నంద్యాల‌లో వైసీపీ గెలుపు ఆశ‌లు ఇవే

అవును! ఇప్పుడు ఆపార్టీ నంద్యాల ఉప పోరులో గ్రామాల‌పైనే ఆశ‌లు పెట్టుకుంది. ముఖ్యంగా గోస్పాడు వంటి అతి పెద్ద గ్రామాల‌ను టార్గెట్ చేసుకుని ఆ పార్టీ దూసుకుపోయింది. అదేవిధంగా జ‌గ‌న్ కూడా గ్రామాల్లోనే ప‌ర్య‌ట‌న ఎక్కువ‌గా చేశాడు. దీంతో జ‌గ‌న్ స‌హా అంద‌రూ ఇప్పుడు ఓటింగ్ స‌ర‌ళిపై చ‌ర్చిస్తూ.. త‌మ‌ను దీవించేదీ, అధికారం అప్ప‌గించేదీ ఒక్క గ్రామాలేన‌ని స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చారు. ప‌ట్ట‌ణంలో ఎలాగూ టీడీపీ హావా స‌హా.. ప్ర‌భుత్వ అభివృద్ధి అజెండా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దీంతో ప‌ట్ట‌ణ ఓట‌ర్లు.. చంద్ర‌బాబు ప్ర‌చారానికీ, టీడీపీ నేత‌ల ఆశ‌ల‌కు లొంగిపోతార‌ని, వైసీపీ వైపు మొగ్గు చూప‌ర‌ని అంటున్నారు.

ముఖ్యంగా గత ఎన్నికల ఫలితాలను పరిశీలించిన‌ప్పుడు అప్పటి వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి గోస్పాడు, నంద్యాల రూరల్ మండలాల్లో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఓట్లతోనే విజయం సాధించారు. అయితే బుధ‌వారం నాటి పోలింగ్ సరళిని చూస్తే గ్రామాల్లో ఎక్కువ శాతం ఓట్లు నమోదయ్యాయి. వికలాంగులు, వృద్ధులు, మహిళలు, బాలింతల.. ఇలా ఒకరేమిటి గ్రామాలలో పెద్దయెత్తున ఓటర్లు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం తమకు శుభ సంకేతమేనంటోంది వైసీపీ. వీరంతా త‌మ‌కే ఓట్లు వేశార‌ని వైసీపీ అభ్య‌ర్థి శిల్పా పోలింగ్‌ ముగిసిన మ‌రుక్ష‌ణ‌మే ప్ర‌క‌టించిన దానిని బ‌ట్టి వైసీపీ భ‌రోసా తెలుస్తోంది. అందుకోసమే గ్రామాల్లో ఎన్ని ఓట్లు ఎక్కువ పోలయితే అంత మంచిదని వైసీపీ మొద‌టి నుంచి ప్లాన్ చేసింది.

ఇక‌, టీడీపీ మాత్రం ప‌ట్ట‌ణ ఓట‌ర్ల‌పైనే ఆశ‌లు పెట్టుకుంది. చివ‌రి గంట‌లో ఈ ప‌ట్ట‌ణ ఓట‌ర్ల‌ను పోలింగ్ కేంద్రంలోకి మ‌ళ్లించే విష‌యంలోనే ఇరు పార్టీల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ చోటుచేసుకుంది. గ్రామాల‌లో వైసీపీ హ‌వా స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని టీడీపీ నేత‌లు ముఖ్యంగా అభ్య‌ర్థి బ్ర‌హ్మానంద‌రెడ్డి, అఖిల ప్రియ‌లు ఒప్పుకోవ‌డం గ‌మ‌నార్హం. అయితే, దీనిని త‌గ్గించామ‌ని వారు స‌మ‌ర్ధించుకున్నారు. కానీ, గ్రామాల్లో ఆ రకంగా కుదిరేపని కాదు.

వైఎస్ హ‌యాంలో వారంద‌రికీ పింఛ‌న్లు, ఆరోగ్య శ్రీద్వారా ఆప‌రేష‌న్లు చేయించారు. దీంతో గ‌తంలో ఇందిర‌మ్మ‌, అన్న‌గారికి ఉన్న ఫాలోయింగ్ ఇప్పుడు వైఎస్‌కి ఉంది. దీనిని చెరిపేయ‌డం బాబు వ‌ల్ల‌కాద‌నేది జ‌గ‌న్ ధీమా. అందుకే వీరంతా ఇప్పుడు గ్రామాల ఓటింగ్‌తోనే గెలుస్తామ‌ని గ‌ట్టి ధీమాగా ఉండ‌డం గ‌మ‌నార్హం.