విజయం తుమ్మలది…క్రెడిట్ కేటీఆర్‌ది..!

రాజకీయాల్లో, ఇంకా చెప్పాలంటే ఎన్నికల్లో ‘క్రెడిట్’ గొడవ ఎక్కువగా ఉంటుంది. అపజయానికి ఎవ్వరూ బాధ్యత తీసుకోరుగాని విజయం సాధిస్తే మాత్రం దాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని నాయకులు ప్రయత్నాలు చేస్తారు. కొందరు నాయకులు క్రెడిట్ తమేక దక్కాలని నేరుగా చెప్పకపోయినా అనుచరులతో, వంధిమాగధులతో ప్రచారం చేయిస్తారు. ఈ విషయంలో మీడియాలోనూ అనేక కథనాలు వస్తుంటాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జయాపజయాలపై మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

ఎవరు ఎందుకు ఓడిపోయారో, ఎవరు ఎందుకు గెలిచారో, ఎవరి భవిష్యత్తు ఏమిటో, ఈ ఎన్నికల ప్రభావం రాబోయే సాధారణ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో….ఇలా అనేక కోణాలపై మీడియాలో రాజకీయ విశ్లేషణలు సాగుతున్నాయి. ఇంకా కొన్ని రోజుల వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతుండగానే అందుకు సమాంతరంగా తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఘన విజయం గురించీ చర్చిస్తున్నారు. ఇది ఉప ఎన్నిక అయినా మీడియాలో దీనికీ ప్రాధాన్యం దక్కింది. చివరకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాలేరు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం సాధించినందుకు కేసీఆర్‌ను అభినందించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన బెంగాల్ దీదీ మమతకు, తమిళనాడు అమ్మకు అభినందనలు తెలిపిన మోదీ కేసీఆర్‌నూ అభినందించడం విశేషమే. మోదీ రాజకీయంగా కేసీఆర్‌కు దగ్గరవ్వాలనే ఉద్దేశంతో అభినందనలు చెప్పారా? మిగతా విజేతలకు చెప్పారు కాబట్టి అందులో భాగంగా చెప్పారా? లేదా ఉప ఎన్నిక ప్రాధాన్యాన్ని గుర్తించారా? అనేది తెలియదు. వాస్తవం చెప్పాలంటే పాలేరు ఉప ఎన్నిక హోరాహోరీగా జరిగింది. ప్రతిపక్షాలు శక్తివంచన లేకుండా పోరాడాయి. బీజేపీ, సీపీఎం కూడా మద్దతు ఇచ్చివుంటే బాగుండేదనే అభిప్రాయమూ వ్యక్తమైంది. తుమ్మల లక్ష ఓట్ల మెజారీటీతో గెలుస్తాడని టీఆర్‌ఎస్ నాయకులు అదేపనిగా ఊదరగొట్టినా అందులో దాదాపు యాభై శాతం సాధించారు. పాలేరులో ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ఇదే టాప్ మెజారిటీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఇంతకూ ఈ హయ్యస్ట్ మెజారిటీకి కారణం తుమ్మల కున్న ప్రజాదరణా? చరిష్మానా? లేదా మంత్రి కేటీఆర్ వ్యూహరచనా? మాయాజాలమా? ఇప్పుడు ఇదొక చర్చనీయాంశంగా మారింది.

కేటీఆర్ ప్రచారం చేస్తే టీఆర్‌ఎస్ గెలుపు గ్యారంటీ అనే అభిప్రాయం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఘన విజయం తరువాత బాగా పెరిగిపోయింది. ఇదివరకు కేసీఆర్ తరువాత హరీష్‌రావును వ్యూహరచనా నిపుణుడిగా పరిగణించేవారు. ఇప్పడు కేటీఆర్ పేరు చెబుతున్నారు. కొంతకాలం కిందట జరిగిన ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో టీఆర్‌ఎస్ ఘన విజయం కేటీఆర్ ఖాతాలోకే వెళ్లింది. ఇప్పుడు పాలేరు ఘన విజయాన్ని ఆయన ఖాతాలోనే వేస్తున్నారు గులాబీ నాయకులు. తుమ్మల గట్టి నాయకుడైనప్పటికీ పాలేరుకు కుమారుడు కేటీఆర్‌ను ఇన్‌చార్జిగా నియమించారు కేసీఆర్. అందుకు తగ్గట్టుగానే ఆయన ఉధృతంగా ప్రచారం చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే తుమ్మల కంటే కేటీఆర్ దూకుడుగా ప్రచారం చేశారు. పాలేరులో టీఆర్‌ఎస్ ఓడిపోతే తాను మంత్రి పదవి వదులుకుంటానని, ఉత్తమ్ కుమార్ పీసీసీ అధ్యక్ష పదవి వదులుకుంటారా? అని సవాలు చేశారు. వ్యూహ రచన చేయడంతోపాటు నియోజకవర్గంలోని మండలాల్లో విసృ్తతంగా పర్యటించారు. తండ్రి మాదిరిగానే కేటీఆర్‌కు మాట చాతుర్యం ఎక్కువ. ఆయన తన ప్రసంగాలతో జనాన్ని బాగా ఆకట్టుకున్నారు. ప్రతిపక్షాలు కలసికట్టుగా పోటీ చేసినా కేటీఆర్ వ్యూహరచన ముందు నిలబడలేకపోయాయి.

తుమ్మల విజయంలో కేటీఆర్‌దే ప్రధాన పాత్ర అనేది ఎక్కువమంది అభిప్రాయం. పాలేరు ఉప ఎన్నికకు ముందు తుమ్మల నాగేశ్వరరావును ఒక టీవీ ఛానెల్ ‘కాబోయే ముఖ్యమంత్రి’ ప్రశ్నతో ఇరుకున పెట్టాలని చూసింది. ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న మంత్రి కేటీఆర్‌ను నియమించారు కేసీఆర్. ఈ ప్రశ్నకు మరో నాయకుడైతే అత్యంత వినయ విధేయతలతో సమాధానం ఇచ్చేవాడేమో. కాని తుమ్మల ‘ఒకవేళ కేటీఆర్ ముఖ్యమంత్రయ్యే పరిస్థితి వస్తే నేను మద్దతు ఇవ్వను’ అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. తాను వంశపారంపర్య పాలనకు వ్యతిరేకినని, తన మద్దతు, విధేయత కేవలం కేసీఆర్‌కే పరిమితమని అన్నారు. ఈ కామెంట్ కేటీఆర్ దృష్టికి పోకుండా ఉండదు. అయితే కేటీఆర్‌కు తుమ్మల ప్రధానం కాదు. పార్టీ ముఖ్యం. తుమ్మల స్థానంలో మరొకరున్నా కేటీఆర్ తీవ్రంగా ప్రచారం చేసేవారే.