జ‌న‌సేన‌ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఉన్న కేసులు, ప్ర‌జ‌ల్లో ఆయ‌నకు త‌గ్గుతున్న ఆద‌ర‌ణతో వీరిలో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ట‌. దీంతో వైసీపీ నాయ‌కులు, క్యాడ‌ర్‌కు జ‌న‌సేన ఎడారిలో ఒయాసిస్‌లా క‌నిపిస్తోంద‌ట‌.

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లా నుంచి త్వరలోనే క్రీయాశీల రాజకీయ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. దీంతో ఆ పార్టీలోకి వెళ్లే నాయకులు ఎవరనే దానిపై జిల్లా వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. జనసేన వైపు తమ పార్టీ కేడర్ వెళ్లకుండా టీడీపీ ఇప్ప‌టికే చర్యలు చేపట్టింది. అయితే వైసీపీ నుంచి అలాంటి ప్రయత్నాలు జరగకపోవడంతో… జనసేనలోకి వైసీపీ కేడర్ భారీగా తరలివెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

పార్టీ అధినేత‌పై ఉన్న కేసుల్లో ఎప్పుడు ఏ విష‌యం బ‌య‌టికి వస్తుందో తెలియ‌దు! మొన్న‌టికి మొన్న జ‌గ‌న్ బెయిల్ పిటిష‌న్ ర‌ద్దు చేయాల‌ని కోర్టును సీబీఐ కోర‌డంతో క్యాడ‌ర్‌, నాయ‌కులు తీవ్రంగా గంద‌ర‌గోళానికి గుర‌య్యారు. సీబీఐ దాఖ‌లు చేసిన పిల్‌ను రద్దు చేయ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. దీంతో పాటు జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యాలు కూడా బెడిసికొడుతున్నాయి. అంతేగాక గ‌తంతో పోల్చితే కొంత వీక్ అయిన‌ట్లు క‌నిపిస్తున్నాడు. దీంతో ఇక క్యాడ‌ర్ కూడా కొంత అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరితో పాటు వైసీపీలోకి వెళ్లేందుకు ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు సైతం జనసేన వైపు చూస్తున్నారని సమాచారం.

పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లాపై ఫోకస్ చేయడంతో అక్కడి యువత ఆయన వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఎక్కువగా ఉందని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. ఇది వైసీపీపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని అంచనా వేస్తున్నారు. ఇక పవన్ జిల్లా నుంచి పోటీ చేయడం వల్ల వచ్చే ఎన్నికల్లో చాలా స్థానాల్లో త్రిముఖ పోటీ ఉంటుందని… అప్పుడు వైసీపీ కంటే జనసేనే బెటర్ ఛాయిస్ అవుతుందని కొందరు నాయకులు భావిస్తున్నారట. ఇక ఇదే జ‌రిగితే ఈసారి కూడా జ‌గ‌న్ ఆశ‌లు ఆవిరేన‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం!!