వైసీపీ ఎమ్మెల్యేకు కొడుకే షాక్ ఇచ్చాడుగా..!

September 10, 2017 at 8:42 am
YSRCP, nuziveedu mla meka pratap apparao,

ఏపీలో విప‌క్ష వైసీపీకి చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యేకు సొంత కొడుకే షాక్ ఇచ్చాడు. కృష్ణా జిల్లా నూజివీడు వైసీపీ ఎమ్మెల్యేగా మేకా ప్ర‌తాప్ అప్పారావు ఉన్నారు. 2014 మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ప‌ట్ట‌ణంలోని 30 వార్డుల్లో 22 వార్డులు వైసీపీ గెలుచుకుని మునిసిపాలిటీ కైవ‌సం చేసుకుంది. అప్పుడు చైర్మ‌న్ ప‌ద‌వి కోసం రెండు వ‌ర్గాలు పోటీప‌డ్డాయి. మాజీ చైర్మ‌న్ బ‌స‌వా భాస్క‌ర‌రావు వ‌ర్గం నుంచి ఆయ‌న భార్య బ‌స‌వా రేవ‌తికి ముందుగా చైర్మ‌న్ సీటు ఇచ్చారు. ముందు మూడేళ్లు రేవ‌తి ఆ త‌ర్వాత రెండేళ్లు రామిశెట్టి ముర‌ళీ వ‌ర్గానికి చెందిన ఆయ‌న భార్య త్రివేణి దుర్గ‌కు చైర్మ‌న్ పీఠం ఇవ్వాల‌ని అప్ప‌ట్లో ఒప్పందం కుదిరిన‌ట్టు టాక్‌.

బ‌స‌వా రేవ‌తి చైర్మ‌న్ అయ్యి మూడేళ్లు దాటుతున్నా ఆమె త‌న ప‌ద‌విని వ‌దులుకునేందుకు ఇష్ట‌ప‌డడం లేదు. త‌మ స‌మ‌క్షంలో అధికార మార్పిడిపై ఎలాంటి ఒప్పందం జ‌ర‌గ‌లేద‌ని బ‌స‌వా భాస్క‌ర‌రావు వ‌ర్గం చెపుతోంది. దీంతో అధికార మార్పిడిపై ఆశ‌ల‌తో ఉన్న రామిశెట్టి ముర‌ళీ వ‌ర్గానికి చెందిన 8 మంది కౌన్సెల‌ర్లు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసి వాటిని ప్ర‌తాప్‌కు అంద‌జేశారు. ఎమ్మెల్యే ప్రతాప్‌ రాజకీయంలో కీలకపాత్రధారి ఆయన కుమారుడు వేణుగోపాల అప్పారావు ప్రోత్సాహంతోనే కొందరు కౌన్సిలర్లు రాజీనామా అస్త్రాలు ప్రయోగించినట్లు ప్రచారం.

బసవా భాస్కరరావుకు ఎమ్మెల్యే కుమారుడు వేణుకు మధ్య ఉన్న విబేధాల వ‌ల్ల ప్ర‌తాప్ కుమారుడు వేణుగోపాల అప్పారావు మ‌రో వ‌ర్గాన్ని ప్రోత్స‌హించిన‌ట్టు స‌మాచారం. ఎమ్మెల్యే కుమారుడు బ‌స‌వా వ‌ర్గానికి చెందిన రేవ‌తిని ప‌ద‌వి నుంచి దింపేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా నాలుగు సంవ‌త్స‌రాల వ‌ర‌కు చైర్మ‌న్‌పై అవిశ్వాసం పెట్టేందుకు వీలులేదు. దీంతో ఆయ‌న తెర‌వెన‌క నుంచి పావులు క‌దుపుతూ తెలివిగా తాను ప్రోత్స‌హిస్తోన్న రామిశెట్టి వ‌ర్గానికి చెందిన కౌన్సెల‌ర్ల‌తో రాజీనామా అస్త్రం ప్రయోగించిన‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా నూజివీడులో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు మ‌ధ్య జ‌రుగుతోన్న ఈ వార్ ఇప్పుడు జిల్లా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

 

వైసీపీ ఎమ్మెల్యేకు కొడుకే షాక్ ఇచ్చాడుగా..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts