కాపు నేతల్లో కుమ్ములాటలు!!

June 16, 2016 at 10:39 am

ముద్రగడ దీక్షను అడ్డుపెట్టుకుని ప్రాబల్యం కోల్పోయిన కాపు ప్రముఖులు తమ ఇమేజ్ పెంచుకోవాలన్న ఎత్తుగడతో ఉన్నారా? మరికొందరు ముద్రగడ భుజంపై తుపాకి పెట్టి బాబుకు గురిపెట్టారా? వారి కలయిక వల్ల కులానికి నష్టమే తప్ప లాభం లేదా? అధికారంలో ఉన్నప్పుడు కనిపించని వీళ్లంతా ఇప్పుడు గళం విప్పడాన్ని సొంత సామాజికవర్గమే నమ్మడం లేదా? కాపు సంఘాలు, నాయకుల మాటల బట్టి ఇలాంటి సందేహాలే తెరపైకొస్తున్నాయి.

రంగాను పోగొట్టుకున్నాం. ముద్రగడను కోల్పోయేందుకు సిద్ధంగా లేమన్న నినాదంతో ఒకే వేదికపైకొచ్చిన కాపు ప్రముఖల విశ్వసనీయతపై సొంత సామాజికవర్గంలోనే చర్చ జరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రులయిన దాసరి, చిరంజీవి, పళ్లంరాజు, రాష్ట్ర మాజీ మంత్రులయిన బొత్స సత్యనారాయణ, సి.రామచంద్రయ్య తదితరులు హాజరయిన సమావేశంలో.. ముద్రగడ దీక్షపై సర్కారు దిగిరాకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పిన వైనంపై కాపు వర్గాల్లో భిన్నాభిప్రాయాలు, వాదనలు వినిపిస్తున్నాయి.

కేంద్రమంత్రిగా పనిచేసిన చిరంజీవి పీఆర్పీ అధ్యక్షుడిగా గానీ, తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ముందు గానీ కాపుల గురించి మాట్లాడలేదని, ఇప్పుడు తెరపైకొచ్చి కాపులకు జరుగుతున్న అన్యాయం గురించి బాధపడటం ఆశ్చర్యంగా ఉందని కాపు సంఘాలు విమర్శిస్తున్నాయి. అసలు చిరంజీవి తన పార్టీ విలీన సమయంలో కాంగ్రెస్‌కు షరతు విధించి ఉంటే, వైఎస్ దానిని అమలుచేసి ఉండేవారని, ఆ పని చేయకుండా చిరంజీవి తన స్వార్థం చూసుకున్నారని కాపునేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

దాసరి కూడా చాలాకాలం కేంద్రమంత్రిగా పనిచేసినా, ఎప్పుడూ కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేసిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు. నిజానికి తమ కులంలో చిరంజీవి కంటే దాసరికే ఎక్కువ ఇమేజ్ ఉన్నప్పటికీ, ఆయన దానిని తమ కుల ప్రయోజనాల కోసం పణంగా పెట్టలేదని స్పష్టం చేస్తున్నారు. వ్యక్తిగతంగా కాపునేతలకు సాయపడినప్పటికీ, తమ జాతి కోసం ఆయన చేసిందేమీలేదంటున్నారు.

పీసీసీ అధ్యక్షుడు, మంత్రిగా పదేళ్లు కీలకపాత్ర పోషించిన బొత్స సత్యనారాయణ కాపు కార్డు అడ్డుపెట్టుకుని సీఎం పదవి కోసం ప్రయత్నించారే తప్ప, తమకు చేసిందేమీ లేదన్న విమర్శలు కాపు సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. వైఎస్ సన్నిహితుడిగా కాపులను బీసీల్లో చేర్పించే అవకాశం ఉన్నప్పటికీ, అందుకోసం పోరాడిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు.
మంత్రిగా పనిచేసిన సి.రామచంద్రయ్య కూడా కాపుల కోసం చేసిందేమీ లేదని, కాపులను బీసీల్లో చేర్పించాలని ఏనాడూ క్యాబినెట్‌లో ముఖ్యమంత్రులపై ఒత్తిడి చేసిన దాఖలాలు లేవంటున్నారు.

వైసీపీ నేతగా ఒకరు, కాంగ్రెస్ నేతగా మరొకరు చంద్రబాబుపై తమకున్న వ్యక్తిగత వ్యతిరేకతతోనే మాట్లాడుతున్నారు తప్ప, తమ కోసం కాదని కాపునేతలు విశ్లేషిస్తున్నారు. కేంద్రమంత్రిగా పనిచేసిన పళ్లంరాజు తన పదవీకాలంలో కనీసం కార్యకర్తలను కూడా దగ్గరకు రానిచ్చిన సందర్భాలు లేవని గుర్తుచేస్తున్నారు. పదవి వదులుకున్న ముద్రగడకు, పదవులు పట్టుకుని వేళ్లాడిన వీరికి పోలికే లేదని స్పష్టం చేస్తున్నారు.

పదవుల్లో ఉన్నప్పుడు తమ కోసం ఏమీ చేయకుండా, కాపులను బీసీల్లో చేర్చాలని అధిష్ఠానం, అప్పటి ముఖ్యమంత్రులపై ఒత్తిడి చేయకుండా, ఇప్పుడు ముద్రగడ దీక్ష ముసుగులో తెరపైకి రావడం తమ మనుగడ కోసమేనన్న వ్యాఖ్యలు మెజారిటీ కాపుల్లో వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓడిపోయి, ఖాళీగా ఉన్న తమ నేతలంతా ముద్రగడ దీక్ష పేరు చెప్పి, మళ్లీ రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నా వారికి తమ జాతిలో విశ్వసనీయత ఎప్పుడో పోయిందని స్పష్టం చేస్తున్నారు.

కాపు నేతల్లో కుమ్ములాటలు!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts