సెంటిమెంట్ అస్త్రాలతో టీడీపీ, వైసీపీ ఎన్నికల షో!

క‌ర్నూలు జిల్లా నంద్యాల నుంచి 2014లో ఎన్నికైన సీనియ‌ర్ రాజ‌కీయ నేత భూమా నాగిరెడ్డి హ‌ఠాత్తుగా మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ స్థానంలో ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే, గ‌తంలోనూ రాష్ట్రంలో మూడు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక జ‌రిగినా.. అవి ఏక‌గ్రీవంగా జ‌రిగిపోయాయి. ఎవ‌రూ పోటీకి నిల‌బెట్ట‌లేదు. కేవ‌లం సానుభూతితో వాటిని ఏక‌ప‌క్షం చేశారు. కానీ, నంద్యాల విష‌యంలోకి వ‌చ్చేస‌రికి.. మాత్రం అటు అధికార టీడీపీ, ఇటు వైసీపీ నేత‌లు దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవడంతో ఇప్పుడు ఈ ఎన్నిక రాష్ట్ర‌వ్యాప్తంగా దృష్టిని ఆక‌ర్షించింది. దీనికి కార‌ణం ఏంటంటే.. 2014లో భూమా నాగిరెడ్డి వైసీపీ త‌ర‌ఫున అక్క‌డ గెలిచారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు ఆక‌ర్ష్ మంత్రానికి ముగ్ధుడై.. సైకిలెక్కాడు.

ఈ క్ర‌మంలోనే వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఈ సీటు త‌మ‌దేన‌ని వాదిస్తుండ‌గా.. చంద్ర‌బాబు మాత్రం మా పార్టీలో ఉన్న నేత మ‌ర‌ణించాడు కాబ‌ట్టి ఇది మాదేన‌ని అంటున్నారు. ఇక‌, ఇంకా ఈ ఉప ఎన్నిక‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ విడుద‌ల కాకముందే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పొలిటిక‌ల్ కాక మొద‌లైంది. అటు అధికార పార్టీ కోట్లు కుమ్మ‌రిస్తూ.. అభివృధ్ది పేరుతో ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. సాక్షాత్తూ సీఎం చంద్ర‌బాబు అర్ధ‌రాత్రి వ‌ర‌కు మీటింగులు పెట్టి జ‌నాల్ని త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌త‌య్నిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు వైసీపీ, టీడీపీలు రెండూ భూమా మ‌ర‌ణాన్ని సెంటిమెంట్‌గా చేసుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నాయి. భూమాకు మంత్రి ప‌ద‌విని ఆశ చూపించిన చంద్ర‌బాబు అది ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆయ‌న మ‌ర‌ణించాడ‌ని, వాస్త‌వానికి ఈ సీటు వైసీపీదేన‌ని ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకి బుద్ధి చెప్పాల‌ని వైసీపీ నేత‌లు ప్ర‌చారంలో దంచి కొడుతున్నారు.

ఇక‌, చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే.. త‌ల్లీ దండ్రీ లేని పిల్ల‌ల‌పై పోటీయా ? అంటూ స‌రికొత్త సెంటిమెంట్ అస్ర్తాన్ని వైసీపీపై ప్ర‌యోగిస్తున్నారు. భూమా మ‌ర‌ణించార‌ని, గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ర‌ణించిన స్థానాల్లో తాము ఎప్పుడూ పోటీకి ఎవ‌రినీ నిల‌ప‌లేద‌ని, కానీ, వైసీపీ అధినేత మాత్రం భూమా పై క‌క్ష‌తోనే ఇప్పుడు ఇక్కడ పోటీ పెడుతున్నాడ‌ని అంటూ సెంటిమెంట్‌ను రాజేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. భూమా క‌ల‌లు క‌న్న అభివృద్ధిని తాము చేసి చూపిస్తున్నామ‌ని, ప్ర‌జ‌లు త‌మ‌కే ప‌ట్టం క‌ట్టాల‌ని ఆయ‌న కోరుతున్నారు.

మ‌రోప‌క్క‌, భూమా ఇప్ప‌టికీ వైసీపీ ఎమ్మెల్యే అనే వాద‌న‌ను జ‌నంలోకి బ‌లంగా తీసుకెళ్ల‌బోతున్న‌ట్టు వైసీపీ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. ఇదే త‌రుణంలో ఎమ్మెల్యే చ‌నిపోతే ఆ స్థానంలో ఏక‌గ్రీవం చేయ‌డం అనే సంప్ర‌దాయానికి చంద్ర‌బాబు తూట్లు పొడుస్తున్నారు అనే పాయింట్ ను కూడా ప్ర‌చారాస్త్రంగా మార్చుకుంటున్నారు. మొత్తానికి ఈ రెండు ప‌క్షాల ప్ర‌చారంలో భూమా సెంటిమెంట్ మార్మోగిపోతోంది. మ‌రి నంద్యాల ప్ర‌జ‌లు ఎవ‌రికి ప‌ట్టం క‌డ‌తారో చూడాలి.