వైసీపీకి ఈ అత్యుత్సాహం ఏంటో

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ ప్రతిపాదిత అభ్య‌ర్థికి త‌మ ఫుల్ల్ స‌పోర్టు ఉంటుందని.. ఎవ‌రిని నిల‌బెట్టినా త‌మ మ‌ద్ద‌తు ఇస్తామ‌ని అన్ని రాజ‌కీయ పార్టీల‌కంటే ముందే చెప్పి ఆశ్చ‌ర్యానికి గురిచేశారు వైసీపీ అధినేత జ‌గ‌న్‌! రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా రామ్‌నాథ్ కోవింద్ పేరును బీజేపీ ప్ర‌క‌టించ‌డంతో అంతా అవాక్క‌య్యారు. త‌మ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ప్ర‌ధాని మోదీ స‌హా.. అంతా అన్ని రాష్ట్రాల నేత‌ల‌ను కోరుతున్నారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉన్నా.. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.. రామ్‌నాథ్‌తో భేటీ అవ్వ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అప్పుడే రాష్ట్రప‌తిని కాకా ప‌ట్టే ప‌నిలో వైసీపీ ప‌డిపోయిందనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఎన్డీయే రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రామ్ నాథ్ కోవింద్ కు అన్ని రాజ‌కీయ‌ పార్టీల మ‌ద్ద‌తునూ కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నంలో బీజేపీ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఇప్ప‌టికే ఎన్డీయేకు బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏపీ విప‌క్షం వైసీపీ కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. గతంలో ప్ర‌ధాని మోదీని జ‌గ‌న్ క‌లిసిన‌ప్పుడే… రాష్ట్రప‌తి అభ్య‌ర్థికి త‌మ పార్టీ మ‌ద్ద‌తు ఎన్డీయే అభ్య‌ర్థికే అంటూ జ‌గ‌న్ చెప్పేశారు. ఇప్పుడు రామ్ నాథ్ పేరును భాజ‌పా ప్ర‌క‌టించాగానే మ‌రోసారి త‌న మ‌ద్ద‌తును జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అయితే రామ్ నాథ్ పేరు ప్ర‌క‌టించ‌గానే వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయి రెడ్డి హుటాహుటిన పాట్నాకి వెళ్లి కోవింద్‌ను క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇప్ప‌టికిప్పుడు కాబోయే రాష్ట్రప‌తిని వైసీపీ ఎంపీ ఆగ‌మేఘాల మీద వ్య‌క్తిగ‌తంగా క‌లిసి రావాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది అనేదే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాబోయే రాష్ట్రప‌తిని ఇప్ప‌ట్నుంచే కాకాప‌ట్టేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేశార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు, అస‌లు విష‌యం ఇంకా ఉంది! ఈ మ‌ధ్య రాష్ట్రప‌తి ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారంటూ కొంత‌మంది ప్ర‌ముఖుల పేర్లు తెర మీదికి వ‌చ్చాయి! వారంద‌రినీ విజ‌య‌సాయి రెడ్డి క‌లుసుకుని వైసీపీ స్టాండ్ ఇదే అంటూ విజ‌య‌సాయి వివ‌రించి వ‌చ్చార‌ట‌!

రాష్ట్రప‌తి ఎన్నిక‌ల విష‌యంలో ఎన్డీయేకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి వైసీపీ ఎందుకింత అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యంపై ప్ర‌ధాని మోదీని క‌లిసి చెప్ప‌గానే.. విమ‌ర్శ‌లు గుప్పుమ‌న్న విష‌యం తెలిసిందే! ఇలాంటి ప‌రిస్థితుల్లో రాష్ట్రప‌తి అభ్య‌ర్థుల‌తో ముందే భేటీ కావాల్సిన అవ‌స‌రం వైసీపీకి ఏమొచ్చింది అనే ప్ర‌శ్న వినిపిస్తోంది. మ‌రి ఇప్పుడు విజ‌యసాయిరెడ్డి.. కోవింద్‌ను క‌ల‌వ‌డం వెనుక కూడా ఏదో వ్యూహం ఉండే ఉంటుంద‌ని అంతా భావిస్తున్నారు. ఇక వైసీపీ అత్యుత్సాహం ఆ పార్టీని, జ‌గ‌న్‌ను చుల‌క‌న‌చేసింద‌న్న టాక్ కూడా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వినిపిస్తోంది.