క‌న్నాకు జగన్ బంపర్ ఆఫర్

గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యానికి చివ‌రి మెట్టు వ‌ర‌కూ వ‌చ్చిన వైసీపీ.. ఈ సారి ఎలాగైనా విజ‌య‌తీరాల‌ను అందుకుని అధికారంలోకి రావాల‌ని తీవ్రంగా శ్ర‌మిస్తోంది. అంతేగాక రాజ‌ధాని ప్రాంతంలో ప‌ట్టు కోసం వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌ ఇప్పుడు.. త‌న తండ్రి వైఎస్‌కు అత్యంత ఆప్తులుగా పేరొంది, ఇత‌ర పార్టీల్లో చేరిన నేత‌ల‌పై దృష్టిపెట్టారు. ఇప్ప‌టికే మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి త‌న‌యుడు కాసు మ‌హేశ్‌రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఇప్పుడు బీజేపీ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణను పార్టీలోకి ఆహ్వానిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఆయ‌న‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం.

అన్ని రాష్ట్రాలకు, లోక్‌సభతో పాటే ఎన్నికలు జరపాలన్న ప్రధాని మోడీ యోచిస్తున్న నేప‌థ్యంలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల కోసం అన్వేషణను ప్రారంభించాయి. రాజకీయ చైతన్యం అధికంగా కల గుంటూరు జిల్లాలో ఇది మరింత వేగంగా జరుగుతోంది. వివిధ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలకు ఇప్పటి నుంచే గాలం వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఐదుసీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీటిలో మంగళగిరి, గుంటూరు-1, మాచర్లల్లో ఆ పార్టీ సాధించింది నామ మాత్రపు మెజార్టీనే. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలావాలనే బలమైన కోరికతో ఉన్న వైకాపా అధినేత.. బలమైన అభ్యర్థుల కోసం గాలిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఉండి, వై.ఎస్‌కు అత్యంత సన్నిహితులైన వారిని పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించారు. నర్సరావుపేటలో మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి గురజాల నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించారు. బీజేపీలో చేరినా.. అక్క‌డ ఇమ‌డ‌లేక‌పోతున్న క‌న్నాపై దృష్టిపెట్టారు. పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వై.ఎస్‌ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన రికార్డు ఆయ‌న సొంతం. అందుకే ఆయ‌న్ను పార్టీలోకి రమ్మని రాయబారాలు పంపుతున్నారు. కన్నా కనుక పార్టీలోకి వస్తే ఆయన కానీ, ఆయన కుమారుడు ఫణీంధ్రను కానీ ఇక్కడ నుంచి రంగంలోకి దింపాలని అధినేత భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన బొల్లా బ్రహ్మనాయుడు రాజకీయంగా బలహీనుడు కావడంతో ఇక్కడ పార్టీ ఓడిపోయిందని, బలమైన నేత ఉంటే ఇక్కడ పార్టీ గెలుపు తథ్యమని ఆ పార్టీ అభిమానులు అంటున్నారు. కావేటి మనోహర్‌ను ఇక్కడ తాత్కాలిక ఇన్‌ఛార్జిగా జగన్‌ నియమించినా, ఆయ‌న సరైన అభ్యర్థి కారని, ఆయన స్థానంలో కన్నాను రంగంలోకి దించితే ఇక్కడ పోటీ రసవత్తరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. తనకు గుంటూరు పార్లమెంట్‌ సీటు, తన కుమారునికి అసెంబ్లీ సీటుతో పాటు జిల్లా పెత్తనం మొత్తం తనకు అప్పగిస్తేనే పార్టీ మారాలనే యోచనతో ఆయన ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.