వాళ్ల‌ని దించాలి.. వీళ్ల‌ని ఎత్తాలి.. జ‌గ‌న్‌కు జేజేలు అప్పుడే!!

అవును! జ‌గ‌న్ మారితేనో లేదా ఆయ‌న వ్యూహం మార్చుకుంటేనో త‌ప్ప ఏపీలో ప్ర‌ధాన విప‌క్షంగా ఉన్న వైసీపీకి మ‌నుగ‌డ ఉండ‌ద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 2019లో ఎట్టి ప‌రిస్థితిలోనూ అధికారంలోకి వ‌చ్చి తీరాల‌ని గ‌ట్టి ప‌ట్టుమీదున్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. దానికి అనుగుణంగా త‌న తీరును, పార్టీ న‌డ‌వ‌డిక‌ను మార్చి తీరాల‌ని చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీలో అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌స్తుత విధానానికి త‌క్ష‌ణ‌మే ఫుల్ స్టాప్ పెట్టాల‌ని కూడా సూచిస్తున్నారు. నిజానికి జగ‌న్ 2014లోనే అధికారంలోకి రావాల్సి ఉంది. కానీ, ఒకే ఒక్క కార‌ణంగా ఆయ‌న ప‌ద‌వికి దూర‌మ‌య్యారు. అది `అనుభ‌వం`. ఏపీ ప్ర‌జ‌లు అప్పుడే విడిపోయిన రాష్ట్రానికి అనుభ‌వమున్న వ్య‌క్తి ఉంటే బాగుంటుంది అనే ఒకే ఒక్క ఆలోచ‌న‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ప‌ట్ట‌గ‌ట్టారు. 2019 నాటికి జ‌గ‌న్ పుంజుకుంటాడ‌ని అప్ప‌ట్లో అనేక వ‌ర్గాల ప్ర‌జ‌లు భావించారు.

అయితే, ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూస్తే.. 2019 నాటికి కూడా జ‌గ‌న్ పుంజుకోలేద‌నే భావ‌న ఎక్క‌వ మందిలో క‌నిపిస్తోంది. ముఖ్యంగా తూర్పు, ప‌శ్చిమ‌, గుంటూరు, విశాఖ జిల్లాల్లో ప‌రిస్థితి 2014లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. దీనిని అర్ధం చేసుకోవాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్‌కి ఎంతైనా ఉంది. ఇటీవ‌ల ఆయ‌న ఏరి కోరి బిహార్ నుంచి దిగుమ‌తి చేసుకున్న ఎన్నిక‌ల స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిషోర్ నిర్వ‌హించిన స‌ర్వే కూడా జ‌గ‌న్ అనుభ‌వ లేమి, అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు దూసుకుపోతున్న తీరు స్ప‌ష్టంగా అర్ధ‌మైంది. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఇప్పుడు జ‌గ‌న్‌కి ఎంతైనా ఉంది. అధికారంలోకి రావాల‌ని అనుకున్న వ్య‌క్తిలో ఉండాల్సిన ప్ర‌ధాన ల‌క్ష‌ణం.. ప్ర‌తి వ్య‌క్తినీ అంచ‌నా వేయ‌డం, త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డం. కానీ ఈ రెండూ జ‌గ‌న్‌లో భారీగా లోపించాయి. నంద్యాల ఉప ఎన్నిక‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ ఇది స్ప‌ష్టంగా బ‌య‌ట‌ప‌డింది.

వాస్త‌వానికి నంద్యాల ఉప ఎన్నిక‌ను జ‌గ‌న్ భారీగా ఊహించేసుకున్నారు. త‌న మందీమార్బ‌లంతో అక్క‌డ వాలిపోయారు. తానే స్వ‌యంగా 13 రోజులు మ‌కాం వేసి మ‌రీ ప్ర‌చారం నిర్వ‌హించారు. ఇది పెద్ద త‌ప్పు అని ఆనాడే విశ్లేష‌కులు హెచ్చ‌రించినా ప‌ట్టించుకోలేదు. కావాల‌ని నంద్యాల ఉప ఎన్నిక‌ను అంత పెద్ద‌ది చేసింది జ‌గ‌నే. తాను స్వ‌యంగా రంగంలోకి దిగ‌కుండా పార్టీలో ఉన్న సీనియ‌ర్ల‌ను వినియోగించుకుని ఉండాల్సింద‌ని అప్ప‌ట్లోనే వాద‌న‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా శిల్పా మోహ‌న్ రెడ్డి, చ‌క్ర‌పాణి రెడ్డిల బ‌లాన్ని జ‌గ‌న్ త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డం కూడా పెద్ద దెబ్బ త‌గిలేలా చేసింది. వాస్త‌వానికి మోహ‌న్‌రెడ్డికిగానీ, చ‌క్ర‌పాణి రెడ్డికిగానీ స్థానికంగా మంచి ప‌లుకుబ‌డి, బ‌లం రెండూ ఉన్నాయ‌. గ‌తంలో అంటే 2014లో జ‌రిగిన ఎన్నిక‌లోనూ టీడీపీ అభ్య‌ర్థిగా ఉన్న మోహ‌న్‌రెడ్డికి ఇప్పుడు వ‌చ్చిన ఓట్లే వ‌చ్చాయి. కొత్త‌గా జ‌గ‌న్ మూలంగా ఆయ‌న‌కు ఒరిగింది ఏమీలేదు.

ఈ క్ర‌మంలో నంద్యాల ఉప పోరును శిల్పాకే పూర్తిగా వ‌దిలివేసి.. కాంగ్రెస్‌లో ఉండ‌గా రాష్ట్రానికి అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌ను ఇంచార్జ్‌గా నియ‌మించి ఉంటే ఫ‌లితం వేరేలా ఉండేది. అదేవిదంగా మ‌రికొంద‌రికి ఆ బాధ్యత అప్ప‌గించినా జ‌గ‌న్ పేరు ఇంతగా పోయేది కాదు! ఇక‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కూడా జ‌గ‌న్ చేయ‌కూడ‌ని త‌ప్పు చేశారు. కాకినాడ జ‌నాల‌కు ముక్కు మొహం తెలియ‌ని విజ‌య‌సాయి రెడ్డికి ఈ ఎన్నిక‌ల బాధ్య‌త‌లు అప్ప‌గించారు. కాకినాడ‌లో ఎక్కువ మంది మాస్ జ‌నాలే. వారికి తెలిసిన నేత‌ల‌ను, నిత్యం వారితో క‌లిసి ఉండే నేత‌ల‌ను వారు తొంద‌ర‌గా రిసీవ్ చేసుకుంటారు. ఈ నాడి టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుకు బాగా తెలుసు. అందుకే ఆయ‌న స్థానికంగా బ‌ల‌మైన హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి పైనుంచి తాను ప‌ర్య‌వేక్షించారు. దీంతో ఫ‌లితం అనుకున్న‌ట్టుగానే సాధించారు.

2019లో నైనా జ‌గ‌న్ ఈ వ్యూహాన్ని అనుస‌రించాలి. వైసీపీ అంటే జ‌గ‌న్ పార్టీ అనుకునేలా కాకుండా.. వైసీపీ అంటే.. మ‌న పార్టీ అనుకునేలా నేత‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లేలా, ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేలా వ్యూహం సిద్ధం చేసుకోవాలి. త‌న చేతిలో ఉన్న సీనియ‌ర్ నేత‌లు, కాక‌లు తీరిన రాజ‌కీయ పండితులు బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, కొలుసు పార్థ‌సార‌ధి, మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి వంటివారిని పూర్తిగా వినియోగించుకునే వ్యూహం ర‌చించాలి. పూర్తిగా వారికి అధికారం అప్ప‌గించాలి.అదేస‌మ‌యంలో ఆలోచ‌న లేకుండా ఏదిప‌డితే అది మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల్లో పార్టీని చులక‌న చేస్తున్న రోజా, చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వంటి వారిని ప‌క్క‌న పెట్టాలి. అదేవిధంగా.. యువ నేత‌ల‌కు యాక్టివ్ పార్ల‌న‌ర్ షిప్ క‌ల్పించాలి. అప్పుడ పార్టీ భ‌విష్య‌త్తు ఉజ్వ‌లంగా సాగుతుంది. మ‌రి ఆదిశ‌గా జ‌గ‌న్ మారిన‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి మార‌తాడా?